
ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో బెంచీలు ఎక్కడమే కాదు.. అవసరమైతే చంద్రబాబు కాలర్ కూడా పట్టుకుంటామని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాల్లో నిర్వహించిన బంద్ విజయవంతం అయిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
- రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా, ఎన్ని నిషేధాజ్ఞలతో కట్టడి చేయాలని ప్రయత్నం చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా, బలవంతంగా ఎన్ని బస్సులు తిప్పినా, ఎన్ని కాలేజీలు తెరిపించాలని ప్రయత్నం చేసినా కూడా.. ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడిని, ఆయన చేస్తున్న పనులను, ఆయన నిషేధాజ్ఞలను వ్యతిరేకిస్తూ బంద్‌ను విజయవంతం చేసినందుకు రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి అవ్వా, తాత, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడికి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వరకు ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు, ప్రతి సంఘానికి పేరుపేరునా ధన్యావాదాలు తెలుపుతున్నా
- రాష్ట్రవ్యాప్తంగా ఈ బంద్ పిలుపు ఎందుకు ఇచ్చామంటే.. ప్రజలు స్వచ్ఛందంగా దీన్ని విజయవంతం చేయడానికి ఇన్ని అడుగులు ముందుకేసి చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఎందుకు తోడుగా వచ్చారంటే.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తరఫున అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడానికే.
- హోదా ఇవ్వట్లేదని అరుణ్ జైట్లీ చెప్పినా, చంద్రబాబు అర్ధరాత్రి దాన్ని స్వాగతించడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసన తెలిపి బంద్‌ను విజయవంతం చేశారు
- సీఎంగా ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవాలని తాపత్రయపడాల్సిన వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం ఓటు కోసం కోట్లు ఇస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆ కేసుల నుంచి బయట పడేందుకు ఐదు కోట్ల మంది జీవితాలతో చెలగాటం ఆడుతూ ప్రత్యేకహోదాకు పూర్తిగా మంగళం పాడించే కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించారు
- ప్రజలు బంద్‌ను విజయవంతం చేస్తే, చంద్రబాబు సిగ్గులేకుండా మళ్లీ ఈరోజు అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసి మండలిలోకి వెళ్లి ఆయన మాట్లాడిన మాటలు బాధాకరం
- మళ్లీ ఆయనవి పాత మాటలే.. హోదా వల్ల ఏం ప్రయోజనం, ఈశాన్య రాష్ట్రాలకు ఏం మేలు జరిగిందని సిగ్గులేకుండా మాట్లాడారంటే, ఈయన మనిషేనా అని అడుగుతున్నా
- రాష్ట్రాన్ని విడగట్టేటప్పుడు వీళ్లే కదా.. హైదరాబాద్ పోతోంది కాబట్టి ఇంత నష్టం జరుగుతోందని, కాబట్టే ప్రత్యేక హోదా కావాలన్నారు. ఆ హామీ ఇస్తూనే రాష్ట్రాన్ని విడగట్టారు
- తర్వాత ఎన్నికల్లో ఇదే చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడమే కాక, తాము అధికారంలోకి వస్తే 15 ఏళ్లు హోదా తెస్తామని చెప్పి, ఎన్నికలు అయిపోయాక మాట మారుస్తూ హోదా వల్ల ఏం ప్రయోజనమని మండలిలో మాట్లాడుతున్నారు
- ఈ మనిషి నిజంగా పాలించడానికి అర్హుడా? నోరు తెరిస్తే మోసాలు, అబద్ధాలు
- ఈయన నిన్న సాయంత్రం నుంచే బంద్ విజయవంతం కాకూడదని ఎంతగా ఆరాటపడ్డాడో
- బంద్‌ను విఫలం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు చూస్తే.. అసలు ఈ మనిషే ప్రత్యేక హోదాకు అడ్డు తగులుతున్నాడని అనిపిస్తుంది.
- కేంద్రం ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటానని అల్టిమేటం ఇస్తే కేంద్రం ఇవ్వకపోతుందా?
- అది ఇవ్వకపోగా.. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనడమే కాక, బలవంతంగా ఆర్టీసీ బస్సులు తిప్పడం, అరెస్టులు చేయించడం, బలవంతంగా కాలేజీలు తెరిపించడం.. ఇలా చేస్తుంటే ఈ మనిషి మనిషి కాదు
- చంద్రబాబు ఎన్ని అడ్డంకులు పెట్టినా, బీజేపీ వాళ్లు ఇవ్వబోమని చెప్పిన సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని పోరాటపటిమ చూపించిన రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.
- అవసరమైతే ఈ పోరాటం ఎన్నిరోజులైనా చేస్తాం. పాలకుల్లో మార్పు వచ్చేవరకు చేస్తాం
- అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నవారి నుంచి స్ఫూర్తి తీసుకుంటాం
- ఇదైతే అసాధ్యం కాదు.. పార్లమెంటు సాక్షిగా మాకిస్తామని చెప్పిన మా హక్కు ఉంది
- ఇది సాధించేవరకు పోరాటం చేస్తాం.. రాబోయే రోజుల్లో జరిగే ప్రతి పోరాటానికి మీ అందరి సహకారం కావాలి
- ఇది ఒక్క జగన్ వల్ల అయ్యే పని కాదు.. జగన్‌కు మీ అందరి మద్దతు, అండదండలు కావాలి
- బంద్‌ను సఫలీకృతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
0 comments:
Post a Comment