13 March 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మాపార్టీని,నేతను తిట్టారు..

Written By news on Saturday, March 19, 2016 | 3/19/2016


' అచ్చెన్నాయుడుకు అప్పుడే సారీ చెప్పా'
హైదరాబాద్: నోటీసులు అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన  జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొడాలి నాని వివరణ ఇచ్చారు.  అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాను మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమందిని దూషించినట్లు బుద్ధప్రసాద్ కమిటీ...నివేదిక ఇచ్చిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పిందన్నారు.

' మేం పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో అచ్చెన్నాయుడు మా పార్టీని, మా నాయకుడిని తిట్టారు. మా పార్టీని సైకో పార్టీ అని, మా నాయకుడిని సైకో అని అచ్చెన్నాయుడు అన్నారు. అప్పుడు ఆవేశంగా కొన్ని మాటలు అన్నమాట వాస్తవమే. అదే కమిటీ ముందు చెప్పాను. అదేరోజు అచ్చెన్నాయుడు బాధపడి ఉంటే సారీ అని చెప్పాను. అచ్చెన్నాయుడు నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కొంతకాలం ఒకేపార్టీలో ఉన్నాం. ఆయనకు బాధ కలిగించి ఉంటే అప్పుడే సారీ చెప్పాను. మా మీద చర్య తీసుకోమని బుద్ధప్రసాద్ కమిటీ చెప్పిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పింది. అలాగే నిర్ణయం తీసుకోమని కమిటీకి చెప్పాం' అని ఎమ్మెల్యే నాని తెలిపారు.

నేను అనని మాటలను కూడా నివేదికలో పెట్టారు


'నేను అనని మాటలను కూడా నివేదికలో పెట్టారు'
హైదరాబాద్: తాను అసెంబ్లీలో అనని మాటలను కూడా బుద్ధప్రసాద్ కమిటీ నివేదికలో పొందుపరచడంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ భేటీ అయ్యింది. ఈ విచారణకు నోటీసులు అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

సభా హక్కుల కమిటీకి హాజరైన అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ ను ఉద్దేశించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు మనసుకు బాధకలిగించాయన్నారు. కమిటీ నివేదికలో ఉన్న మాటలు, ఆడియో, వీడియోల్లో లేవని..ఆ అంశాన్ని కమిటీకి నివేదించినట్లు చెప్పారు. తాను కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడిని..25 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉందని... చట్టసభలను, న్యాయవ్యవస్ధను గౌరవిస్తానని చెవిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు. అధికార పక్షం సంయమనం పాటిస్తే ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటిస్తాయన్న విషయాన్ని సభా హక్కుల కమిటీకి వెల్లడించినట్లు చెప్పారు.

మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'సభలో నేను ఎప్పుడూ అసభ్యపదజాలం వాడలేదు. ఒక వేళ అసభ్యపదజాలం వాడినట్లు నిరూపిస్తే కమిటీ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటానని' చెప్పారు. అస్వస్థత కారణంగా ఎమ్మెల్యే రోజా ఈ విచారణకు హాజరుకాలేకపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కమిటీకి వెల్లడించినట్లు తెలిపారు.

గాంధీ విగ్రహం వద్ద రోజా నిరసన


గాంధీ విగ్రహం వద్ద రోజా నిరసన
హైదరాబాద్ : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా.. తనను సభలోకి రెండోరోజు కూడా అనుమతించకపోవడంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం వద్దే ఉదయం 9 గంటల నుంచి రోజా మౌనదీక్ష చేస్తున్నారు. అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆమెకు తమ మద్దతు పలికారు. కొంతమంది ఆమెకు సంఘీభావంగా అక్కడే కూర్చున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా రోజాకు మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

మరోవైపు ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. తొలుత వాయిదా వేసిన తర్వాత కొద్ది సేపటికి మళ్లీ సమావేశమైంది గానీ, రెండోసారి పది నిమిషాలు వాయిదా వేసినా అరగంట తర్వాత కూడా సమావేశం కాలేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై చర్చిస్తున్నారు. కనీసం ఈ అంశంపై నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలాగని అడుగుతున్నా స్పందన లేదని ప్రతిపక్ష సభ్యులు మండిపడుతున్నారు.

హైకోర్టు కీలక తీర్పు

- ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్‌పై కేసు కొట్టివేత
- కంపెనీ పెట్టుబడులకు శ్రీనివాసన్‌కు సంబంధం లేదు

సాక్షి, హైదరాబాద్: 
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్విడ్ ప్రోకోలో భాగంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాసన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పు వెలువరించారు. ఇండియా సిమెంట్స్‌కు చేసిన భూ, నీటి కేటాయింపులకు, జగన్ కంపెనీల్లో శ్రీనివాసన్ పెట్టిన పెట్టుబడులకు సంబంధం లేదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఈవ్యవహారంలో శ్రీనివాసన్ వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు. కంపెనీ చర్యలకు శ్రీనివాసన్ బాధ్యుడు కాదన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ఇండియా సిమెంట్స్‌కు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం కడప జిల్లా, చౌడూరులో 2.60 ఎకరాల భూమి లీజు పొడిగింపు, కాగ్నా, కృష్ణా నదుల నుంచి నీటి కేటాయింపులు చేసిందని ఆరోపిస్తూ శ్రీనివాసన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్విడ్ ప్రోకోలో భాగంగా రూ. 140 కోట్లు శ్రీనివాసన్ పెట్టుబడులుగా పెట్టారని చార్జిషీట్‌లో పేర్కొంది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శ్రీనివాసన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కంపెనీ చర్యలకు శ్రీనివాసన్‌ను బాధ్యుడిని చేయడం తగదని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి విచారణ సందర్భంగా తెలిపారు.

బోర్డు తీర్మానం మేరకే పెట్టుబడుల నిర్ణయం జరిగిందన్నారు. రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎండీకి అధికారాన్ని కల్పిస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఏకీభవించారు. కంపెనీ చర్యలకు ఎండీని బాధ్యుడిగా చేయడం తగదంటూ సునీల్ భారతి మిట్టల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు తీర్పును న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. శ్రీనివాసన్‌పై నమోదు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా న్యాయమూర్తి ఈ సందర్భంగా రద్దు చేశారు.

'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా చర్యల్లేవు


'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా చర్యల్లేవు
హైదరాబాద్ : తాము ఇప్పటివరకు దాదాపు 20 సార్లు ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదుచేసినా ఒక్కసారి కూడా విచారణకు ఆదేశించలేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల దుస్తులతోనే శనివారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బుచ్చయ్య చౌదరి ఎంత అసభ్యంగా మాట్లాడుతూ మహిళలను కించపరిచారో చూశామని, ఆయనపై ఫిర్యాదుచేసినా చర్యలు లేవని అన్నారు. బోండా ఉమా అయితే 'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా ఆ మాటలను కనీసం రికార్డు నుంచి తొలగించలేదని, చర్యలు తీసుకోలేదని చెప్పారు. రావెల కిశోర్ బాబు విచిత్రమైన భాష మాట్లాడారని, దానిపైనా ఫిర్యాదు చేశామని అన్నారు. ఇక మరోమంత్రి ఉమామహేశ్వరరావు 'మిమ్మల్ని తగలబెట్టేస్తాం, అంతుచూస్తాం' అన్నా చర్యలు లేవని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

'ఏకంగా సభా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అంతుతేలుస్తా, పిచ్చాస్పత్రిలో చేరుస్తా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మంత్రి కామినేని శ్రీనివాస్ సైకోలు, పందులు అంటూ అన్ పార్లమెంటరీ మాటలు ఉపయోగించారు. ఇలా చేస్తే ఎవరికి వాళ్లమీద గౌరవం పెరుగుతుంది' అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని ఆధారాలతో మేం ఫిర్యాదుచేస్తే ఏ ఒక్కదానిపైనా విచారణ కూడా జరపడం లేదు. ఎంత స్వార్థంతో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. స్వయానా స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా రోజా సస్పెన్షన్ విషయంలో సభ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది అంటారు. ప్రతిపక్షం పూర్తిగా వ్యతిరేకించినా అది ఏకగ్రీవం ఎలా అవుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు

చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి


అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ ఇద్దరూ త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్‌లో సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు వాళ్లిద్దరికీ ఈ శిక్ష తప్పదని తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అమలుచేయాల్సిన అవసరం లేదని వీళ్లు అనుకుంటున్నారని, తమ తీర్పులే అంతిమం అని భావిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వస్తే గౌరవిస్తారు, లేకపోతే లేదా అన్నారు. ప్రాథమిక హక్కులు, మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా సభా వ్యవహారాలు జరిగినప్పుడే 212 అధికరణ పనిచేస్తుందని, అలా కాకుండా జరిగితే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ముందే చెప్పారన్నారు. యూపీలో 1964లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేను 7 రోజులు అరెస్టు చేస్తే లక్నో కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, డివిజన్ బెంచి కూడా సింగిల్ బెంచి తీర్పును సమర్థించిందని తెలిపారు. రాష్ట్రపతి న్యాయసలహా కోరితే సుప్రీంకోర్టు కూడా వ్యక్తి హక్కులకు భంగం కలిగించకూడదనే చెప్పిందని గుర్తు చేశారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా స్పీకర్ల నిర్ణయాన్ని కోర్టులు తప్పుబట్టాయని తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెవిరెడ్డి భాస్కర రెడ్డి స్పష్టం చేశారు. మైకిస్తే తమ అభిప్రాయం చెప్పగలమని, ప్రతిపక్ష నాయకుడు లేచి అధ్యక్షా అంటుంటే ఐదుగురు టీడీపీ సభ్యులు మాట్లాడారు గానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదని..
కనీసం చెవికెక్కించుకోడానికి అధికార పక్షం సిద్ధంగా లేకపోతే తాము ఏ విధంగా చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు.

ఇక తెలుగుదేశం ప్రభుత్వానికి అధికార అహంకారం తలకెక్కిందని మరో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కనీసం మహిళా శాసనసభ్యులన్న గౌరవం కూడా వాళ్లకు లేదని మండిపడ్డారు. కేవలం రోజా మీద, వైఎస్ఆర్‌సీపీ మీద వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఎమ్మెల్యేలు, సీఎం ఏడాదిపాటు ఆమెను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఇది మొదటి తప్పు అని చెప్పారు. తాము ఎంతో గౌరవంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, హైకోర్టులో జాప్యం జరుగుతుంటే సుప్రీంకోర్టుకు వెళ్లామని.. సాక్షాత్తు సుప్రీం ధర్మాసనం ''ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, మేం ఆందోళన చెందుతున్నాం'' అని వ్యాఖ్యానించిందంటే వీళ్లు సిగ్గుతో తలదించుకోవాలని, ఇది రెండో తప్పని చెప్పారు.

తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు ఒక్కరోజులో విచారణ పూర్తిచేసిన హైకోర్టు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఉత్తర్వులచ్చిందని, ఆ ఉత్తర్వులతో ఎమ్మెల్యే సభకు వస్తే, కోర్టు ఉత్తర్వులను కూడా అవమానించారని, ఇది న్యాయస్థానానికి జరిగిన అవమానమని చెప్పారు. ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి రాజ్యాంగాన్ని గౌరవించాలని, మహిళలను గౌరవించాలని కోరుతూ ధర్నా చేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తమకు గౌరవం ఉందని, మాకు లేదని ఎద్దేవా చేశారని, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా మీకు జ్ఞానోదయం కలగదా అని ఆయన ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు మీరు సాధించిందేంటి అని నిలదీశారు. రోజా సంధించే ప్రశ్నలకు సమాధానంచెప్పలేక భయపడుతున్నారా అని అడిగారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపప్పటి నుంచి ఇదే అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలుచేయాలన్న చిత్తశుద్ధి లేదని, వాళ్ల కార్యకర్తలు.. నాయకులను కాపాడుకోవడం, విచ్చలవిడిగా దోచుకోవడమే సరిపోతోందని ఆయన అన్నారు.

చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన

Written By news on Friday, March 18, 2016 | 3/18/2016


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ముగ్గురు మంత్రులపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇచ్చారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శిని కలిసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నోటీసులు అందజేశారు. సీఎంతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.

బడ్జెట్ సమర్పణ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు తమపై సీఎం, మంత్రులు దూషణలకు దిగారని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రేపు(శనివారం) అత్యవసరంగా భేటీ కానుంది.

కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ తీర్పులో జోక్యం చేసుకునే అధికారమే న్యాయవ్యవస్థలకు లేదని వారన్నారు.
 
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, అవసరమైతే రూల్స్‌ను కూడా మార్చే అధికారం తమకు ఉందని, దాన్ని కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కొంత మంది ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు, న్యాయస్థానం అభ్యంతరం చెప్పిందని, ఆ సందర్భంగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చించారని తెలిపారు. రోజా విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినా సభలో చర్చించిన తర్వాత ఆమె వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

వాళ్ళు ధర్నాలు చేసినా న్యాయం జరగదు
రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆందోళనలు చేసినా ఎంతమాత్రం న్యాయం జరగదని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. రోజాను చూస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని, ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానం రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మాత్రమే ఆదేశించిందని, ఆమెను అసెంబ్లీలోకి అనుమతించమని ఎక్కడ చెప్పలేదని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

అది మా ఏకగ్రీవ నిర్ణయం
రోజాను సస్పెండ్ చేయాలన్నది శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని, న్యాయస్థానం సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశించినా, దీనికి అసెంబ్లీ ఒప్పుకోవాల్సి ఉంటుందని అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెప్పారు. దేశంలో ఇలాగే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయని చెప్పిన ఆయన... ఎథిక్స్ కమిటీ నిర్ణయం లేకుండానే జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. కారణాలు ఏవైనా రోజా విషయంలో సభలో చర్చించాల్సిందే అన్నారు.

http://www.sakshi.com/news/hyderabad/tdp-mlas-comments-on-mla-roja-issue-324506?pfrom=home-top-story

స్పీకరే కొమ్ముకాస్తుంటే ఏం చేయాలి?


'స్పీకరే కొమ్ముకాస్తుంటే ఏం చేయాలి?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీని నడుపుతున్న తీరును చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ నరసింహన్‌ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లొచ్చిన తర్వాత ఆయన రాజ్ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు.

స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి టీడీపీకి కొమ్ముకాస్తున్నారని, రూల్స్ పర్మిట్ చేయకున్నా అన్యాయంగా అప్పుడు రోజాను సస్పెండ్ చేశారని అన్నారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఏకంగా రూల్ 71ను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అన్యాయంగా చంద్రబాబు ప్రభుత్వం శాసనసభను ఏరకంగా చేతుల్లో పెట్టుకుందో అందరూ చూస్తున్నారని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • రూల్ 342 ప్రకారం రోజాను సస్పెండ్ చేశామని చెబుతున్నారు. కానీ దాని ప్రకారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సెషన్‌ వరకు మాత్రమే చేయాలి. అయినా ఏడాది సస్పెండ్ చేశారు.
  • 8 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్‌సీపీ గుర్తుమీద ప్రజలు గెలిపిస్తే, వాళ్లను చంద్రబాబు తనవద్ద ఉన్న అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశాడు. వాళ్లు డిస్‌ క్వాలిఫై కాకుండా స్పీకర్, చంద్రబాబు కలిసి ఎలా కాపాడారో అందరం చూశాం.
  • వాళ్లపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు స్పీకర్ ఏకంగా రూల్ 71 అనేదాన్ని సస్పెండ్ చేశారు.
  • రాజ్యాంగానికి లోబడే అసెంబ్లీలో రూల్స్ ఫ్రేమ్ చేయాలి.
  • 179 సి నిబంధన ప్రకారం 14 రోజుల తర్వాతే మోషన్ చేపట్టాలి, విప్ జారీచేసే అవకాశం ఇవ్వాలి. కానీ, స్పీకర్ మాత్రం 14 రోజుల తర్వాత చేపట్టాల్సిన అంశాన్ని అదేరోజు చేపట్టేయడాన్ని మనం చూశాం.
  • ఇంత దారుణంగా అసెంబ్లీలో అధికార పక్షం ప్రవర్తిస్తోంది. ప్రజా సమస్యలు వినిపించకూడదని, ప్రతిపక్షం గొంతును నొక్కుతోంది.
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే, ప్రలోభపెడుతుంటే కాపాడాల్సిన స్పీకర్ టీడీపీకి కొమ్ముకాస్తున్నారు
  • మరీ దారుణం.. నేను అనని మాటలు వక్రీకరించి నాకు జ్యుడీషియరీ మీద గౌరవం లేదన్నారు
  • రోజమ్మ సుప్రీంకోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి హైకోర్టుకు వచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకుని వచ్చి స్పీకర్‌కు ఇచ్చిన తర్వాత కూడా ఆమెను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వలేదు.
  • మేం కోర్టుల కన్నా పెద్దవాళ్లం, కోర్టును బేఖాతరు చేస్తామంటూ స్పీకర్ తన పదవిని దుర్వినియోగం చేశారు
  • రోజాను అసెంబ్లీలోకి రానివ్వకపోవడంతో ఏం జరుగుతోందో తెలుసుకుందామని 8.50కి అసెంబ్లీకి వెళ్లాను. అప్పటికే ఆమెను అడ్డుకున్నారు.
  • నేను కూడా ఎమ్మెల్యేలతో అక్కడే ఆగి వారిని ప్రశ్నించా. గంటన్నరసేపు అక్కడ ధర్నాచేసినా వాళ్ల వైఖరిలో మార్పురాలేదు. చివరకు గాంధీ విగ్రహం వద్దకు కూడా వెళ్లి రోడ్డుమీద బైఠాయించాం.
  • గవర్నర్ లేకపోవడంతో ఆయన సెక్రటరీకి కాపీ ఇచ్చి, గవర్నర్‌ గారికి చెప్పాలని కోరాం
  • మధ్యంతర ఉత్తర్వులను పాటించని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుంది
  • సోమవారం కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలని సూచించింది. దాఖలు చేయబోతున్నాం
  • ఆ రోజు వాదనలు జరుగుతాయి.. తర్వాత కోర్టు ఉత్తర్వులతో హుందాగా అసెంబ్లీలో అడుగుపెడతాం
  • న్యాయవ్యవస్థకు లోబడి, మేమంతా రోజమ్మకు తోడుగా నిలబడుతున్నాం
  • అక్కడ రోజాను ఒక్కరినీ రోడ్డు మీద విడిచిపెట్టలేక సభలోకి వెళ్లలేదు
  • చంద్రబాబును ప్రశ్నిస్తేనే స్పీకర్ మైకివ్వరు.. ఇక ఆయన్నే ప్రశ్నించాలంటే మైకిస్తారా?
  • రోడ్డు మీద బైఠాయించాం, ఆ తర్వాత గవర్నర్ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నాం
  • రేపు ఏం చేయబోతున్నాం, నిరసన ఎలా వ్యక్తం చేస్తాం అనే అంశంపై కలిసికట్టుగా పార్టీ కార్యాలయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

చంద్రబాబును నమ్మి మోసపోయా


చంద్రబాబును నమ్మి మోసపోయా
► తిరుపతిలో యువ న్యాయవాది ఆత్మహత్యాయత్నం

తిరుపతి : ‘‘జాబు కావాలంటే బాబు రావాలి. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా. ఇంటికొక ఉద్యోగమిస్తా. ఉద్యోగం వచ్చేవరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తా’’ అని గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. బాబు వచ్చాడు.. జాబు వస్తుందన్న ఆశతో రెండేళ్లుగా ఎదురుచూసి.. చూసి.. విసిగి వేసారిపోయిన తిరుపతికి చెందిన యువ న్యాయవాది పోతులూరి మాసుమయ్య అలియాస్ మాసుం ఇండియా(30) గురువారం మరుగుదొడ్లను శుభ్రం చేసే ‘హార్పిక్ ’ యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్‌లో బాబును నమ్మినందుకు తమ కుటుంబం పూర్తిగా నష్టపోయిందని పేర్కొన్నాడు. తమ కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదని వాపోయాడు. ఒకపక్క చదువులకోసం అప్పులు చేసి, ఉద్యోగాలు రాక.. మరొకపక్క చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఏమీ చెయ్యలేని పరిస్థితిలో చనిపోతున్నానని పేర్కొన్నాడు.

పూర్వాపరాలివీ...

తిరుపతిలోని బాలాజీ కాలనీ, ఆంధ్రాబ్యాంక్ వద్ద నివాసముంటున్న పోతులూరి మాసుమయ్య అలియాస్ మాసుం ఇండియా(30) భార్య శ్రావణితోపాటు చెల్లెళ్లు రెడ్డిలక్ష్మి, సునీత, తమ్ముళ్లు సిద్ధయ్య, వెంకటరమణయ్య, చిన్నాన్న కుమార్తె రాధ, బావమరిది వెంకటేష్‌తో కలసి నివాసముంటున్నాడు. తమ కుటుంబసభ్యుల చదువులకోసం వడ్డీ వ్యాపారుల వద్ద రెండేళ్లక్రితం అప్పు చేశాడు. ఉద్యోగం వస్తే అప్పు తీర్చివేయవచ్చని భావించాడు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారం నేపథ్యంలో ఉద్యోగంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే లేకపోవడం..  నిరుద్యోగ భృతి కింద రూ.రెండువేలు ఇస్తామన్న హామీని సైతం తుంగంలో తొక్కేయడంతో మాసుమయ్య ఖిన్నుడయ్యాడు. అదే సమయంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడం, అవి చెల్లించలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి తీవ్రమవడంతో మనస్థాపానికి గురైన మాసుమయ్య గురువారం ఓ సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు యత్నించాడు. ‘హార్పిక్ ’ యాసిడ్‌ను తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు మాసుమయ్యను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు.

బాబు మోసం చేశారు..

 అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల్ని నిలువునా ముంచారంటూ బాధితుడు రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ‘‘బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి మోసం చేశారు. ఎక్కడా నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. ఒకపక్క రైతుల ఆత్మహత్యలు, మరోపక్క నిరుద్యోగులు ఉన్నత చదువులు చదువుకొని ఏమిచేయాలో తెలియక దొంగలుగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఆకలికి అలమటిస్తూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీన్ని చూసి నేనొక న్యాయవాదిగా తట్టుకోలేకపోతున్నాను. మా కుటుంబంలో సుమారు పదిమంది బీటెక్, బీఎస్సీ, బీఈడీ, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నారు. కానీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ప్రైవేటు, కాంట్రాక్టు ఉద్యోగాల్లో సరైన జీతాల్లేవు. కనీసం పదివేల రూపాయలు కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వోద్యోగం ఉంటేనే ఏదైనా లోను ఇస్తామని బ్యాంక్‌వారు అంటున్నారు. చంద్రబాబును నమ్మినందుకు మా కుటుంబం పూర్తిగా నష్టపోయింది. ఒకపక్క చదువులకు అప్పులు చేసి ఉద్యోగాలు రాక, మరోపక్క వడ్డీలు కట్టలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో చనిపోతున్నాను’’ అని మాసుమయ్య అందు లో తెలిపాడు. తాను గతంలో పలు ఉద్యమాలు చేశానని, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు ప్రయత్నం కూడా చేశానని నోట్‌లో ఆయన గుర్తు చేశాడు. ‘జగనన్నా.. మీరైనా ఈ దేశాన్ని కాపాడండి. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు నివారించండి. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయించండి. ఉద్యోగ భద్రత కల్పించండి’ అని నోట్‌లో మాసుమయ్య విజ్ఞప్తి చేశాడు.
 

Popular Posts

Topics :