ప్రత్యేక హోదా కోసం 26న 13 జిల్లాల కేంద్రాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా కోసం 26న 13 జిల్లాల కేంద్రాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన

ప్రత్యేక హోదా కోసం 26న 13 జిల్లాల కేంద్రాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన

Written By news on Tuesday, January 24, 2017 | 1/24/2017


♦ ప్రత్యేక హోదాపై మరింత ఉధృతంగా పోరాటం: వైఎస్‌ జగన్‌
♦ పార్టీలకతీతంగా చేయికలుపుదాం.. సమైక్య పోరాటంతో సాధిద్దాం
 రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున మరో చారిత్రాత్మక పోరాటానికి రాష్ట్రం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకహోదా సాధించడం కోసం మరింత ఉధృత పోరాటానికి సమాయత్తం కావాలని యువతకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీలకతీతంగా చేయి కలుపుదామని, సమైక్యపోరాటంతో హోదా సాధిద్దామని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ప్రత్యేకహోదాకు మద్దతు పలకాలని విద్యార్థులకు, ప్రత్యేకించి యువతకు జగన్‌ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని జగన్‌ సోమవారంనాడు ట్వీట్‌ చేశారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ రెండున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న సంగతి తెల్సిందే. తాజాగా çతమిళనాట జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో యువత ప్రత్యేకహోదా సాధన దిశగా ఉధృతపోరాటానికి ఉరకలు వేస్తోంది. జల్లికట్టు సాంప్రదాయాన్ని రక్షించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టిన తమిళనాడు యువకుల తెగువ తెలుగునాట స్ఫూర్తిని నింపింది. వైఎస్‌జగన్‌ పిలుపుమేరకు 26న రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది యువకులు ప్రత్యేకహోదా సాధన ఉద్యమానికి మద్దతుగా చేయీచేయీ కలపనున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాలుపంచుకునేందుకు సమాయత్తమవు తున్నారు. ఇదేసమయంలో ప్రత్యేకహోదాపై సీఎం చంద్రబాబు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుకు ప్రత్యేకహోదాకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నించడంతో యువకుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ముందుండి కేంద్రంపై పోరాడాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి విస్మరించడంపై ఇప్పటికే నిరుద్యోగయువత మండిపడుతోంది.

అందరూ మద్దతు పలకండి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కోరుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న 13 జిల్లాల కేంద్రాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో పాల్గొనటం ద్వారా ప్రజాస్వామికంగా, శాంతియుత పద్ధతిలో ప్రత్యేక హోదా డిమాండుకు మద్దతు పలకాల్సిందిగా విద్యార్ధులకు, యువతకు ప్రత్యేకించి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని కాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని కోరారు. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే అది ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యమని, ప్రజాపక్షంగా వైఎస్సార్‌సీపీ రెండున్నరేళ్లుగా అటు పార్లమెంటులోను, ఇటు శాసన సభల్లోను, వినతుల ద్వారా, విభిన్న నిరసన కార్యక్రమాల ద్వారా పోరాటం చేస్తోంది..

రెండున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాటం
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండున్నరేళ్లుగా అవిశ్రాంతపోరాటం సాగిస్తుండడాన్ని విద్యార్ధులు, యువకులు నిశితంగా గమనిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులోనూ వెలుపలా నిరంతరాయంగా పోరాడుతున్నది వైఎస్సార్‌కాంగ్రెస్‌ ఒక్కటేనన్న అభిప్రాయం యువతలో నెలకొంది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించడమే కాక 2015 ఆగస్టు 10న జగన్‌ దేశరాజధాని ఢిల్లీలో ధర్నా చేసి ప్రత్యేకహోదా అంశం దేశం దృష్టిని ఆకర్షించేలా చేశారు. 2015 జూన్‌ 3,4 తేదీల్లో మంగళగిరిలో చేసిన సమరదీక్ష, అదే ఏడాది అక్టోబర్‌లో నల్లపాడు వద్ద చేసిన ఆమరణదీక్ష ప్రత్యేకహోదా విషయంలో వైఎస్‌ జగన్‌ పట్టుదలను చాటిచెప్పిందని నిరుద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యనగరాలు, పట్టణాలలో వరుసగా జరుపుతున్న యువభేరి సదస్సులతో విద్యార్థులు, నిరుద్యోగ యువతలో చైతన్యం నింపుతున్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలను కలుపుకుని నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్‌లు ప్రజల్లో ప్రత్యేక హోదా పట్ల ఉన్న ఆకాంక్షను స్పష్టంగా వెల్లడించాయి.

హోదా ఉద్యమకారులపై నిర్బంధం
ప్రత్యేక హోదా కోసం తాను పోరాడకపోగా పోరాడుతున్న యువతపై చంద్రబాబు నిర్బంధం ప్రయోగిస్తున్నారు. బంద్‌లలో పాల్గొన్న యువకులపై కేసులు మోపి వేధిస్తున్నారు. ధర్నాలు, దీక్షలలో పాల్గొననీయకుండా గృహనిర్బంధం చేస్తున్నారు. జగన్‌ నిర్వహిస్తున్న యువభేరి సదస్సులకు అనుమతినివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువభేరి సదస్సులకు వెళ్లవద్దని విద్యార్థులను, నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడేవారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. యువభేరి సదస్సుకు హాజరయ్యారన్న నెపంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినాయకులను కాలేజీనుంచి సస్పెండ్‌ చేయడం కలకలం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ప్యాకేజీ ఎక్కడ ఇచ్చారు...?
ప్రత్యేక హోదా.. పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధాని ఇచ్చిన హామీ. దానికి కూడా దిక్కులేకపోతే ఎలా అన్నది ఇపుడు రాష్ట్రంలో యువతను వేధిస్తున్న ప్రశ్న. అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటననే ఓ గొప్ప ప్యాకేజీగా తెలుగుదేశం, బీజేపీ నాయకులు, మంత్రులు ప్రకటిస్తుండడం చూసి అందరూ విస్తుపోతున్నారు. విభజనచట్టంలోని హామీలనే వరుసగా వల్లెవేశారు తప్ప రాష్ట్రానికి కొత్తగా ఇచ్చిన ప్యాకేజీ ఏమిటో ఇప్పటివరకు ఎవరికీ అర్ధం కాలేదు. జాతీయహోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తిచేయాల్సి ఉండగా ఆబాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకోవడం ఎందుకో అందరికీ తెలిసిందే. కాంట్రాక్టులు నచ్చినవారికి కట్టబెట్టడం, కమీషన్లు దండుకోవడం కోసమే తప్ప పోలవరం బాధ్యత చంద్రబాబుకు ఎందుకు తీసుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం కోసమే ప్రత్యేకహోదాను వదులుకున్నానని చంద్రబాబు ప్రకటించడంపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హోదాపై మాటమార్చిన ముఖ్యమంత్రి
ప్రత్యేకహోదాపై పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాల్సిందేనని ఎన్నికల సభల్లో డిమాండ్‌ చేసిన చంద్రబాబు పదవినధిష్టించగానే మాటమార్చడం చూసి ప్రజలు విస్తుపోయారు. ప్రత్యేకహోదా ఏమన్నా సంజీవనా అని వ్యాఖ్యానించిన నోటితోనే ప్రత్యేక హోదా మన జీవన్మరణ సమస్య అని కూడా చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రకటించగానే తన రక్తం మరిగిపోయిందని ఊగిపోయిన చంద్రబాబు అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి మరీ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అసలు కేంద్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోయినా అదేదో పెద్ద ప్యాకేజీ ఇచ్చినట్లు అది ప్రత్యేక హోదా కన్నా మెరుగైనదన్నట్లు చంద్రబాబు గొప్పగా చెబుతుండడం చూసి యువతలో అసహనం పెల్లుబుకుతోంది. విభజన హామీలతోపాటు, ప్రత్యేక హోదాను సాధించడం కోసం ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా కేంద్రం ముందు సాగిలపడడమేమిటని యువకులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. మరోవైపు రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా పదేళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇపుడు అసలు ప్యాకేజీయే లేకపోయినా అది ప్రత్యేకహోదా కన్నా మెరుగైనదని ప్రచారం చేస్తున్నారు. అది కూడా తనవల్లే వచ్చినట్లుగా సన్మానాలు చేయించుకున్నారు. విభజనచట్టంలోని హామీలు తప్ప ఏపీకి కొత్తగా ఒరిగిందేమీ లేకపోయినా అబద్దపు ప్రచారాలు చేస్తుండడంపై యువకులు, ముఖ్యంగా నిరుద్యోగులు రగిలిపోతున్నారు.
Share this article :

0 comments: