అమరావతి ఒక విస్పోటనమే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అమరావతి ఒక విస్పోటనమే..

అమరావతి ఒక విస్పోటనమే..

Written By news on Wednesday, September 14, 2016 | 9/14/2016


 ‘సాక్షి’తో ఎన్‌ఏపీఎం జాతీయ సమన్వయకర్త బి.రామకృష్ణంరాజు
  •      రాజధాని నిర్మాణం పేరిట విధ్వంసం
  •      అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైతే తీవ్ర నష్టం
  •      ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి,
  •      ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయి
  •      వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి
  •      రాజధాని కంటే ముందు ప్రాథమిక
  •      రంగాలను అభివృద్ధి చేసుకోవాలి
  •      రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది
 గుంటూరు : ‘‘ప్రజా రాజధానిగా ప్రభుత్వం వల్లెవేస్తున్న రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విస్పోటనమే. రాజధాని పేరిట జరుగుతున్న వ్యవహారాలన్నీ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా, వ్యవసాయకంగా.. ఇలా అన్నివిధాలా దెబ్బతీయడానికే తప్ప ప్రగతికి, ప్రజాప్రయోజనాలకు ఏమాత్రం ఉద్దేశించినదిగా కనిపించడం లేదు. ఒక నాయకుడు తన ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ప్రణాళికలు రచిస్తూ, వాటినే భూతద్దంలో గొప్పగా చిత్రీకరిస్తూ వ్యక్తిగత లబ్ధికి బాటలు వేసుకోవడం తప్ప మరొకటి కానే కాదు. వాస్తవ విశ్లేషణలు జరిగితే అమరావతి బూటకం బట్టబయలు అవుతుంది’’ అని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్- ఎన్‌ఏపీఎం) జాతీయ సమన్వయకర్త భూపతిరాజు రామకృష్ణమరాజు తెలిపారు.
విభిన్న ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారందరినీ జాతీయ స్థాయిలో ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు మేధాపాట్కర్, సందీప్ పాండే, అరుణారాయ్, స్వామి అగ్నివేశ్, రాజేంద్రసింగ్, ఎంజీ దేవసహాయం తదితర నిపుణులతో కలిసి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న బి.ఆర్.కె.రాజు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. తన స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి పేరిట జరుగుతున్నది మహా విస్పోటనమని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ వివరాలు..

 సాక్షి: రాజధాని అమరావతి ఒక విస్ఫోటనమని ఎలా చెప్పగలరు?
 రాజు: అమరావతి ఒక విస్ఫోటనం అనడానికన్నా తక్కువ పదం మరొకటి కనిపించడం లేదు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయి. వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి. వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టంగా పేర్కొంది. రాజధాని నిర్మాణం పేరిట రైతు కుటుంబాలను అతలాకుతలం చేయడం, పర్యావరణ విధ్వంసం, నిర్మాణాల పేరిట అవినీతి, అక్రమాలకు గేట్లు బార్లా తెరవడం, ప్రభుత్వమే నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుండటం, విదేశీ కంపెనీల ముందు మోకరిల్లండం, స్వదేశీ నిపుణుల నైపుణ్యాన్ని కించపరచడం.. ఇవన్నీ విస్ఫోటనాలకు నిదర్శనాలే.
సాక్షి: ప్రపంచం మెచ్చే నగరాన్ని నిర్మిస్తామని  ప్రభుత్వం చెబుతోంది కదా!
రాజు: దానికన్నా ముందు ప్రపంచం మెచ్చేలా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి ప్రాథమిక రంగాలను అభివృద్ధి చేసుకోవాలి. ప్రజల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. వాటిని నెరవేర్చాలి. మెరుగైన రాజధాని నిర్మాణాన్ని ఎన్‌ఏపీఎం వ్యతిరేకించడం లేదు. అవసరాలకు అనుగుణంగా వెళ్లాలి తప్ప స్వప్రయోజనాల కోసం పాకులాడొద్దు. రాజధాని నిర్మాణానికి 3,000 ఎకరాలు చాలు. 50 వేల ఎకరాలకు పైగా సమీకరించడమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, అవినీతికి తప్ప మరొకటి కానేకాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చిత్తశుద్ధితో  వ్యవహరించకుండా కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. దీన్నే ప్రజలంతా ప్రశ్నించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిలదీయాలి.

 సాక్షి: రాష్ట్ర పరిపాలన తీరును ఎలా భావిస్తున్నారు?
 రాజు: నూతన రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే విశ్వాసంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన పరిపాలనపై దృష్టి పెట్టకుండా రాజధానే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పుష్కరాలు, ఇసుక, రాజధాని నిర్మాణం, సదావర్తి సత్రం భూములు... ఇలా అన్నింటిలోనూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఓటుకు కోట్లు కేసు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వంటి వ్యవహారాలు చంద్రబాబు తీరును బట్టబయలు చేశాయి. అవినీతి రహిత పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామి అయిన చంద్రబాబు అవినీతిని ఎలా సమర్థిస్తున్నారో అర్థం కావడం లేదు.  

 సాక్షి: ఎన్‌ఏపీఎం కార్యాచరణ ఏమిటి?
 రాజు: దేశంలో ప్రజా ఉద్యమాలను ఐక్య వేదికపైకి తీసుకొచ్చి ముందుకు నడిపించే బాధ్యతను ఎన్‌ఏపీఎం రెండు దశాబ్దాల క్రితమే స్వీకరించింది. దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తోంది. తాజాగా ‘మద్యం రహిత భారత్’పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం.


http://www.sakshi.com/news/district/national-alliance-of-peoples-movements-co-ordinator-b-r-k-raju-interview-397031?pfrom=home-top-story
Share this article :

0 comments: