
అక్రమ మైనింగ్ పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి
అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్న మైనింగ్ ఏడీ
బహిరంగ విచారణకు రావాలని టీడీపీ నేతలకు కాకాణి సవాల్
నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ తరలింపులో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని, దొంగే దొంగ..దొంగ అని అరుస్తున్న చందంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ గ్రావెల్ తరలింపులో తమ నాయకుల భాగస్వామ్యం ఉందని పత్రికల్లో వచ్చిన కథనాల్లో నిజం లేదని ఆయన ఖండించారు.
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను అనేక మార్లు తాను కోరినట్లు గుర్తు చేశారు. జెడ్పీ సమావేశంలో, శాసనసభ సమావేశాల్లో మాట్లాడినట్లు తెలిపారు. వెంకటాచలం మండలం కనుపూరులో అక్రమంగా గ్రావెల్ తరలింపులో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడికి భాగస్వామ్యం ఉందని పత్రికల్లో కథనంలో వాస్తవం లేదన్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మైనింగ్ ఏడీ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు పట్టుకున్న పోలీసులు క్రిమినల్ పెడుతూ, భారీగా జరిమానా విధించడం దారుణమన్నారు. అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తున్న యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గ్రావెల్ తవ్వకాలు చేపట్టిన యంత్రాలు సీజ్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఖనిజ సంపదను కొల్లగొట్టే వారిపై వారిపై చర్యలు తీసుకుని యంత్రాలను సీజ్ చేయాలన్నారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు మీడియా సాక్షిగా బహిరంగ విచారణకు రావాలని సవాలు విసిరారు. ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో ప్రజలే వాస్తవాలు తెలియజేస్తారని చెప్పారు. పత్రికలు, మీడియా వాస్తవాలను వెల్లడించాలని హితవు పలికారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వెంకటాచలం జెట్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, ముత్తుకూరు మండలం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు
0 comments:
Post a Comment