వచ్చే ఎన్నికల్లో మీ అందరి గెలుపే కీలకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చే ఎన్నికల్లో మీ అందరి గెలుపే కీలకం

వచ్చే ఎన్నికల్లో మీ అందరి గెలుపే కీలకం

Written By news on Thursday, August 18, 2016 | 8/18/2016


అమీతుమీ తేల్చుకుందాం
♦ ‘గడప గడపకూ వైఎస్సార్’పై జగన్ సమీక్ష
♦ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో వెనుకంజ లేదు..
♦ ప్రజలకు దగ్గరవ్వాలి నిర్లక్ష్యాన్ని సహించం
♦ వచ్చే ఎన్నికల్లో మీ అందరి గెలుపే కీలకం
♦ సమన్వయకర్తలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు రెండున్నరేళ్లుగా సాగుతున్న దుర్మార్గపు పాలనపై అమీ తుమీకి సిద్ధపడేలా పార్టీని తీర్చిదిద్దాలని, అందుకోసం ప్రతిపక్ష పార్టీగా నిరంతరం ప్రజల్లో మమేకమై పని చేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్...’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును సమీక్షించారు.
సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటంలో పార్టీ నేతలు ఏ మాత్రం వెనుకంజ వేయరాదని, ప్రజల పట్ల గల బాధ్యతను విస్మరించకూడదని చెప్పారు. ‘గడప గడపకూ వైఎస్సార్...’ కార్యక్రమం ప్రకటించినపుడు పార్టీ నేతలు పలువురు సంశయానికి గురయ్యారని, అయితే క్రమంగా ప్రజల్లో వస్తున్న స్పందనతో నేతల్లో విశ్వాసం ఇనుమడించిందనే విషయం ఈపాటికే గ్రహించి ఉంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందనేది స్పష్టమవుతోందని, నిర్దేశించుకున్న కాల పరిమితి మేరకు మరింత పటిష్టంగా దీనిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటుగా ఇదే క్రమంలో పార్టీ పునాదులు గట్టిగా నిర్మించుకోవాలని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై అధికారపక్షం అనేక అంశాల్లో సాగిస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టేలా పార్టీశ్రేణులు ఈ కార్యక్రమంలో వ్యవహరించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉండే  వారిని జనం ఎపుడూ ఆదరిస్తారని, అందుకే తాను ఈ కార్యక్రమం గురించి ఇంతగా మాట్లాడుతున్నానని తెలిపారు. గడప గడప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇప్పటికే పదవుల్లో ఉన్న వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
ప్రజల కష్టసుఖాల్లో వారితో ఉన్నవారికి విజయం సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ‘మీ అందరి గెలుపే కీలకం’ అందుకే తాను అప్రమత్తం చేస్తున్నానని వివరించారు. ఆయా జిల్లాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా జిల్లా అధ్యక్షులపై ఉంటుందని, ఎంపీలు కూడా తరచూ పాల్గొంటూ ఉండాలని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లినపుడు వారు చెప్పే సమస్యలను పరిష్కరిస్తామని గట్టి భరోసా కూడా వారికివ్వాలని జగన్ నేతలకు సూచించారు.
రైతు, మహిళా, యువ, విద్యార్థి విభాగాలను పటిష్టం చేయాలి
పార్టీ అనుబంధ సంస్థల్లో ప్రధానంగా రైతు, మహిళా, యువ, విద్యార్థి విభాగాలను పటిష్టం చేయాలని జగన్ సూచించారు. తక్షణమే వీటి నిర్మాణానికి పూనుకోవాలని, ఆరు నెలల్లో అన్ని స్థాయిల్లోనూ కమిటీలు వేయాలని, గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని ఇందుకు సావకాశంగా మలుచుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డాక్టర్, లీగల్ విభాగాలను క్రమంగా బలోపేతం చేసుకుంటూ రావాలన్నారు. పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ముఖ్యనేతలు వి.విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చంద్రబాబు ఫెయిల్ అయ్యారు: తమ్మినేని
రెండున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారని పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. సమీక్ష అనంతరం ఆయన సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తూ... ఎన్నికలపుడు ఇచ్చిన వందలాది హామీల్లోనుంచి వంద ప్రశ్నలను ఎంపిక చేసి తాము రూపొందించిన ప్రజాబ్యాలట్‌పై అభిప్రాయం తెలపడానికి ప్రజలు చాలా ఆసక్తి చూపించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో తాము గడప గడప కార్యక్రమానికి వెళ్లినపుడు విద్యార్థులు ప్రజాబ్యాలట్‌లను తమ వద్ద అడిగి తీసుకుని... ‘సార్ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారు... సున్నా మార్కులొచ్చాయి’ అని చెప్పారని తెలిపారు.
తమకిచ్చిన హామీలను నెరవేర్చనందువల్ల ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా, ఎప్పుడు చంద్రబాబుకు బుద్ధి చెబుదామా అని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రజల నిరసన ఎలా ఉందనేది ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తమ పార్టీ ఇచ్చిన బంద్ విజయవంతం కావడంతోనే అర్థమైందని తెలిపారు. 40 రోజులుగా నడుస్తున్న ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం వందశాతం దిగ్విజయంగా సాగిందని సమీక్షా సమావేశంలో వెల్లడైందన్నారు. నెలలో 16 రోజులకు ఏ మాత్రం తగ్గకుండా గడప గడప కార్యక్రమం సాగాలని, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా తమ పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్దేశించారని ఆయన తెలిపారు.
Share this article :

0 comments: