చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ

చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ

Written By news on Saturday, December 3, 2016 | 12/03/2016


చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైద్యం కోసం పేదలు పొలాలు అమ్ముకోవాల్సిన దుర్భరమైన పరిస్థితులు మీ పుణ్యాన రాష్ట్రంలో మళ్లీ వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన బహిరంగలేఖలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


ఫీజు రీయింబర్స్ మెంట్‌, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు అమలుకాక, చదువుల కోసం, వైద్యం కోసం పొలాలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని.. ఆ పొలాలు అమ్ముకుందామన్నా, అమ్ముకునే వీలు లేకుండా రిజిష్ట్రేషన్లు బంద్‌ చేసి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఇటీవల బందర్‌పోర్ట్‌ ప్రాంతంలోని పల్లెల్లో బాధితులు చెప్పడం కలచివేసిందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని మీరు పథకం ప్రకారం బలహీనపరుస్తున్నారా, లేక మీ అసమర్థత వల్ల ఆ పథకం బలహీన పడుతుందా అని లేఖలో జగన్‌ ప్రశ్నించారు.

’మహానేత వైఎస్‌ఆర్‌ పథకమైన ఆరోగ్యశ్రీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవగా మార్చారు. సంతోషం! అయితే ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యానికి చంద్రబాబు ఎంతటి ’అమూల్యమైన సేవ’లు అందించారో ఈ పథకానికి కూడా అలాంటి సేవలే అందించి, కోట్ల ప్రజలకు సంజీవని అయిన ఈ పథకానికి పాడె కడుతున్నారన్నదే తమ ఆందోళన’ అని జగన్‌ అన్నారు.

2016-17కు సంబంధించి ఈ పథకానికి కనీసం రూ. 910.77 కోట్లు కావాలి అని సంబంధిత విభాగం తెలుపగా.. ప్రభుత్వం మాత్రం రూ. 569.23 కోట్లు కేటాయించిందన్నారు. ఇక మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేనాటికే ఆరోగ్యశ్రీ బకాయిలు ఏకంగా రూ. 395.69 కోట్లు ఉన్నాయని, బకాయిలు పోతే నికరంగా ఈ పథకానికి చేసిన కేటాయింపులు ఎంత అని జగన్‌ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1 కోటీ 30 లక్షల కుటుంబాలకు ఈ కేటాయింపులతో న్యాయం జరిగే వీలుందా.. కావాల్సిన నిధులు కేటాయించకుండా ఆసుపత్రుల్లో చికిత్సలు ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.

గుండె జబ్బులు, మల్టిపుల్‌ ఫ్రాక్షర్లు, క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలు ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న రోగుల పరిస్థితిని ఒకసారి చూడాలని జగన్‌ సూచించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ఆరు నుంచి తొమ్మిది నెలలుగా చెల్లించకపోవటం వల్ల.. రోగులకు చికిత్స చేయడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయన్నారు. తెల్లకార్డు ఉండి కూడా వైద్యం అందక ప్రజలు పడుతున్న అవస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్రద్ధ చూపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిద్దుబాబు చర్యలు తీసుకోని పక్షంలో ఈ నెల 9న జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలకు దిగుతామని వైఎస్‌ జగన్ స్పష్టం చేశారు.

పూర్తి లేఖకు ఇక్కడ క్లిక్‌ చేయండి
Share this article :

0 comments: