06 March 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పోరుబాటలో ముందడుగు

Written By news on Saturday, March 12, 2016 | 3/12/2016


  • వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల ప్రస్థానం
  • ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజల గొంతుకగా నిలిచిన పార్టీ
  • ఎన్ని కుట్రలు ఎదురైనా వెనుకంజ వేయకుండా పోరాటం
  • రాజకీయ పెనుసవాళ్ల మధ్య వైఎస్ జగన్ ముందడుగు
  • నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, కన్నీళ్లు తుడుస్తూ భరోసా
  • ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇచ్చిన మాటకోసం ముందుకే...
  • ప్రజల పక్షాన నిలిచి అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్
రాజకీయ పెనుసవాళ్ల మధ్య ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని అప్రతిహతంగా ముందడుగు వేస్తోంది. పార్టీ ప్రారంభించిన రోజునుంచీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకంజ వేయకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రాష్ట్ర ప్రజల గొంతుకగా నిలిచింది. రాష్ట్ర విభజన నుంచి ప్రత్యేకహోదా వరకు ఏ సమస్య ఎదురైనా వైఎస్సార్‌సీపీ పోరాడింది, పోరాడుతోంది. అప్పట్లో ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై తనపై కేసులు పెట్టినా, అణగదొక్కాలని ప్రయత్నించినా, ఆఖరుకు 16 నెలల పాటు జైలుపాలు చేసినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పంథాను వీడలేదు. రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సైనికుడిలా పోరాడారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకుంటూ, వారి కష్టాలు విని కన్నీళ్లు తుడుస్తూ భరోసానిచ్చారు. అబద్ధపు హామీలివ్వకుండా, విలువలపై రాజీ పడకుండా రాజకీయాలు నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. తొలి ప్రయత్నంలోనే 67 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా నిలిపారు.

సంక్షోభంలో ఆవిర్భావం..
ప్రజాప్రస్థానం పాదయాత్రతో 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంతృప్త స్థాయిలో సామాజిక పింఛన్ల మంజూరు, బలహీన వర్గాల గృహ నిర్మాణం వంటి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. 2009లో ఒంటిచేత్తో మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన కొద్దిరోజులకే సెప్టెంబర్ రెండో తేదీన నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన హఠాన్మరణం పాలయ్యారు. తమ అభిమాన నేత మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 మందికి పైగా తనువు చాలించారు. తన తండ్రి కోసం తపించి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి యాత్రను చేపడతానని జగన్ నల్లకాలువ సభలో ప్రకటించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రకు అంగీకరించలేదు. మరోవైపు వైఎస్ మరణం తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కె.రోశయ్య, ఆ తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారు.

ఈ నేపథ్యంలో తన తండ్రి ఆశయాల సాధనకోసం రాజన్న రాజ్యాన్ని స్థాపించేందుకు జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద 2011, మార్చి 12వ తేదీన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని (వైఎస్సార్ కాంగ్రెస్) స్థాపించారు. అదే ఏడాది మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో కడప లోక్‌సభా స్థానం నుంచి 5,45,672 ఓట్లు, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి 81,373 ఓట్ల తిరుగులేని భారీ ఆధిక్యతలతో గెలుపొంది ఇద్దరూ చరిత్రను సృష్టించారు. ఆ తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వైఎస్ పేరును చేర్చడాన్ని తీవ్రంగా నిరసిస్తూ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా చేసి, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో సుమారు మూడు లక్షల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. అంతకుముందే కోవూరు ఉప ఎన్నికల్లో కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గెలుపొందారు. అలా వైఎస్సార్‌సీపీ బలం ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలకు పెరిగింది. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి జగన్‌ను బలపరుస్తున్న 17 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయడంతో వారందరినీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. ఒక పీఆర్పీ ఎమ్మెల్యే అంతకుముందే సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. ఈ 18 స్థానాలకుజరిగిన  ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 చోట్ల తిరుగులేని విజయాన్ని సాధించి ఏపీ అసెంబ్లీలో తన బలాన్ని 17కు పెంచుకుంది.

ఎన్ని కుట్రలెదురైనా...
ఓదార్పుయాత్ర చేస్తానని నల్లకాలువ సభలో జగన్ ప్రకటించినప్పటి నుంచీ కక్షసాధింపు చర్యలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో జరిపిన తొలివిడత ఓదార్పులో రాజన్న తనయుడికి లభించిన ఆదరణను కాంగ్రెస్ అధిష్టానం ఓర్వలేకపోయింది. ఓదార్పు యాత్రను తక్షణమే ఆపేయమని హుకుం జారీచేసింది. తండ్రికి ఇచ్చిన మాట కోసం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్ ఇచ్ఛాపురం నుంచి ఓదార్పు యాత్రను పునఃప్రారంభించారు. ఆ యాత్రలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులెవ్వరూ పాల్గొనవద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. పాల్గొన్నవారిని పార్టీనుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ పోరాట పంథానే ఎంచుకున్నారు. తన తండ్రి అనుసరించిన సంక్షేమ బాటను అదే స్ఫూర్తితో కొనసాగించాలన్నా.. ఆయన ఆశయాలను సాధించాలన్నా కాంగ్రెస్‌ను అనివార్యంగా వీడాల్సిందేనని నిర్ణయించుకున్నారు. తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ ద్వారా తమకు సంక్రమించిన పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ పదవులకు కూడా తల్లీ తనయులు రాజీనామా చేశారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో జగన్‌పై కుట్రలు ముమ్మరమయ్యాయి. వైఎస్సార్‌సీపీకి లభిస్తున్న ఈ ఆదరణను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌రావు చేత జగన్ సంస్థలపై విచారణ జరిపించాలంటూ హైకోర్టుకు ఓ లేఖను రాయించింది. (సోనియాగాంధీ చెబితేనే తాను ఈ లేఖ రాశానని శంకర్‌రావు స్వయంగా ఒప్పుకున్నారు). ఈ లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరిస్తే అందులో టీడీపీ అగ్రనేతలు కొందరు కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఆ తరువాత వరుసగా జగన్ ఇంటిపైనా, సాక్షి దినపత్రికపైనా, ఇతర సంస్థలపైనా సీబీఐ దాడులు చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీతో కుమ్మక్కై సీబీఐతో దాడులు చేయించినా జగన్ తలవంచలేదు. ఉప ఎన్నికల ప్రచారపర్వంలో ఉన్న జగన్‌ను విచారణ నిమిత్తం పిలిపించిన సీబీఐ మూడు రోజుల తర్వాత మే 27న అరెస్టు చేసి 16 నెలలపాటు జైల్లో నిర్బంధించింది. అయినా జగన్ ఆత్మస్థైర్యాన్ని వీడలేదు.

గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ పార్టీని పకడ్బందీగా నడిపారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా జగన్ సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఁమరో ప్రజా ప్రస్థానం* పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇదే సమయంలో రాష్ట్రాన్ని విభజించాలన్న ఏఐసీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ షర్మిల సమైక్య శంఖారావం పేరుతో యాత్ర నిర్వహించారు. విభజనకు వ్యతిరేకంగా విజయమ్మ గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశారు. ఆమె దీక్షను భగ్నం చేసిన తరువాత జగన్ చంచల్‌గూడ  జైలులో దీక్షకు పూనుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్‌లో చేర్చి ఆయన చేత బలవంతంగా దీక్షను విరమింపజేశారు. అనంతరం 2013, సెప్టెంబర్ 24న జైలునుంచి విడుదలైన పక్షం రోజులకే జగన్ తన ఇంటి ముందే సమైక్య దీక్షను చేశారు. చరిత్రాత్మకమైన రీతిలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పార్టీ ఆధ్వర్యంలో 'సమైక్య శంఖారావం' సభను నిర్వహించారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, చివరకు జైలు పాలు చేసినా అదరక, బెదరక... ఆత్మగౌరవమే నినాదంగా, ఆత్మస్థైర్యమే ఆయుధంగా జగన్ ముందడుగు వేశారు.

అలుపెరుగని పోరాటం..
వైఎస్సార్‌సీపీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి దిగింది. విలువలున్న రాజకీయాలకు పెద్దపీట వేస్తూ, సాధ్యమయ్యే హామీలనే ఇస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రమంతటా అలుపెరుగకుండా ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలివికాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని ఆపలేకపోయారు. 1,27,71,323 ఓట్లతో 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని పార్టీ బలీయమైన శక్తిగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి ఓట్ల మధ్య తేడా కేవలం ఐదు లక్షలే కావడం గమనార్హం. అనంతరం జరిగిన మున్సిపల్, పంచాయితీరాజ్ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ గణనీయమైన సంఖ్యలో సీట్లను గెల్చుకుంది. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా జగన్ అక్కడ ప్రజలకు అండగా నిలిచారు. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాలను ప్రజల సాక్షిగా ఎండగట్టారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ గళం విప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీశారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత ప్రభంజనాన్ని, ప్రజల్లో జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రాష్ట్రంలో చంద్రబాబు ఫిరాయింపుల పర్వానికి తెర తీశారు. ప్రజాబలమే పునాదిగా పార్టీని ప్రారంభించిన జగన్ ఏమాత్రం చలించకుండా మొక్కవోని విశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు.

మైలురాళ్లు
2009 సెప్టెంబర్ 2: హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం
2009 సెప్టెంబర్ 25: ఓదార్పు యాత్ర చేస్తానని నల్లకాలువలో వైఎస్ జగన్ ప్రకటన
2010 నవంబర్ 29: కాంగ్రెస్ పార్టీకి, పదవులకు జగన్, విజయమ్మ రాజీనామా
2011, మార్చి 12: ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ పతాకావిష్కరణ
2011 మే 13: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం
2011 జూలై 8: ఇడుపులపాయలో తొలి ప్లీనరీ
2011 జూలై12: ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశం
2012 మే 27: వైఎస్ జగన్ అరెస్టు
2012 అక్టోబర్ 18: షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
2013 ఆగస్టు 25: సమైక్య రాష్ట్రం కోసం జైలులో జగన్ దీక్ష
2013 సెప్టెంబర్ 24: జైలునుంచి జగన్ విడుదల
2013 అక్టోబర్ 5: ఇంటిముందే సమైక్య దీక్ష
2013 అక్టోబర్ 26: రాజధానిలో సమైక్య శంఖారావం
2014 మే 7: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

Popular Posts

Topics :