హోదాతో దేనినీ పోల్చలేమంటున్న ఆర్థిక నిపుణులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదాతో దేనినీ పోల్చలేమంటున్న ఆర్థిక నిపుణులు

హోదాతో దేనినీ పోల్చలేమంటున్న ఆర్థిక నిపుణులు

Written By news on Saturday, September 10, 2016 | 9/10/2016


హోదాకు ప్రత్యామ్నాయం లేదు
► వేల పరిశ్రమలు..  లక్షల ఉద్యోగాలు వస్తాయి
► లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయి..
► హోదాతో దేనినీ పోల్చలేమంటున్న ఆర్థిక నిపుణులు
 ► హోదాకు తగ్గ సాయం అనేది బూటకపు ప్రచారం
 ► జైట్లీ చెప్పినవన్నీ విభజన చట్టంలోని హామీలే

 
సాక్షి, హైదరాబాద్: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా దానితో సమానంగా నిధులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎల్లోమీడియాలో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. కానీ ప్రత్యేక హోదాకు సమానమైనదేదీ లేదని, ఆంధ్రప్రదేశ్ వంటి పుష్కల వనరులున్న రాష్ట్రానికి అది సంజీవని వంటిదని ఆర్ధిక రంగ నిపుణులంటున్నారు. హోదా ఉన్న రాష్ట్రాలలో అనేక రాయితీలు ఉంటాయి కాబట్టి వందలాది పరిశ్రమలు క్యూ కడతాయని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయో ఊహకు కూడా అందదని ఉత్తరాఖండ్ అనుభవం చెబుతోంది. కానీ ప్రత్యేక హోదాకు పాతరేసి ప్రత్యేక ప్యాకేజీ లేకుండా చేసి.. విభజన చట్టంలో తప్పని సరిగా అమలు చేయాల్సిన హామీలనే అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వల్లెవేస్తున్నారు.

వాటినే చంద్రబాబు స్వాగతిస్తున్నారు. విభజనతో అన్నీ కోల్పోయి కనీసం రాజధాని కూడా లేకుండా, పరిశ్రమలు లేకుండా, కేంద్ర సంస్థలు లేకుండా నడివీధిలో నిలబడిపోయాం కనుక పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీకే నేడు దిక్కులేకుండా పోయింది.  నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎంపీలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఉండాలని డిమాండ్ చేశారు. పదేళ్లు సరిపోవు.. పదిహేనేళ్లు ప్రత్యేకహోదా సాధిస్తామని ఎన్నికల సభల్లో చంద్రబాబు ఊదరగొట్టారు. ఎన్నికలు ముగిసాక.. రెండున్నరేళ్లు గడచిపోయాక.. ఇపుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని, సాంకేతిక కారణాలున్నాయని.. ఆర్ధిక సంఘం చెప్పకపోయినా అడ్డుచెబుతోందని..ఇలా పలు సాకులు చెబుతున్నారు.

హోదాతో వేలల్లో పరిశ్రమలు.. లక్షల్లో ఉద్యోగాలు..
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇచ్చే రాయితీల వల్ల వేల సంఖ్యలో పరిశ్రమలు తరలి వస్తాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. హోదా ఉన్నంత కాలం పరిశ్రమలకు ఆదాయపు పన్నులో వంద శాతం రాయితీ ఉంటుంది. వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.

పరిశ్రమలు స్థాపించేందుకు పెట్టిన పెట్టుబడిలో 30 శాతాన్ని ప్రోత్సాహకంగా కేంద్రం ఇస్తుంది. దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం మరింత పెరిగింది. రాష్ట్రాలు సేల్స్ ట్యాక్స్‌ను విధించే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే జీఎస్టీలో కేంద్రం భారీ రాయితీలు ఇస్తుంది.

 బీమా, రవాణా రంగాల్లో భారీ ఎత్తున రాయితీలు ఇస్తుంది. పరిశ్రమలు స్థాపించే వారికి వర్కింగ్ కేపిటల్ కోసం తీసుకున్న రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ, 20 ఏళ్లపాటూ విద్యుత్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. దీని వల్ల పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రానికి బారులు తీరుతారు. ఉద్యోగాలకు కొదువ ఉండదు.

కానీ.. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో పారిశ్రామిక రాయితీల ఊసే లేదు. ఇప్పటికే  అడిషినల్ యాక్సిలరేట్ డిప్రిసియేషన్ 15 శాతం, అడిషనల్ క్యాపిటల్ అలవెన్సు 15 శాతం నిధులు ఇప్పటికే విడుదల చేసామని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆ నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన జిల్లాలకు మాత్రమే విడుదల చేస్తామని షరతు విధించడం గమనార్హం.

సాధారణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతం లోపే ఉంటాయి. మిగతా 70 శాతాన్ని రాష్ట్రాలే భరించాలి. కానీ.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 90 శాతం లభిస్తుంది. మిగతా 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఆ 10 శాతం నిధులను కూడా రాష్ట్రం సమకూర్చుకోలేకపోతే కేంద్రం రుణం ఇస్తుంది. గ్రాంట్‌గా లభించిన 90 శాతంను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసవరం ఉండదు. దీని వల్ల నిధుల సమస్యే ఉండదు. తద్వారా సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయవచ్చు.

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), జైకా(జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) వంటి విదేశీ సంస్థలు, విదేశాల నుంచి రుణం తీసుకుని ప్రాజెక్టులు చేపడితే.. ఆ రుణంలో 90 శాతాన్ని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 10 శాతం రాష్ట్రం చెల్లిస్తే సరిపోతుంది. రాష్ట్రం విదేశీ ప్రాజెక్టులను తెచ్చుకునే తాహతును బట్టి కేంద్రం చెల్లించే మొత్తం ఆధారపడి ఉంటుంది.

సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడానికి.. తద్వారా రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి ప్రత్యేక హోదా మార్గం సుగమం చేస్తుంది.
Share this article :

0 comments: