బంద్ విచ్ఛిన్నానికి అధికారపార్టీ కుట్రలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంద్ విచ్ఛిన్నానికి అధికారపార్టీ కుట్రలు

బంద్ విచ్ఛిన్నానికి అధికారపార్టీ కుట్రలు

Written By news on Tuesday, August 2, 2016 | 8/02/2016

నేడు ఏపీ బంద్
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ పోరాటం
బీజేపీ, టీడీపీల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన
బంద్‌కు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్, వామపక్షాలు
మద్దతు పలికిన ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు
ర్యాలీలకు ఆర్టీసీ సంఘాలు  సిద్ధం..
బంద్ విచ్ఛిన్నానికి అధికారపార్టీ కుట్రలు
విపక్షనేతలను నిర్బంధించాలని పోలీసులకు ఆదేశాలు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంజీవని వంటి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు నేడు రాష్ర్టవ్యాప్త బంద్.

కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలతో పాటు పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి, యువజన సంఘాలు ఈ బంద్‌కు  సంపూర్ణ మద్ధతు  ప్రకటించాయి. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు కూడా ప్రత్యేక హోదా సాధనకు జరిగే బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఎక్కడికక్కడ బంద్ విజయవంతం చేసేందుకు ఆయా పార్టీల నేతలు  ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ బంద్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మరోవైపు ఈ బంద్‌ను ఎలాగైనా విచ్ఛిన్నం చేయడానికి అధికారపార్టీ కుట్రలు పన్నుతోంది. ప్రతిపక్షాల నాయకులను ముఖ్యంగా వైఎస్సార్సీపీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని దూరంగా ఉండే పోలీసు స్టేషన్లలో నిర్బంధించాల్సిందిగా పోలీసులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

రాష్ట్రానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ప్రత్యేకహోదాను సాధించడానికి సహకరించాల్సింది పోయి అందుకోసం ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపడానికి అధికారపార్టీ ప్రయత్నించడాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. బంద్‌ను విఫలం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
సర్వం సమాయత్తం...
రాజ్యసభలో ఈ నెల 28, 29 తేదీల్లో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంలో ఏపీకి హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక ఉద్యమాలు ఉధృతం చేస్తే తప్ప రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరదని భావించిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బంద్ పాటించి తమ నిరసనను ఎలుగెత్తి చాటాలని పిలుపు నిచ్చారు. మంగళవారం జరిగే ఈ బంద్‌కు రెండు రోజుల ముందు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాయి.

బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ పద్రర్శనలు, ర్యాలీలు నిర్వహించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రతినిధులు కూడా బంద్‌ను స్వచ్ఛందంగా నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. ఇది ఒక్కరిద్దరి సమస్య కాదని, ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా అందరూ విశ్వస్తున్నారు. రెండేళ్లుగా ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చినపుడల్లా... ‘అదేమైనా సంజీవనా...!’ అంటూ తీసిపారేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరు గార్చి నందువల్లనే విభజన సమయంలో ఐదు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభ సాక్షిగా ప్రకటించిన బీజేపీ నేతలు ఇపుడు మాట మార్చారనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

చంద్రబాబు, టీడీపీ కేంద్ర మంత్రులు ‘హోదా వస్తుందని... తెస్తామని....’ తడవకో మాట మారుస్తూ  రెండేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ నాటకాలు ఆడుతూ వస్తున్న అంశాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. మంగళవారం బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం ద్వారా తమ ఆకాంక్షను ఎలుగెత్తి చాటాలని వారు ఉద్యుక్తులవుతున్నారు.  
 
బంద్‌కు ఆర్టీసీ యూనియన్ల మద్దతు

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ యూనియన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్లు ప్రత్యేక హోదా డిమాండ్‌తో అన్ని డిపోల వద్ద ధర్నాలు, నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఎన్‌ఎంయూ నేతలు చల్లా చంద్రయ్య, వై.శ్రీనివాసరావు, ఈయూ నేతలు పద్మాకర్, దామోదరరావు ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఆర్టీసీకి రావాల్సిన ప్రయోజనాల్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
 
విచ్ఛిన్నానికి అధికారపార్టీ కుట్రలు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో పూర్తిగా విఫలమైన అధికార తెలుగుదేశం పార్టీ విపక్షాల ఆందోళనలను విచ్ఛిన్నం చే సే కుట్రలకు సిద్ధమైంది.  బంద్ విజయవంతమైతే కేంద్ర ప్రభుత్వంతో తాము కలసి ప్రత్యేక హోదా రాకుండా ఆడుతున్న  నాటకం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో అధికార పార్టీ కుట్రలకు తెరతీసింది. బంద్‌ను విఫలం చేసేందుకు విపక్ష నేతలను ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులకు ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మంగళవారం బంద్ ప్రారంభం అయ్యే సమయానికి  ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ నేత ఇల్లుదాటి రోడ్డుపైకి రాకూడదని, ఒకవేళ ఎవరైనా రోడ్డుపైన కనపడితే వెంటనే అదుపులోకి తీసుకుని సుదూర ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించినట్లు సమాచారం.  ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోనైనా ఆ పార్టీ నేతలు రోడ్ల మీదకు వస్తే స్థానిక పోలీస్ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అంతర్గతంగా ఆదేశాలు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలో  ఎక్కడా బంద్ ఛాయలు కనిపించకూడదని, ఆర్‌టీసీ బస్సులు రోడ్డుపైకి రాకపోతేనే బంద్ ఛాయలు కనపడతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులపై ఏదో ఒక రకంగా ఒత్తిడి తెచ్చి బస్సులను బలవంతంగా నడిపించాలని పోలీస్, ఆర్ టీసీ అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తమకు అందిన మౌఖిక ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసులు ఎప్పటికపుడు వైఎస్సార్‌సీపీ నేతల కదలికలను తెలుసుకుంటున్నారు. వారు బంద్‌కు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారో తెలుసుకుని  ఉన్నతాధికారులకు ఎప్పటికపుడు సమాచారం అందిస్తున్నారు. వారి సమాచారం ఆధారంగా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
 
బంద్ రోజు నిరాహారదీక్షలు...
ఇదిలా ఉంటే విపక్షాల బంద్‌ను తక్కువ చేసి చూపటంతో పాటు తాము ప్రత్యేక హోదాకై చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్న కలర్ ఇచ్చేందుకు విపక్షాల బంద్ రోజునే ఆందోళనలు, నిరాహారదీక్షలు చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు అధిష్టానం సమాచారం పంపింది. దీంతో పలువురు  నేతలు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరాహారదీక్షలకు శ్రీకారం చుట్టారు.

పలు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలు జరగనున్నాయి. చంద్రబాబు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ బంద్‌లు సరికాదని, జపాన్ తరహాలో నిరసనలు తెలపాలన్నారు. తాము శాంతియుతంగా ప్రత్యేక హోదాకై ఆందోళన చేశామని చెప్పుకునేందుకు మంగళవారం టీడీపీ నేతలు మొక్కలు నాటడం, రోడ్లు ఊడ్చటం వంటివి చేయాలనుకోవడం ముందస్తు వ్యూహంలో భాగమేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
 
జీవన్మరణ సమస్య ఇది... శాంతియుతంగా నిర్వహించండి
జిల్లా అధ్యక్షులకు జగన్ ఫోన్

ఏపీకి ప్రత్యేక హోదా అనేది జీవన్మరణ సమస్య అని, దాని సాధన కోసం జరిగే ఈ బంద్‌ను సంపూర్ణంగా శాంతియుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. బంద్ జరుగనున్న నేపథ్యంలో ఆయన సోమవారం తన నివాసం నుంచి 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, పలువురు ముఖ్య నేతలు, సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. కొందరు సమన్వయకర్తలతో కూడా మాట్లాడి సూచనలు చేశారు.

సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలను, ప్రజా సంఘాలను స్వచ్ఛందంగా ఈ బంద్‌లో భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలేమిటో నేతలు బంద్ సందర్భంగా ప్రజలకు తెలియజెబుతూ వారి మద్దతు కూడగట్టుకోవాలని ఆయన కోరారు. ఈ బంద్ విఫలమైందనే అభిప్రాయం వచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని, అలాంటి వాటికి తావివ్వరాదన్నారు. బంద్ రోజున రాష్ట్ర ప్రజలంతా ఒకే తాటిపై ఉండి ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా కలసి పోరాడుతున్నారనే భావన వచ్చేలా బీజేపీకి, టీడీపీకి కనువిప్పు గలిగేలా విజయవంతం చేయాలని ఆయన గట్టిగా కోరారు.
Share this article :

0 comments: