23 October 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

అమ్మాయిల హాస్టల్‌లో రావెల అనుచరులు

Written By news on Friday, October 28, 2016 | 10/28/2016


అమ్మాయిల హాస్టల్‌లో రావెల అనుచరులుమంత్రి అనుచరులు బస చేసేందుకు అధికారులు సమకూర్చిన పరుపులు, దుప్పట్లు
గుంటూరు : మంత్రి రావెల కిశోర్ బాబు వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ‘సంక్షేమాన్ని’ విస్మరించిన మంత్రి తన అనుచరులకు ఏకంగా అమ్మాయిల హాస్టల్లోనే వసతి కల్పించారు. అధికార దర్పంతో విద్యార్థినుల భద్రతను విస్మరించిన ఈ ఘటన గుంటూరులో బుధవారం  చోటు చేసుకుంది. స్థానిక పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో నిన్న ప్రభుత్వ దళిత, గిరిజనబాట, మెగా రుణమేళాను ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం మంత్రి రావెల అనుచరులు వందమందికి పైగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు వచ్చారు.
వారందరికీ కలెక్టరేట్‌ రోడ్డులోని పరివర్తన భవన్‌లో ఆశ్రయం కల్పించారు. ఆ భవన్‌లోనే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ నడుస్తోంది. బాలికలు ఉండే చోట మగవారికి ఆశ్రయం కల్పించకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ తన అనుచరుల కోసం మంత్రి వాటికి తిలోదకాలిచ్చారు. కొంతమంది అధికారులు వారించినా మంత్రి పెడచెవిన పెట్టినట్లు తెలిసింది.

ఉత్తుత్తి భవనాలకు మరో శంకుస్థాపన


ఉత్తుత్తి భవనాలకు మరో శంకుస్థాపన
డిజైను లేదు.. టెండరూ లేదు!
ఈసారి ప్రభుత్వ భవన సముదాయానికి రాయపూడిలో జైట్లీతో
సాక్షి, అమరావతి: ఊహల రాజధాని అమరావతిలో మరో శంకుస్థాపనకు రాష్ర్టప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే అనేక శంకుస్థాపనలు, పలుమార్లు భూమి పూజలు చేసిన ప్రభుత్వం ప్రతి నెలా ఏదో ఒక హడావుడి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈసారి ప్రభుత్వ భవనాల సముదాయానికి శంకుస్థాపన చేసేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శుక్రవారం దీనికి శంకుస్థాపన చేయించనుంది. వాస్తవానికి ఈ కాంప్లెక్స్ రూపురేఖలపై ఇంకా ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఆ మాటకొస్తే అసలింత వరకూ దాని డిజైనే ఖరారు కాలేదు. ఇప్పట్లో దీనికి టెండర్లు పిలిచే పరిస్థితి కూడా లేదు.

మరో ఏడాదైనా ఈ నిర్మాణం ప్రాంభమవుతుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటి ఈ కాంప్లెక్స్‌కు తుళ్లూరు మండలం రాయపూడి సమీపంలో జైట్లీతో శంకుస్థాపన చేయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అరుణ్ జైట్లీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు 11.40కి చేరుకుంటారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాయపూడి గ్రామంలో మధ్యాహ్నం 3.30 నుంచి 3.45 గంటల మధ్య శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు కూడా పాల్గొంటారు. శంకుస్థాపన సందర్భంగా జరిగే బహిరంగ సభ  అనంతరం జైట్లీ విజయవాడలో బీజేపీ ఏపీ కమిటీ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే విందుకు హాజరౌతారు.

ఈ పర్యటనలో భాగంగా జైట్లీ  ఏపీ పరిపాలనా భవనాలతో పాటు రూ. 1,016 కోట్లతో నిర్మించే  ఏడు గ్రిడ్ రోడ్లు, రూ. 461 కోట్లతో నిర్మించే  స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6.00 గంటలకు విజయవాడ నుంచి  ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. శంకుస్థాపన కార్యక్రమం జరిగే ప్రాంతంలో నిర్వహించనున్న బహిరంగ సభ కోసం దాదాపు 100 ఎకరాలలో భూమిని చదును చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం మరో 29 ఎకరాలను చదును చేసినట్లు వారు తెలిపారు. అంతేకాక శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశానికి దారితీసే అనేక రోడ్లను తాత్కాలికంగా నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి భారీగా ఖర్చుచేశారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనాన్ని, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులను తరలించడానికిప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పలు కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

రెండున్నరేళ్లుగా అన్నీ శంకుస్థాపనలే..
పేరుకు ప్రపంచస్థాయి రాజధాని.. అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం. రెండున్నరేళ్లు గడిచాయి. కానీ అక్కడ ఒక్క ఇటుక నిలబెట్టలేదు. ఒక్క తట్టమట్టి కదిలించలేదు. కోట్లు కుమ్మరిస్తూ పదేపదే శంకుస్థాపనలు మాత్రం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటివరకూ అమరావతిలో రాజధానికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క నిర్మాణాన్నీ మొదలు పెట్టిన పాపాన పోలేదు. వెలగపూడిలో హడావుడిగా అరకొర సదుపాయాలతో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం తప్ప ప్రధానమైన నిర్మాణాలేవీ పునాదులు కాదు కదా కనీసం డిజైన్‌కు కూడా నోచుకోలేదు. ఇక శంకుస్థాపనల విషయానికొస్తే..

తాళ్లాయపాలెంలో భూమిపూజ:   2015 జూన్ ఆరో తేదీన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి ఆర్భాటంగా భూమిపూజ చేశారు. కుటుంబసభ్యులతో కలసి పూజ నిర్వహించి పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత భూమిపూజ జరిగిన ఈ ప్రాంగణానికి భద్రత పేరుతో అప్పట్లో అక్కడ ప్రత్యేక పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కొన్ని నెలలపాటు పోలీసులు షిఫ్ట్‌ల వారీగా అక్కడ కాపలా కాశారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి నిర్మాణం జరక్కపోగా ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉంది. అక్కడ భూమిపూజ జరిగిందనే విషయాన్ని కూడా చాలామంది మరిచిపోయారు.

ఉద్ధండరాయునిపాలెంలో శంకుస్థాపన: 2015 అక్టోబర్ 22న దసరా పండుగరోజు తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో రూ.250 కోట్లకుపైగా ఖర్చు పెట్టి శంకుస్థాపన నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన చేయించగా గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనాన్ని సమీకరించడంతోపాటు పవిత్రత కోసమంటూ 16 వేల గ్రామాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదుల నుంచి మట్టి, నీరు సేకరించారు. అఖండజ్యోతి పేరుతో అన్ని చోట్ల నుంచి జ్యోతులను వెలిగించి శంకుస్థాపన ప్రాంగణానికి తెప్పించారు. యాగాలు, పూజలు కూడా చేయించారు.

సేకరించిన మట్టితోనే రాజధాని నిర్మాణాలన్నీ చేపడతానని చంద్రబాబు ప్రకటించడంతో ప్రధాని మోదీ కూడా పార్లమెంటు నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తెచ్చి ఆయనకిచ్చారు.అవి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో భద్రంగా ఉండగా, మిగిలినవాళ్లిచ్చిన మట్టి వర్షాలకు కొట్టుకుపోయింది. నీళ్లు ఏమయ్యాయో తెలియదు. అఖండ జ్యోతిని అమరావతి అమరేశ్వరాలయానికి పంపించారు.ఏడాది దాటిపోయినా ఉద్ధండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఒక్క నిర్మాణం మొదలు కాలేదు. శిలాఫలకం, శిథిలమైన యాగశాల, రాజధాని త్రీడీ నమూనా షెడ్డే  ఉన్నాయి.

వెలగపూడిలో ‘తాత్కాలికం : ఈ ఏడాది ఫిబ్రవరి 17న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తవకుండానే కృష్ణా పుష్కరాలు కారణంతో జూన్‌లో ఒక గదిని సిద్ధం చేసి సీఎం దానికి ప్రారంభోత్సవం చేశారు.ఇటీవలే దసరా తర్వాత రోజు అందులోని తన కార్యాలయానికి ప్రారంభించారు. అంతకు కొద్దిరోజుల  నుంచి మంత్రులంతా తమ ఆఫీసులకు వరుసగా ప్రారంభోత్సవాలు చేసుకున్నారు. దీని రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఇది వెయ్యి కోట్లకు చేరుతుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.
 
ఇంకా డిజైన్ల అన్వేషణలోనే సీఆర్‌డీఏ
రాజధాని ప్రాంతంలో 900 ఎకరాల్లో అసెంబ్లీ, హైకోర్టులను ఐకానిక్ భవనాలుగా నిర్మించాలని, సచివాలయం, విభాగాధిపతులు, శాఖాధిపతులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు వంటి భవనాలను ప్రభుత్వ కాంప్లెక్స్‌లో నిర్మించాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాల డిజైన్ల కోసం అంతర్జాతీయ స్థాయిలో పోటీ నిర్వహించి జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌ను ఎంపిక చేశారు. కానీ ఆ డిజైన్లపై తీవ్ర విమర్శలు రావడంతో చాలా రోజులు నాన్చి కొద్దిరోజుల క్రితం ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. జపాన్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకున్నాక కొత్త డిజైన్ల కోసం సీఆర్‌డీఏ, సీసీడీఎంసీలు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున అన్వేషణ సాగిస్తున్నాయి.

సరైన ఆర్కిటెక్చర్ కోసం రెండు రోజుల క్రితమే సీఆర్‌డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. వివిధ సంస్థలు టెండర్లు కోడ్ చేసి ప్రతిపాదించిన డిజైన్లలో ఒక దాన్ని ఎంపిక చేసి వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ తర్వాత ఆ సంస్థ అన్ని భవనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను సమర్పిస్తుంది. ఇందుకు అనేక డిజైన్ సంస్థల సహకారంతోపాటు వందలాది మంది ఆర్కిటెక్చర్లు పనిచేయాల్సి ఉంది. ఈ ప్రక్రియంతా నిర్వహించడానికి కనీసం సంవత్సరం పడుతుంది. అప్పుడు తుది డిజైన్ల ఆధారంగా నిర్మించాల్సిన భవనాలకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ నిర్వహించి నిర్మాణ సంస్థలను ఎంపిక చేయాలి. ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.5,600 కోట్లు, సముదాయంలో మౌలిక వసతులకు మరో నాలుగు వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ సొమ్మును అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి అప్పుగా తీసుకోవడానికి ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకూ ఎటువంటి ఆశ కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం సామెత చందంగా అసలు ఎలా ఉండాలో తెలియని ప్రభుత్వ కాంప్లెక్స్‌కు అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించనుండడం విశేషం. 2015 జూన్ ఆరో తేదీన తాళ్లాయపాలెంలో భూమిపూజ, 2015 అక్టోబర్ 22న ఉద్ధండరాయునిపాలెంలో ప్రధానితో శంకుస్థాపన చేయించినట్లే ఈసారి రాయపూడిలో దీనికి జైట్లీతో శంకుస్థాపన చేయిస్తున్నారు.
 
2015 జూన్ 6    
రాజధానికి తాళ్లాయపాలెంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ
 
2015 అక్టోబర్ 22
దసరా నాడు ఉద్ధండరాయునిపాలెంలో భారీ ఖర్చుతో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
 
2016 ఫిబ్రవరి 17
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన
రాయపూడిలో పరిపాలనా భవనాల శంకుస్థాపనకు  జైట్లీ రాక

వైఎస్ జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Written By news on Wednesday, October 26, 2016 | 10/26/2016

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలులో నిన్న యువభేరి కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గంలో హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకుల వద్ద  ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్‌ అయింది. అయితే డ్రైవర్ అప్రమత్తతో కారును నియంత్రించటంతో ప్రమాదం తప్పింది. కారు టైరు మార్చిన తర్వాత ఆ వాహనంలోనే ఆయన హైదరాబాద్‌ వచ్చేశారు. వైఎస్ జగన్ సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి ఉండటంతో భద్రతా సిబ్బంది అక్కడికి ఎవరినీ రానీయలేదు.

http://www.sakshi.com/news/hyderabad/ys-jagan-mohan-reddy-narrowly-escapes-a-road-accident-415790

ఆయన తప్పు చేస్తే... శిక్ష మాకా!!

Written By news on Tuesday, October 25, 2016 | 10/25/2016


ఆయన తప్పు చేస్తే... శిక్ష మాకా!!వీడియోకి క్లిక్ చేయండి
కర్నూలు : బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల సందర్భంగా ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు చేసిందేమీ లేదని  బీటెక్ విద్యార్థిని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆమె మంగళవారమిక్కడ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి అయ్యాక పెట్టుబడులు తెస్తామంటూ చంద్రబాబు ఫారిన్ టూర్ వెళ్లి వచ్చారు కదా. విదేశీ పర్యటనల తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయని’  ఆమె అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ... చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో పోరాటం చేసేవారన్నారు.

ప్రత్యేక హోదా వస్తే...ఆయన పెట్టుబడుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.  చంద్రబాబు ఈ మధ్య కాలంలో విశాఖలో విదేశాలతో ఎంవోయూలు అని...  నాలుగు లక్షల 67 కోట్ల పెట్టుబడులు, పది లక్షల మందికి ఉద్యోగాలు అంటూ డబ్బాలు కొట్టారన్నారు. అయితే ఆయన ఒక్క ఉద్యోగాన్ని కూడా తీసుకు రాలేదన్నారు. ఉద్యోగాలు రావాలంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు   ప్రత్యేక హోదా ఇచ్చేలా నిలదీయాలన్నారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో చంద్రబాబు చేసింది శూన్యమన్నారు.
పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొన్నదన్నారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు రావడం అటుంచి ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని, విశాఖ నుంచి హెచ్ఎస్ బీసీ ఇప్పటికే వెళ్లిపోయిందన్నారు. మన్నవరం ప్రాజెక్టు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చిందని, స్పిన్నింగ్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు.

మరో బీటెక్ విద్యార్థిని జోత్స్య మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు తప్పు చేసి.. దాని నుంచి తప్పించుకొనేందుకు హోదాను తాకట్టు పెట్టారని, ఆయన తప్పు చేస్తే.. శిక్ష మాకా అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు ఏ విషయాన్ని అయినా మేనేజ్ చేసుకోవటం బాగా తెలుసు అని, ఆయన తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. విద్యార్థులనే కాకుండా రాష్ట్ర ప్రజలందర్ని మోసం చేశారన్నారు.

2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదానే: వైఎస్ జగన్


2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదానే: వైఎస్ జగన్
కర్నూలు : వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మారుస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కర్నూలులో జరుగుతున్న యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరు కలిసి పోరాడితేనే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను ప్రజలు తమ ఉద్యమంతో సాధించుకున్నారని, అలాగే సమిష్టి పోరాటంతో ప్రత్యేక హోదాను కూడా సాధించుకు తీరుదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు. హోదా కోసం పోరాటం కొనసాగిద్దామని, రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ను వైఎస్ఆర్ సీపీ ఎంపీలు స్తంభింపచేస్తారన్నారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదాపై పోరాడతామని, అప్పటికీ కేంద్రం స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నారు. ఆ తర్వాత హోదా నినాదంతోనే ఉప ఎన్నికలకు వెళతామన్నారు. మళ్లీ గెలిచి ప్రత్యేక హోదా నినాదాన్ని పార్లమెంట్ లో వినిపిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక


రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చూపిన బాటలో నడుస్తామని ఆమె హామీయిచ్చారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో జరుగుతున్న యువభేరిలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం యావత్తు ప్రత్యేక హోదా కోరుకుంటుంటే అధికార పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరముందన్నారు.

'ప్రత్యేక హోదాతో రాష్ట్రం అన్ని రకాలు అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఈ విషయంలో జగనన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పాటించడానికి సిద్దంగా ఉన్నాం. అవసరమైతే రాజీనామా వల్ల ప్రత్యేక హోదా వస్తుందని విశ్వసిస్తే, మీ భవిష్యత్ కోసం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ'ని బుట్టా రేణుక అన్నారు.

హైదరాబాద్ కు బదులు హోదా ఇస్తామన్నారు


‘హైదరాబాద్ కు బదులు హోదా ఇస్తామన్నారు'
కర్నూలు : ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు ఆడుతున్న కపట నాటకాలపై యువతను చైతన్యపరిచేందుకు వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం కర్నూలులో విద్యార్థులు, యువతతో భేటీ  అయ్యారు.
గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్ ఫంక్షన్ హాలులో జరుగుతున్న యువభేరీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘ఇవాళ యువభేరి కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ ఆదరణ, ఆప్యాయతలకు చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.  ప్రత్యేక హోదాకు సంబంధించి యువభేరి కార్యక్రమంలో ఒకటయ్యాం. హోదా వల్ల అవసరాలు ఏంటీ... ఎందుకు కావాలి. ఏ రకంగా ఇది సంజీవని అనేది మనకు తెలిసిన విషయలే. హోదా అనేది సంజీవని అని, హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు పాలకులు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ తర్వాతే రాష్ట్రాన్ని విడగొట్టారు.

ఇవాళ ఏ పిల్లాడు అయినా చదువు అయిన తర్వాత నేరుగా హైదరాబాద్ వెళతాడు... కారణం ఏంటంటే ఇవాళ దాదాపు 98 శాతం సాప్ట్ వేర్ ఉద్యోగాలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ ...తదితర సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజనతో  హైదరాబాద్ నగరం లేకుండా పోతుందని, దాని స్థానంలో ప్రత్యేక హోదా ఇస్తామని, ఆ హోదా వల్ల ఏపీ కూడా బాగుపడుతుంది, ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని అధికార, ప్రతిపక్ష పాలకులు అన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు హామీ ఇచ్చారు. ఒకరేమో పదేళ్లే అంటే ...మరొకరేమో పరిశ్రమలు పెట్టడానికి మూడేళ్లు పడుతుంది కాబట్టి పదేళ్లు కాదు ...ఏకంగా 15 ఏళ్లు కావాలన్నారని  వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ అదే నాయకులు ప్లేట్ మార్చారు. హోదాకు ఉద్యోగాలకు సంబంధం లేదని చెబుతున్నారని ఆయన అన్నారు. మాట తప్పిన నేతలను గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత ముఖ్యమన్నారు. ఎన్నాళ్లు బతికామనేది కాదని, ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. మోసం చేసినా కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితి లేకపోవడం బాధకరమని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు.
వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే...
 • రైతుల ఓట్ల కోసం రుణమాపీ చేస్తామన్నారు
 • మహిళల ఓట్ల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు
 • జాబు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పిల్లలను వదిలిపెట్టలేదు..
 • బాబు ముఖ్యమంత్రి అయ్యారు...అందరినీ గాలికొదిలేశారు
 • హోదా వస్తే కేంద్రం నుంచి 90 శాతం నిధులు గ్రాంట్ గా వస్తాయి
 • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు ఇస్తారు
 • చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16 సార్లు విదేశాలకు వెళ్లారు
 • పారిశ్రామిక రాయితీలు ఇస్తే బాబు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు
 • హోదా వస్తే ఎక్సైజ్ డ్యూటీ, ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు
 • హోదా కోసం అవసరం అయితే ఎంపీలతో కూడా రాజీనామాలు చేయిస్తాం
 • ప్రత్యేక హోదా వచ్చేవరకూ నిరంతర పోరు

కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి


కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. కర్నూలు శివారు గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. 10వేల మంది సామర్థ్యం కలిగిన కన్వెన్షన్‌ హాలులో ఇందుకోసం సుమారు ప్రత్యేక వేదిక ఇప్పటికే రూపుదిద్దుకుంది.
 
సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో కలిసి ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ సభాస్థలి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ యువభేరిలో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నందున విద్యార్థులు, యువకులతో పాటు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఏర్పాట్ల పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కార్యదర్శి పోచం శీలారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, ఆ విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కోర్టు తీర్పు ఇచ్చేలోగా ఆయన్ను మార్చండి: ఆర్కే

Written By news on Monday, October 24, 2016 | 10/24/2016

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంఛార్జ్ సెక్రటరీ సత్యనారాయణ ఆ పదవికి అనర్హుడంటూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సత్యనారాయణకు లా డిగ్రీ లేదని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. కనీసం డిగ్రీ కూడా లేని వ్యక్తి అసెంబ్లీ సెక్రటరీగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఇంటర్ మాత్రమే చదివిన వ్యక్తి చట్టాలు చేసే సభకు ముఖ్య అధికారిగా ఉండటమంటే తాము తలదించుకోవడమేనని అన్నారు. గతంలో తాను ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా స్పందించలేదని చెప్పారు. ఈ విషయంపై గవర్నర్ నరసింహన్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ లకు లేఖలు రాశానని తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చేలోగా అసెంబ్లీ సెక్రటరీని మార్చాలని ఆర్కే డిమాండ్ చేశారు.

ప్రత్యేక ప్యాకేజీ పచ్చి మోసం

Written By news on Sunday, October 23, 2016 | 10/23/2016


'ప్రత్యేక ప్యాకేజీ పచ్చి మోసం'
-ఓటమి భయంతోనే కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం వెనుకంజ
-విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాల్సిందే
- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి


అనకాపల్లి: ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ మసిబూసి మారేడుకాయ చేసే చందంగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఇష్టాగోష్టిలో స్థానిక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ ఐదేళ్లు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులనే ప్యాకేజీగా చిత్రీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీపై నిజంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉత్తర్వులు జారీ చేశారా అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ రెండేళ్లుగా దీక్షలు, ధర్నాలు, యువభేరి వంటి కార్యక్రమాలు నిర్వహించిందని, ఈ క్రమంలోనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విశాఖపట్నంలో పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. హోదా వచ్చేవరకు తమ పార్టీ ఉద్యమాలు ఆపదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గడప గడపకు వెస్సార్‌సీపీ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఉద్యమాలు చేశారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదన్నారు.

ఎట్టిపరిస్థితిలోనూ విశాఖకు రైల్వే జోన్ ఇచ్చితీరాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ బిల్లును సమర్థిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఇందులో విశాఖ నగర పాలకసంస్థకు కూడా ఉందని, అయితే టీడీపీకి విజయావకాశాలు లేకపోవడంతో కాలయాపన చేస్తోందని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :