హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 నుంచి 50 కోట్ల రూపాయల వరకు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు అనైతిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపారని విమర్శించారు. కావాల్సిన మెజార్టీ టీడీపీకి ఉన్నా, తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, చంద్రబాబుకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై విశ్వాసం లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తప్పు చేసిన వాడి మొహం చంద్రబాబుదైతే.. తప్పు చేయనివాడి మొహం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా ఉంటుందని అన్నారు. చంద్రబాబు అవినీతిని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని, లేదంటే వారిపై అనర్హత వేటుపడటం ఖాయమని హెచ్చరించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.