నేడు ఏలూరులో యువభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు ఏలూరులో యువభేరి

నేడు ఏలూరులో యువభేరి

Written By news on Thursday, September 22, 2016 | 9/22/2016


నేడు ఏలూరులో యువభేరి
హాజరుకానున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రత్యేక హోదా కోసం పోరు
 
 సాక్షి, హైదరాబాద్/ ఏలూరు: విభజనకు గురై దారుణంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్లకు పైగా సాగిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘యువభేరి’ సదస్సుజరుగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనే ఈ సభకు పెద్ద ఎత్తున యువతీయువకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొననున్నారు. ప్రజాభీష్టానికి భిన్నంగా అడ్డగోలుగా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఒక సంజీవనిలాగా పని చేస్తుందని జగన్ తొలి నుంచీ అభిప్రాయపడుతున్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను, ఎక్సైజు, విద్యుత్ చార్జీలు, రవాణా ఖర్చుల్లో రాయితీలు వస్తాయి.

రాయితీలొస్తే వేల సంఖ్యలో పరిశ్రమలొస్తాయి. పరిశ్రమలొస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల కోసం మన యువకులు, విద్యార్థులు మరో వైపు చూడాల్సిన అవసరం ఉండద’ని తొలి నుంచీ గట్టిగా వాదిస్తున్నారు. అందుకు అనుగుణంగా పోరాటం చేస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకుంటూ వస్తున్నారు. కేంద్రంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతున్న ఫలితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం గానీ అందుకు సమానమైన ప్రత్యేక సహాయాన్ని ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కల్లబొల్లి ప్రకటనలు చేయడం, దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించడం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేంద్రంపైనా, చంద్రబాబు వైఖరిపైనా ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రిల ప్రకటనలను జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పినంత మాత్రాన తాము పోరాటం ఆపబోమని ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా వచ్చే దాకా చేస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఆ క్రమంలోనే జగన్ ఇప్పటికి ఐదు నగరాల్లో యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటి చెప్పారు. ఏలూరులో గురువారం ఆరవ యువభేరిని నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఏలూరు వస్తారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఏలూరు వద్ద సత్రంపాడులోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే యువభేరిలో పాల్గొని ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారని, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంత అవసరమో, దాని ప్రాధాన్యత ఏమిటో వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతోపాటు యువత, నిరుద్యోగులు, మేధావులు సైతం హాజరవుతారని వివరించారు.
Share this article :

0 comments: