అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్

అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్

Written By news on Sunday, September 25, 2016 | 9/25/2016


అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ కు అన్ని ప్రయోజనాలు వస్తాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులతో ఆదివారం రాత్రి లైవ్ షో ద్వారా ఆయన ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోవడం వల్ల 98 శాతంపైనే కంపెనీలు కోల్పోయామని చెప్పారు. 70 శాతం ఉత్పత్తి రంగం హైదరాబాద్ లోనే ఉందని గుర్తు చేశారు.

ఇప్పుడున్న మౌలిక వసతులతో మనం పోటీ పడలేమని, ప్రత్యేక హోదా వస్తేనే అన్ని వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక రాయితీలు వస్తాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు వస్తాయని తెలిపారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీయిచ్చిందన్నారు. హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. హోదా ఇవ్వబోమన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు సిగ్గులేకుండా స్వాగతించారని ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటన మొత్తం చూస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పరని అన్నారు. మన రావాల్సిన వాటా కంటే ఏమీ రానప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.


రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అవసరమైతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
Share this article :

0 comments: