27 November 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ యువసేన

Written By news on Saturday, December 3, 2016 | 12/03/2016


వైఎస్సార్‌సీపీలోకి   టీడీపీ యువసేన
సాగర్‌నగర్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా శుక్రవారం కై లాసగిరి పోలీస్ క్వార్టర్స్, కో ఆపరేటివ్ లే అవుట్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జోడుగుళ్లపాలెంకు చెందిన టీడీపీ యువసేన సభ్యులు 70 మందిని వైఎస్సార్‌సీపీలో చేరారు. వారిని వంశీకృష్ణ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ అహర్నిశలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీలోకి చేరడం ఆనందంగా ఉందని జి.దుర్గారావు, రాఘవరాం, ఎం. అమర్‌నాథ్, బి.బద్రీ, సీహెచ్.సతీష్ తదితరులు పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆరో వార్డు పార్టీ అధ్యక్షుడు లొడగల రామ్మోహన్, కార్యదర్శి ఉమ్మిడి నాగేశ్వరరావు, గరికిన నూకరాజు, జోడుగుళ్లపాలెం వాడబలిజ సంఘం ప్రధాన కార్యదర్శి గరికిన అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

7,8 తేదీల్లో ‘తూర్పు’లో వైఎస్ జగన్ పర్యటన


7,8 తేదీల్లో ‘తూర్పు’లో వైఎస్ జగన్ పర్యటన
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తెలిపారు. 7 వ తేదీ రంపచోడవరం, మారేడుమిల్లిలో పర్యటన కొనసాగనుంది. 8 వ తేదీ విలీన మండలాల్లో పర్యటించి పోలవరం నిర్వాసితులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అనంతరం కాళ్లవాపు బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు కన్నబాబు వెల్లడించారు.

గడప గడపకు వైఎస్సార్ పై సమీక్షలు


గడప గడపకు వైఎస్సార్ పై సమీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో చంద్ర‌బాబు రెండేళ్ల పాలన వైఫ‌ల్యాల‌తో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వైస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 5,6 తేదీల్లో సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు 13 జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ అవుతారు. ఈ నెల 5న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో, 6న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నేతలతో ఆయన సమావేశమవుతారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ


చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైద్యం కోసం పేదలు పొలాలు అమ్ముకోవాల్సిన దుర్భరమైన పరిస్థితులు మీ పుణ్యాన రాష్ట్రంలో మళ్లీ వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన బహిరంగలేఖలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


ఫీజు రీయింబర్స్ మెంట్‌, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు అమలుకాక, చదువుల కోసం, వైద్యం కోసం పొలాలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని.. ఆ పొలాలు అమ్ముకుందామన్నా, అమ్ముకునే వీలు లేకుండా రిజిష్ట్రేషన్లు బంద్‌ చేసి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఇటీవల బందర్‌పోర్ట్‌ ప్రాంతంలోని పల్లెల్లో బాధితులు చెప్పడం కలచివేసిందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని మీరు పథకం ప్రకారం బలహీనపరుస్తున్నారా, లేక మీ అసమర్థత వల్ల ఆ పథకం బలహీన పడుతుందా అని లేఖలో జగన్‌ ప్రశ్నించారు.

’మహానేత వైఎస్‌ఆర్‌ పథకమైన ఆరోగ్యశ్రీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవగా మార్చారు. సంతోషం! అయితే ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యానికి చంద్రబాబు ఎంతటి ’అమూల్యమైన సేవ’లు అందించారో ఈ పథకానికి కూడా అలాంటి సేవలే అందించి, కోట్ల ప్రజలకు సంజీవని అయిన ఈ పథకానికి పాడె కడుతున్నారన్నదే తమ ఆందోళన’ అని జగన్‌ అన్నారు.

2016-17కు సంబంధించి ఈ పథకానికి కనీసం రూ. 910.77 కోట్లు కావాలి అని సంబంధిత విభాగం తెలుపగా.. ప్రభుత్వం మాత్రం రూ. 569.23 కోట్లు కేటాయించిందన్నారు. ఇక మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేనాటికే ఆరోగ్యశ్రీ బకాయిలు ఏకంగా రూ. 395.69 కోట్లు ఉన్నాయని, బకాయిలు పోతే నికరంగా ఈ పథకానికి చేసిన కేటాయింపులు ఎంత అని జగన్‌ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1 కోటీ 30 లక్షల కుటుంబాలకు ఈ కేటాయింపులతో న్యాయం జరిగే వీలుందా.. కావాల్సిన నిధులు కేటాయించకుండా ఆసుపత్రుల్లో చికిత్సలు ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.

గుండె జబ్బులు, మల్టిపుల్‌ ఫ్రాక్షర్లు, క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలు ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న రోగుల పరిస్థితిని ఒకసారి చూడాలని జగన్‌ సూచించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ఆరు నుంచి తొమ్మిది నెలలుగా చెల్లించకపోవటం వల్ల.. రోగులకు చికిత్స చేయడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయన్నారు. తెల్లకార్డు ఉండి కూడా వైద్యం అందక ప్రజలు పడుతున్న అవస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్రద్ధ చూపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిద్దుబాబు చర్యలు తీసుకోని పక్షంలో ఈ నెల 9న జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలకు దిగుతామని వైఎస్‌ జగన్ స్పష్టం చేశారు.

పూర్తి లేఖకు ఇక్కడ క్లిక్‌ చేయండి

గుంటూరు జిల్లాలో జగన్ కు ఘన స్వాగతం


వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ జగన్‌
గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అంతకుముందు వైఎస్‌ జగన్‌కు పార్టీ గుంటూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
 
 
 

బంగారంపై ఆంక్షలు దారుణం

Written By news on Friday, December 2, 2016 | 12/02/2016


‘బంగారంపై ఆంక్షలు దారుణం’
తిరుపతి: బంగారంపై ఆంక్షలు విధించడం దారుణమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీకి మహిళల ఉసురు కచ్చితంగా తగులుతుందని పేర్కొన్నారు.

అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని విమర్శించారు. నోట్ల రద్దు పేరుతో కేంద్ర ప్రభుత్వం.. సామాన్యుల ప్రాణాలు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల కష్టాలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

గ్రామాల్లో ఎవరు ట్రైనింగ్‌ ఇస్తారు బాబు?

Written By news on Thursday, December 1, 2016 | 12/01/2016


‘గ్రామాల్లో ఎవరు ట్రైనింగ్‌ ఇస్తారు బాబు?’
కర్నూలు: బ్యాంకుల నుంచి డబ్బుల విత్‌ డ్రా చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. బ్లాక్‌ మనీ వెలికితీతకు సామాన్యులను ఇబ్బంది పెట్టే చర్యలకు కేంద్రం దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో 92శాతం గ్రామాలకు బ్యాంకింగ్‌ సదుపాయాలు లేవని అన్నారు. అలాంటప్పుడు నగదు రహిత లావాదేవీలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మొబైల్‌ బ్యాంకింగ్‌ చేయాలంటూ సూచనలు చేస్తున్నారని, గ్రామాల్లోని వారికి ఎవరు ట్రైనింగ్‌ ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత


తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత: వైఎస్‌ జగన్‌
కోన: ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే తన్నితరిమిన చరిత్ర కోన గ్రామానికి ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. అలాంటిది పోర్టు పేరుతో బలవంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటివాడని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల ఆస్తులు లాక్కుని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరే రాష్ట్రానికి ఉండడని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం బందర్‌ పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన సభలో  వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.


గతంలో ఎన్నికల సమయంలో కోనకు వచ్చిన చంద్రబాబు నాలుగువేల ఎకరాలు ఎందుకు 1800 ఎకరాల్లో పోర్టు కట్టిస్తామని అన్నారని, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలతో ఆటలాడుకుంటూ నాలుగువేల ఎకరాలు సరిపోదని 30 వేల ఎకరాలు అని చెప్పి.. మరోసారి మాటమార్చి ఏకంగా లక్షా ఐదువేల ఎకరాలు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలయినంత తక్కువ భూముల్లో పోర్టు కట్టించాలని, మిగితా భూములు రైతులకే వదిలిపెట్టాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.
పోర్టు పేరుతో అధికంగా భూములు తీసుకొని వేరే వాళ్లకు అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ ఒక దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతభూమిని లాక్కుని వారికి వెయ్యి గజాలు మాత్రం ముష్టి వేస్తారని చంద్రబాబు అంటున్నారని, దీనిని ఎలా సమర్థించాలని నిలదీశారు. రైతులకు అతి ఆశ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎకరాకు రూ.30 వేలు పదేళ్లపాటు ఇస్తానని చంద్రబాబు అని, చివరకు అవి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 నుంచి రూ.50లక్షల ధర ఉంటే వేలు ఇచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్నారు.

చంద్రబాబుకు అసైన్డ్‌ భూములంటే చాలా చులకన అని, పేదవానికి అసైన్డ్‌ భూములిచ్చినప్పుడు మరింత భూములిచ్చి వారిని ఆదుకోవాల్సింది పోయి ఇష్టమొచ్చినప్పుడు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. ఇక్కడ భూములకు కాలువ నీళ్లిచ్చే పరిస్థితి లేదని, బ్యాంకుల నుంచి క్రాప్‌లోన్లు కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తూ రైతులపై కక్షపూరిత చర్యలు చంద్రబాబు చేస్తున్నారని  ధ్వజమెత్తారు.
వ్యక్తిగత అవసరాలకోసం భూములు కూడా అమ్ముకోనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన ఇక మరెంతకాలమో సాగదని అన్ని సక్రమంగా ఉంటే రెండేళ్లేనని, దేవుడు దీవిస్తే మరో ఏడాదిలోనే బంగాళఖాతంలో కలుస్తుందని వైఎస్‌ జగన్‌ చెప్పారు. త్వరలోనే ప్రజల ప్రభుత్వం వస్తుందని, అందరి భూములు భద్రంగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.

ఎక్కడ చూసినా తొక్కిసలాటలు

Written By news on Monday, November 28, 2016 | 11/28/2016


‘ఎక్కడ చూసినా తొక్కిసలాటలు’
తిరుపతి: నోట్ల కష్టాలతో ప్రజల ఆక్రందనల్ని తమ గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఉక్కు పిడికిలితో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన చేసిన తమపై దౌర్జన్యాలు చేయిస్తోందని మండిపడ్డారు.

సోమవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ... చేతులకు సంకెళ్లు వేయగలరేమో కానీ గళాలకు సంకెళ్లు వేయలేరని స్పష్టం చేశారు. నోట్ల కష్టాలతో ప్రజలంతా ఆక్రందనలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతా బాగున్నట్టుగా ప్రచారం చేసుకోవడం శోచనీయమన్నారు.


‘నల్లధనం వెలికి తీయాలనే సంకల్పం గొప్పదే. పెద్ద నోట్ల రద్దును ఆహ్వాని​స్తున్నాం. నవంబర్‌ 8న ప్రధాని మోదీ చేసిన ప్రకటనను మనస్పూర్తిగా స్వాగతించాం. ఆ తర్వాతే అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. గగ్గోలు మొదలైంది. ఎక్కడ చూసినా తోపులాటలు, తొక్కిసలాటలు. నోట్ల కష్టాలతో దాదాపు 100 మంది మరణించారు. ముందస్తు సన్నాహాలు చేసి పెద్ద నోట్లను రద్దు చేసివుంటే ఈ దురవస్థ రాకుండా ఉండేది. ఊరంతా నిప్పు ఎందుకు పెట్టారయ్యా అంటే దోమల్ని చంపడానికి అన్న చందంగా పరిస్థితి తయారైంది. 9 నెలల వరకు నోట్ల కష్టాలుంటాయని ఆర్థిక నిపుణులు ఉటంకిస్తున్నారు. బీజేపీ అంటే భయంకరంగా జనాన్ని పీడిస్తున్న పార్టీ, టీడీపీ అంటే తెలివిగా దేశాన్ని దోచుకుంటున్న పార్టీ. ముందే లీకులు అందించడంతో లీకు వీరుడు చంద్రబాబు తన దగ్గరున్న లక్ష కోట్ల ధనాన్ని తెలివిగా తెల్లధనంగా మార్చుకున్నారు. మోదీని ఏమీ అనలేక బ్యాంకర్లపై చంద్రబాబు దాడి చేస్తున్నార’ని భూమన అన్నారు.

అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి?


అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి?
హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దుపై జరిగిన హర్తాళ్ కు ప్రజలు మద్దతు ప్రకటించారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ...  చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, అరెస్టులు చేయిందని విమర్శించారు.

ప్రజల ఇబ్బందులు పట్టవా, నోట్ల కష్టాలపై మీ వైఖరేంటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం లేదా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడితే గృహనిర్బంధాలా అని వాపోయారు. చంద్రబాబుతో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్‌ గ్రూపు ఔట్‌ లెట్లలో ప్రజలకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఏటీఎంలు ఉండగా... ఫ్యూచర్‌ గ్రూపుతో చేసుకున్న ఒప్పందం ఏంటని అడిగారు.
 

Popular Posts

Topics :