కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ

కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ

Written By news on Friday, September 16, 2016 | 9/16/2016


మట్టికట్టతో కనికట్టుఓ ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్‌ డ్యామ్‌ నమూనా ఇది..
పోలవరం నిర్మాణంలో బాబుగారి కుట్రలెన్నో.. కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్:
 ‘‘కాఫర్ డ్యామ్ నిర్మించి పోలవరం కాలువలకు నీళ్లిచ్చేద్దాం.. ఇదే పోలవరం తొలిదశ.’’
 - మంగళవారంనాడు పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రకటన ఇది.

 
ఈ ప్రకటన చూడగానే ఇంజనీర్లకయితే మూర్ఛవచ్చినంత పనైంది. సాగునీటి శాఖ అధికారులూ సీఎం  ప్రకటన చూసి విస్తుపోయారు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటి?

జలాశయం నిర్మించడానికి ముందు ఇది ఎందుకు కడతారు? ప్రధాన డ్యామ్‌కు కాఫర్ డ్యామ్‌కు ఉన్న తేడా ఏమిటి? నిజంగా సీఎం చెబుతున్నట్లు కాఫర్ డ్యామ్ కట్టడం పూర్తయితే పోలవరం తొలిదశ పూర్తయినట్లేనా? అసలు ఈ కాఫర్ డ్యామ్ సీఎం చెబుతున్నట్లు 60 టీఎంసీల నీటి నిల్వకు పనికి వస్తుందా? ఇవన్నీ ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అసలు కేంద్రం నిర్మించాల్సిన జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టును మేమే నిర్మిస్తామంటూ చంద్రబాబు ఎందుకు ఆతృతపడుతున్నారు? కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు? అందులోని మర్మమేమిటి? వంటివి అర్ధం చేసుకోవాలంటే ఇది చదవండి.
 
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. 2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇపుడు కాఫర్ డ్యామ్‌నే పోలవరం తొలిదశగా ప్రకటించేశారు. అంతేకాదు 60 టీఎంసీల నిల్వకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తొలిదశను పూర్తి చేశామని ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం, మరోపక్క తన అనుయాయుడైన సొంత పార్టీ కాంట్రాక్టరుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, ఆ పైన కమీషన్లు కైంకర్యం చేయడం ప్రభుత్వ పెద్దల లక్ష్యాలుగా కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది.

కాఫర్‌డ్యామ్ తాత్కాలిక నిర్మాణం మాత్రమే
సాధారణంగా ఏదైనా ఆనకట్ట నిర్మించాలంటే తాత్కాలిక మట్టి అడ్డుకట్టతో నీటిని దారి మళ్లించడం తప్పనిసరి. దాన్నే కాఫర్ డ్యామ్ అంటారు. అంటే ప్రధాన డ్యామ్  నిర్మాణానికి ముందు మట్టితో నిర్మించే తాత్కాలిక డ్యామ్ అన్నమాట. జలాశయ నిర్మాణ పనులకు నీళ్లు అడ్డురాకుండా.. ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యామ్. ఈ డ్యామ్ ఏ మాత్రం పటిష్ఠంగా ఉండదు. శాశ్వతంగా అసలు పనికి రాదు. కానీ పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నట్లు చంద్రబాబు గొప్పగా చెప్పడం పట్ల నీటిపారుదల రంగంపై అవగాహన ఉన్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

కాఫర్ డ్యామ్ ద్వారా 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపిందని చంద్రబాబు కొత్త వాదన  తీసుకురావడం చూసి ఇంజనీరింగ్ అధికారులు నివ్వెరపోతున్నారు. గోదావరికి గరిష్టం గా 30 లక్షల క్యూ సెక్కులు వరద వస్తుంది. కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరదని కూడా తట్టుకుని నిలబడే సామర్థ్యం కాఫర్‌డ్యామ్‌కు ఉండదని జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇం జనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడానికే తప్ప నీరు నిల్వ చేయడానికి  కాఫర్ డ్యామ్ పనికిరాదని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం తొలి దశ పూర్తయిందని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది.

భారీ ఎత్తున వరద వస్తే తట్టుకునే శక్తి ఈ కాఫర్ డ్యామ్‌కు ఉండదని, దా నికి గండి పడితే దిగువ ప్రాంతంలో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌తో అంత నీటి నిల్వ సాధ్యమైతే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ వంటి వాటికి బదులు కాఫర్ డ్యామ్‌లే నిర్మించి.. ఎక్కువ నీటిని నిల్వ చేసి ఉండేవారు కదా అని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం
పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే అయినా కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించిన కేంద్రం 2010-11 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 వరకూ రూ.5135.87 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.562.46 కోట్లను ఏఐబీపీ కింద కేంద్రం విడుదల చేసింది.

ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధులు పోను మిగతా సొమ్మును మాత్రమే కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించింది. అదీ ప్రాజెక్టు నిర్మాణం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయం మాత్రమే. భూసేకరణ, నిర్వాసితుల పునరాసానికి అయ్యే వ్యయాన్ని ఇస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. ఏప్రిల్ 1, 2014 నుంచి ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మాత్రమే చెల్లించేందుకు అంగీకరించింది. తాజా ఎస్‌ఎస్‌ఆర్ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లకుపైగా పెరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం రూ.20 వేల కోట్ల భారం పడనుంది.
 
కాంట్రాక్టరును కాపాడడం..
పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకోవాలంటూ రెండేళ్ల క్రితమే ముసాయిదా(డ్రాఫ్ట్)ను పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పీపీఏకి అప్పగిస్తే.. ప్రాజెక్టు నిధుల వ్యయంపై కేంద్రం పర్యవేక్షణ ఉంటుంది. నిధులు కొట్టేసేందుకు వీలుండదు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు సక్రమంగా చేయడం లేదంటూ టీడీపీ ఎంపీ రాయపాటి కి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌పై అనేక సందర్భాల్లో పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈపీసీలో 60సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌పై వేటు వేసి.. సమర్థుడైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని సూచించింది. కానీ.. ఇవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు.

రాయపాటిని రక్షించడం.. అంచనాలు పెంచేసి కమీషన్లు కొట్టేసేందుకు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ కేంద్రానికి విన్నవిస్తూ వచ్చారు. ఫలితంగా జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకూ 232 కోట్ల విలువైన పనులను మాత్రమే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. పీపీఏ సిఫారసు మేరకు కాంట్రాక్టర్‌పై వేటు వేసి మళ్లీ టెండర్లు పిలిచి ఉంటే సమర్థుడైన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే సౌలభ్యం ఉండేది. ఇనుము, డీజిల్, సిమెంటు వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో పోలవరం అంచనా వ్యయమూ తగ్గి ఉండేది. ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గేది. ప్రాజెక్టు ఈ పాటికే ఓ కొలిక్కి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం చేతికి దక్కగానే పోలవరం హెడ్ వర్క్స్ పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేసి.. కమీషన్లు దండుకుంటున్నారు.

పోలవరం కాంట్రాక్టు కోసం.. ‘హోదా’ తాకట్టు
ప్రాజెక్టు అంచనాలు పెంచేసి కమీషన్లు దండుకోవడం కోసం ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రంతో రాయభేరాలు సాగించడానికి కాంట్రాక్టర్లయిన కేంద్ర మంత్రి సుజనా, ఎంపీ సీఎం రమేష్‌లను చంద్రబాబు పంపారు. రాష్ట్ర వినతి మేరకు ఆ ప్రాజెక్టును కేంద్రం రాష్ట్రానికే అప్పగించింది. దాంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం చేతికి చిక్కిన 24 గంటల్లోనే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1,482 కోట్లు పెంచేశారు. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి కమీషన్లు కొట్టేశారు.
 
2018 నాటికి పోలవరం పూర్తయ్యేనా?
2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ీ చంద్రబాబు చెబుతుంటే.. ఆయన కేబినెట్‌లోని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి ఇటీవల శాసనమండలిలో మాట్లాడుతూ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వీటిని బట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెల్లడవుతోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషించినా.. పీపీఏ భేటీ  మినిట్స్‌ను పరిశీలించినా 2018 నాటికి పోలవరం పూర్తవడం అసాధ్యం. దీనికితోడు  పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా మే 13న భేటీలోనూ ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పడం గమనార్హం.  
 
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే
కేంద్రమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించిందని  చంద్రబాబునాయుడు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదు. ఈనెల 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకే పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈనెల 8న కేంద్ర ఆర్థిక శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్‌సైట్‌లో పెట్టిన ప్రకటనలోనూ ఇదే అంశాన్ని తేటతెల్లం చేశారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని.. కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు పదే పదే చెబుతోండటం గమనార్హం.
 
విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదే
♦ ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.
♦ 90(2) ప్రకారం.. ప్రజాభ్యుదయం దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
♦ 90(3) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సమ్మతించింది.
♦ 90(4) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే వ్యయం, భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీకి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పర్యావరణ, అటవీ తదితర అనుమతులను కేంద్రం తీసుకొస్తుంది.
 
పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్మిస్తుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. పోలవరం ప్రాజెక్టుకుర్తిస్థాయి పునరావాస పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలను సాధ్యమైనంత త్వరగా చేపడతామని గౌరవసభ్యులకు హామీ ఇస్తున్నాను.
 - విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌

 
చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత
మూడున్నర దశాబ్దాలుగా మూలన పడిపోయిన పోలవరం ప్రాజెక్టును తామే దుమ్ము దులిపి చేపట్టామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఈ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం, కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ తదితర అనుమతులన్నీ ఆయనే తెచ్చారు. పోలవరం కుడి కాలువను 145 కిమీల మేర తవ్వి.. పూర్తి స్థాయిలో లైనింగ్ పనులు పూర్తి చేయించారు.

ఎడమ కాలువ 134 కిమీల మేర లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను శరవేగంగా పూర్తి చేసే దశలో ఆయన హఠన్మరణం చెందారు. వైఎస్ అకాల మరణం పోలవరానికి శాపంగా మారింది. మహానేత వైఎస్ పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టినప్పుడు అప్పటి విపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డ్యామ్ కట్టకుండా కాలువలు తవ్వడం ప్రపంచంలో వింతంటూ అపహాస్యం చేశారు. కానీ.. ఆ మహానేత తవ్విన పోలవరం కుడి కాలువ మీదుగానే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తూ.. అదీ తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటోండటం గమనార్హం.
 
కేంద్ర ప్రభుత్వం చేపడితే జరిగే మేళ్లివీ..
♦ పోలవరం జాతీయ ప్రాజెక్టు. తాజా ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.36 వేల కోట్లు.  కేంద్రం చేపడితే ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరిస్తుంది.
♦ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం పోలవరాన్ని వ్యతిరేకిస్తోంది. కేంద్రం చేపడితే  సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు సులభంగా నిర్వహించి.. వివాదం లేకుండా చూస్తుంది.
♦ గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పోలవరం డిజైన్లు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం తప్పనిసరి. కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించడం వల్ల సీడబ్ల్యూసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీని వల్ల ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
♦ సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌ఐ(నేషనల్ హైడ్రాలజీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), జీఎస్‌ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వంటి సంస్థల్లో పనిచేసే నిపుణుల పర్యవేక్షణ ఉండటం వల్ల ప్రాజెక్టు పనులు నాణ్యతతో చేస్తారు.
♦ కేంద్ర ప్రభ్వు బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు. 2014లోనే కేంద్రానికి ప్రాజెక్టును అప్పగించి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. మార్చి, 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది.
 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్ల జరిగే నష్టాలివీ..
♦ 2010-11 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం రూపొందించిన పోలవరం అంచనా వ్యయంలో కేవలం హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు(ఇరిగేషన్ కాంపొనెంట్)కు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుంది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు అవసరమైన నిధులతోపాటూ ప్రాజెక్టు నిర్మాణ పనుల పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
♦ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)లో కేసు వేసింది. దీని వల్లే ప్రాజెక్టు పనులపై కేంద్రం పర్యావరణ నిషేధం విధించి.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సడలిస్తూ వస్తోంది. ఒకవేళ కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టి ఉంటే.. ఈ వివాదం పరిష్కారమయ్యేది.
♦ పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌కు సంబంధించి వర్కింగ్ డిజైన్లు మినహా.. ఎలాంటి డిజైన్లను సీడబ్ల్యూసీకి పంపలేదు. ఇటీవల కేంద్ర బృందం ఇదే అంశాన్ని లేవనెత్తింది.
♦ భూకంప ప్రభావిత ప్రాంతం(సెస్మిక్ జోన్)లో నిర్మిస్తుండటం వల్ల నిపుణులు అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు అందుబాటులో లేరు. ఇటీవల జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కోసం నర్మద కార్పొరేషన్‌లో పనిచేసిన డీపీ భార్గవను కన్సల్టెంట్‌గా నియమించింది.
♦ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రస్తుతం జరుగుతున్న రీతిలోనే పనులు సాగితే 2018 నాటికి పూర్తవడం అసాధ్యం. ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.
Share this article :

0 comments: