రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు

రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు

Written By news on Tuesday, November 22, 2016 | 11/22/2016


రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు
దానవాయిపేట :
దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడినందుకు తమ మీద అర్థం పర్థం లేని కేసులన్నీ పెట్టారని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామస్తులు చెప్పారు. చివరకు గ్రామస్తులు కొందరు కలిసి రోడ్డు రోలర్ ఒకదాన్ని బద్దలు కొట్టారని కూడా కేసు పెట్టారని వాపోయారు. అసలు దాన్ని బద్దలుకొట్టడం సాధ్యమేనా అన్న చిన్న విషయాన్ని కూడా గమనించకుండా చేతికి వచ్చిన కేసులన్నీ పెట్టారన్న విషయాన్ని బాధితులు కుండ బద్దలుకొట్టి చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు అండగా నిర్వహించిన సభలో ఈ విషయాలు వెల్లడించారు. 
 
రోడ్డుమీద మట్టి ఎత్తుకెళ్లామట
ఇక్కడంతా చిన్న, సన్నకారు రైతులే. మత్స్యకార కుటుంబాలు 36 ఉన్నాయి. మండలంలో 50 ఊళ్లు ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు మీద మంచినీటి పథకం అని ముందు మోసం చేశారు. కానీ బోర్డులు పెట్టాక అసలు విషయం తెలిసింది. దివీస్ అనగానే ఏంటా అని విచారించాం. మండువేసవిలో కూడా ఇక్కడి వాతావరణం సహజమైన ఏసీలా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ వస్తే పిల్లలు పుట్టరని, పుట్టిన పిల్లలు యవ్వనంలో ఉండరని చెబుతున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లాడితో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు, రోడ్డు మీద మట్టి ఎత్తుకెళ్లిపోయామని కేసు పెట్టారు. రోడ్డు రోలర్‌ను బద్దలుకొట్టామని అన్నారు. ఆడపిల్లలని కూడా చూడకుండా పిఠాపురం సీఐ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. 
-ముసలయ్య
 
వాళ్లను రానిచ్చేది లేదు
గత 82 రోజులుగా మేం పోరాడుతుంటే అక్రమంగా కేసులు పెట్టి మావాళ్లను జైళ్లలో పెట్టారు. మాకు మూడెకరాల భూమి ఉంది. దాన్ని బలవంతంగా లాక్కోవాలనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను రానిచ్చేది లేదు
-సుశీల
 
పిల్లలు లేకపోతే బతకడం ఎందుకు
మమ్మల్ని భయపెట్టి, బలవంతంగా రెండెకరాలు లాక్కోవాలనుకుంటున్నారు. 5 లక్షలు ఇస్తామంటున్నారు. మా పిల్లలను ఎలా బతికించుకోవాలి? భూమి లేకపోతే అడుక్కుని తింటాం కానీ, పిల్లలే లేకపోతే ఎలా బతకాలి, ఎందుకోసం బతకాలి? ఏడాదికి 2 లక్షల ఆదాయం ఇచ్చే సర్వి తోటను బలవంతంగా నరికించేశారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ.. భూములు మాత్రం ఇవ్వం. కాకినాడ ఆస్పత్రిలో ఇక్కడివాళ్లు ఎంతమంది బాధలు పడుతున్నారో లెక్కలేదు. 
-కృష్ణవేణి
 
సీపీఎం మధును కర్కశంగా కొట్టారు
నేను ఒక ఎకరం రైతును. మా ఇంటి మీద మూడు జీపులతో పోలీసులు దాడి చేశారు. మీటింగులు పెడుతున్నావట, ఇల్లు కూల్చేస్తాం, జైల్లో పారేస్తాం అన్నారు. అయినా భయపడలేదు. మాజీ ఎంపీ మధును పోలీసులు కర్కశంగా కొడుతుంటే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు నిద్రలేస్తే అబద్ధం. రాజశేఖరరెడ్డి మా భూములు లాక్కున్నారని బాబు చెప్పారు, కానీ ఇప్పుడు ఈయనే లాక్కుంటున్నారు
-బుజ్జిబాబు
 
మా ఉద్యోగాలు పీకేస్తున్నారు
హేచరీలో ఉద్యోగం చేస్తున్నాను. ఏడోతరగతి చదివి, నెలకు 8వేల రూపాయలు సంపాదిస్తున్నాను. అక్షరం ముక్క లేకపోయినా అనుభవం పెరిగే కొద్దీ 20 వేల వరకు వస్తుంది. మా హేచరీలో వందమంది పనిచేస్తారు. భూములు అమ్మకపోయినా లాగేసుకుంటాం అంటూ మామీద కేసులు పెడుతున్నారు. 144 సెక్షన్ అంటే దారుణంగా ఉంది. యనమల రామకృష్ణుడు ఎప్పుడూ మమ్మల్ని పట్టించుకోలేదు. దివీస్ వస్తే ఆ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడి వాళ్లకో ఉద్యోగాలు వస్తాయేమో గానీ, మా ఉద్యోగాలన్నీ పోతాయి. అందుకే అది వద్దనే కోరుకుంటున్నాం
-యనమల శ్రీను
 
ఆడవాళ్లని కూడా చూడకుండా...
పోలీసులు ఒక్కసారిగా వచ్చి, సీఐని తిడుతున్నావంటూ దుస్తులు చించేసి జీపు దగ్గరకు లాక్కెళ్లారు. అసలు సీఐ మొఖమే నాకు తెలియదని చెప్పాను. మా అమ్మాయిని స్కూలు నుంచి తీసుకొద్దామని బయటకు వెళ్తే.. పోలీసులు ఒంటిమామిడి స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. అప్పటికే మా ఆయనను అన్నవరం స్టేషన్‌లో పెట్టారు. కనీసం పిల్లలకు కడుపునిండా తిండిపెట్టే అవకాశం కూడా లేకుండా చేశారు. యనమల రామకృష్ణుడి తమ్ముడు పదవిలో లేకపోయినా ఆగడాలు చేస్తున్నాడు. బయటి నుంచి పదిమందిని తీసుకొచ్చి, దివీస్ కంపెనీ లేకపోతే చచ్చిపోతామని వాళ్లతో చెప్పించారు. అసలు వాళ్లు ఎవరో కూడా మాకు తెలియదు. ఇదంతా యనమల రామకృష్ణుడు చేసిన పని. 
-మంగ
 
ఏం చేస్తారో తెలీదు.. ఫ్యాక్టరీ వద్దు
మేం ఈ ఊరు వదిలి వెళ్లలేం, ఈ భూములు వదిలి వెళ్లలేం. మీరేం చేస్తారో తెలీదు, ఆ ఫ్యాక్టరీని మాత్రం రానివ్వద్దు. బలవంతంగా భూములు లాక్కుని, పోలీసులతో కొట్టిస్తున్నారు. మేం భూములు ఇచ్చేది లేదని చెప్పినా,  భూములు లాక్కుని చెట్లు నరికేశారు. ఫ్యాక్టరీ రాకుండా మీరే ఆపాలి (అంటూ ఆమె తీవ్రంగా విలపించారు)
-అమ్మాజీ
Share this article :

0 comments: