ఓర్వలేకే జగన్‌పై విమర్శలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓర్వలేకే జగన్‌పై విమర్శలు

ఓర్వలేకే జగన్‌పై విమర్శలు

Written By news on Tuesday, November 8, 2016 | 11/08/2016

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలనే ప్రగాఢ కాంక్షను జై ఆంధ్రప్రదేశ్ సభ ద్వారా రాష్ట్ర ప్రజలు చాటి చెప్పడంతో బెంబేలెత్తిన రాష్ట్ర మంత్రులు అక్కసుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను విఫలం చేయాలని టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, అడ్డంకులెన్ని సృష్టించినా చరిత్రాత్మకంగా విజయవంతం చేసిన ఉత్తరాంధ్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విశాఖ సముద్రపు భాష అభ్యుదయానికి సంకేతమైతే, జై ఆంధ్రప్రదేశ్ సభలో జనసముద్ర ఘోష ప్రత్యేకహోదా మహోదయమని అభివర్ణించారు. ప్రత్యేకహోదా రాకుండా చిదిమేస్తున్న శక్తుల కుట్రను జగన్ బయట పెడితే, దానికి సమాధానం చెప్పకుండా రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వరరావు వ్యక్తిగత విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సభ నిర్వహణకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయనే చౌకబారు విమర్శలు చేయడాన్ని ఆక్షేపించారు.

 ఎవరెవరికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలి
 ఇప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలావరకు నెరవేర్చేశామని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భూమన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 1.3 లక్షల ప్రభుత్వోద్యోగాలను, ప్రైవేటు రంగంలో 2,23,385 ఉద్యోగాలను ఇచ్చినట్లు సుజాత, అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారని... అది నిజమైతే ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో పేర్లతో సహా ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డులో వెల్లడించగలరా? అని సవాలు విసిరారు. లేదంటే తాము పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మంత్రులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కావాలా... వద్దా...? అనే విషయం చెప్పకుండా మరో మంత్రి తెల్లారకముందే పాచినోట జగన్‌పై విమర్శలు చేశారని, సాక్షాత్తూ ఈ మంత్రే మహిళలపై దురాగతం చేసిన వారిలో ఒకరని ఏడీఆర్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించిందని చెప్పారు.

 హోదాపై మోసగించిన దుష్టద్వయం
 ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే మేలని చెబుతూ సన్మానాలు చేరుుంచుకుంటూ తిరుగుతున్న దుష్ట ద్వయం వెనుక ప్రజలెవ్వరూ లేరని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు అనుభవజ్ఞులని, కృష్ణార్జునుల మాదిరిగా రాష్ట్రాన్ని కాపాడుతారని ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ రాష్ట్రానికి రాహు కేతువుల్లాగా దాపురించారని దుయ్యబట్టారు.   ఇప్పటికై నా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకుని ప్రత్యేక హోదా సాధించలేక పోతున్నందుకు ప్రజలకు క్షమాపణ, జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: