ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన

ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన

Written By news on Friday, December 16, 2016 | 12/16/2016


‘బాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయం’
నరసరావు పేట: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోసపూరిత, కుట్ర పూరిత ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోసపూరిత చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపే రోజు వచ్చిందనీ ఆయన హెచ్చరించారు. ప్రజలకు తోడుగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని నిప్పులు చెరిగారు. గురజాల ఎమ్మెల్యే  చేస్తున్న ఆరాచకాలు అన్నీ ఇన్నీ కావని, రాష్ట్రంలో చాలా దారుణమైన పాలన ఉందని, అది చూసి బాబు కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారని తెలిపారు.

శుక్రవారం నరసరావుపేట రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష జన సందోహం మధ్య కాసు మహేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల హర్షధ్వానాల మధ్య మహేష్ రెడ్డిని పార్టీలో చేర్పించుకుంటున్నట్టు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మషేష్ రెడ్డికి అన్ని వేళల్లో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హాజరైన జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పరిపాలనపై నిప్పులు చెరిగారు.

జగన్ ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. ప్రజలతో కిక్కిరిసిన రెడ్డి కాలేజీ మైదానం ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారు. ఆ సభలో జగన్ చెప్పిన ప్రతి మాటకు ప్రజల నుంచి చప్పట్లు కేరింతలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయకపోవడంపై పలు అంశాలను ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఉటంకించగా అవును... అమలు చేయలేదంటూ ప్రజల నుంచి పెద్దపెట్టిన ప్రతిస్పందనలు వినిపించాయి.

నిజానికి ఈ సభ సాయంత్రం 4 గంటలకే జరగాల్సి ఉండగా, జిల్లాలో అడుగుపెట్టింది మొదలు మార్గమధ్యంలో అన్ని చోట్ల ప్రజలు జగన్ కలవడానికి పెద్ద ఎత్తున తరలిరావడం, ఆయనను నిలువరించి స్వాగతం పలకడం, ఆయనతో కరచాలనం చేయడానికి పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా ఎగబడటంతో ఆయన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవడానికి ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సభ 8 గంటల సమయంలో మొదలైంది. జగన్ అక్కడికి చేరుకోవడం గంటల కొద్దీ ఆలస్యమైనప్పటికీ జనంలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకంగా యువకులు పెద్దఎత్తున హాజరు కావడం, ఆయన మాట్లాడుతున్నప్పుడు అడుగడుగునా చప్పట్లు చరుస్తూ, కేరింతలు కొడుతూ ఊత్సాహం ప్రదర్శించడం గమనార్హం.

ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, ఇలాంటి సమయంలో ప్రజలకు తోడుగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి చెప్పినప్పుడు జనం విశేషంగా స్పందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్టుగా... ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నది నాయకుడికి ముఖ్యమని జగన్ గుర్తుచేస్తూ ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకునేలా నాయకుడు ఉండాలన్నారు.

అయితే చంద్రబాబు నాయుడును చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. నిత్యం అబద్దాలు ఆడటం... మోసాలు చేయడం... ఇదే ఆయన నాయకత్వం అని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలు, అబద్దాలకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. అవినీతిలో ఏపీని నెంబర్‌ 1 చేసిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు... చివరికి ఏమైంది... రైతులను నిలువునా మోసం చేశారు... అవునా... కాదా.. మీరేమంటారు? అని సభికులను ప్రశ్నించినప్పుడు అవును.. అవును అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. అనంతరం వారినుద్దేశించి చంద్రబాబు పాలన బంగాళా ఖాతంలో పడేందుకు ఇక రెండేళ్ల గడువుందని, కాలం కలిసొస్తే ఏడాదిలోనే పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని కోరారు.

అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో పెట్టిన బంగారం తెచ్చిస్తామన్నారు. మరి ఆయన ఇప్పుడేం చేశారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు... మీరేమంటారని మళ్లీ ప్రశ్నించగా అవునంటూ దద్దరిల్లే సమాధానం సభ నుంచి వచ్చింది. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించడానికి సంబంధించి,  ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలను ప్రస్తావించి అధికారం చెపట్టిన తర్వాత ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ రకంగా చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు... నోరు తెరిస్తే మోసం చేయడం మామూలైపోయిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఇలా అబద్ధాలు చెప్పే... ఈ రకంగా మోసం చేసే నాయకులను బంగాళాఖాతంలో కలపాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. ఇలాంటి నాయకులను బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కేసులకు భయపడి...
చంద్రబాబు తనపైన కేసులు ఎక్కడ వచ్చి పడుతాయోననీ, ఇప్పటికే ఇరుక్కున్న కేసుల్లో ఎక్కడ తెరమీదకు వస్తాయోనన్న భయంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా అటు కేంద్రంపైన గానీ ఇటు తెలంగాణ ప్రభుత్వంపైన గానీ నోరు మెదపడం లేదని జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పైన తెలంగాణ ప్రాజెక్టులు కట్టి నీటిని ఎత్తుకుపోతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలకు ఇక్కడి నుంచి బ్లాక్ మనీని తీసుకెళ్లి సూట్ కేసుల్లో పెట్టి ఇస్తుంటే... ఆ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు.

ఆ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఆ కేసులకు, అవన్నీ బయట పడుతాయని భయపడి చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారని ఆనాటి ఘటనలను గుర్తూచేస్తూ, ఆ హామీతోనే ఆరోజు రాష్ట్రాన్ని విడదీశారని విడమరిచి చెప్పారు. అదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేక హోదా గురించి అడిగే పరిస్థితి లేరని పేర్కొంటూ అందుకు కారణాలను విశ్లేషించారు. గడిచిన రెండున్నరేళ్లలో చంద్రబాబు విచ్చలవిడి అవినీతి పాల్పడ్డారని, కేంద్రాన్ని ఏమనడిగినా తన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తారని భయపడి అడగటం లేదని చెప్పారు.

ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రజలను విస్మరించిన చంద్రబాబు, ఆయన పాలన అంతం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలిచ్చే తీర్పుతో నాయకులు ఇక అబద్దాలు చెప్పాలంటే... మోసం చేయాలంటే... భయపడే పరిస్థితి రావాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాబు మోసాలకు, అబద్దాలకు ఫలితంగా ఆయనను బంగాళాఖాతంలో కలిపే రోజు తప్పదని చెప్పారు. ఈరోజు పార్టీలో చేరిన మహేష్ రెడ్డి తన తమ్ముడి లాంటి వాడని, ఆయనను అందరూ ఆశీర్వదించాలని జగన్ ప్రజల హర్షధ్వానాల మధ్య కోరారు. ఇక్కడ రాజకీయంగా ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: