వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారు: రామకృష్ణారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారు: రామకృష్ణారెడ్డి

వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారు: రామకృష్ణారెడ్డి

Written By news on Friday, January 27, 2017 | 1/27/2017


వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారు: రామకృష్ణారెడ్డి
హైదరాబాద్ :
వైఎస్ఆర్ కుటుంబం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు బురద జల్లుతున్నారని వైఎస్ఆర్‌సీపీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారని అడిగారు. గురువారం నాటి ఘటనలు, అనంతరం చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలపై ఆయన శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దాదాపు గంట పాటు ప్రశాంత వదనంతో మాట్లాడిన ముఖ్యమంత్రి, మెత్తటి మాటలతో దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఎంత దారుణమైన పనులు చేశారు, ఎన్ని ఘోరాలు ఆపాల్సి వచ్చింది, వాటన్నింటికీ ఒక వ్యక్తి కారణం, అతడి కుటుంబ నేపథ్యం ఇదీ అన్నారని చెప్పారు.

ఈ కుటుంబానికి ఒక చరిత్ర ఉందన్నారని, ఏం చరిత్ర ఉందని రాజశేఖరరెడ్డిని రెండు సార్లు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారని అడిగారు. వైఎస్ ఉన్న ఐదేళ్లలోనే కదా విశాఖకు సాఫ్ట్‌వేర్ పార్క్ వచ్చింది, టూ టైర్ అభివృద్ధి కోసం నిధులొచ్చింది, ఆయన ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉండేది అని గుర్తుచేశారు. వాల్తేర్ క్లబ్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. గత ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఏమీ కాదని.. తర్వాత మళ్లీ తాము అక్కడ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అసలు పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపుమాపేందుకు ప్రయత్నించిన ఒక నాయకుడి కుటుంబం గురించి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నతండ్రి 1998లో హత్యకు గురైతే.. ఆ కేసులో ప్రధాన నిందితుడికి రక్షణ కల్పించింది నాటి సీఎం చంద్రబాబేనని, అతడికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి మరీ రక్షించారని చెప్పారు. ఒక నాయకుడిని రాజకీయంగా బలహీనం చేయడానికి ఇంట్లో పెద్దాయనను హత్య చేసినా, ప్రతీకారానికి ఆయనేమీ ప్రయత్నించలేదని అన్నారు. వైఎస్ఆర్ దుర్మరణం మీద కూడా తమకు అనుమానాలున్నాయని, అది జరిగిన పద్ధతి చూస్తే ఎవరికైనా అనుమానాలు వస్తాయని.. అయినా ఆ కుటుంబం ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు గానీ, మీరు మాత్రం దాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. 
 

ఏమీ లేని స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారని చంద్రబాబు ప్రశ్నించారని, ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామికాభివృద్ధి ఎలా జరుగుతుందని చూపించమన్నారని.. ఏమీ లేకపోతే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో టీడీపీ నాయకులు కూడా వెళ్లి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రయోజనం లేకపోతే, పెద్ద పరిశ్రమ పెట్టడానికి మూడేళ్ల సమయం సరిపోతుంది, రెండేళ్లు చాలవు కాబట్టి పది, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల సమయంలో ఎందుకు అడిగారని, వెంకయ్య నాయుడు పార్లమెంటులో అదే విషయం ఎందుకు ప్రస్తావించారని ఆయన నిలదీశారు. 900 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉండి, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా వస్తే మరింత అభివృద్ధి ఉంటుందన్నది అందరి ఆకాంక్ష అని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల హోదా ఇస్తామని వాళ్లే అన్నారని చెప్పారు. ప్రస్తుత వేగంతో వెళ్తే ఐదేళ్లు కాదు.. 50 ఏళ్లలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టమని ఆయన అన్నారు. 
 
 
ఇక విశాఖపట్నంలో గురువారం జరిగిన ఘటనలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రిపబ్లిక్ డే ఒక పవిత్రమైన రోజని, ఆ రోజును అంతా ప్రశాంతంగా, పండగలా చేసుకుంటారని, కొవ్వొత్తుల ర్యాలీ అనేది ఏరకంగానూ దానికి భంగం కలిగించేది కాదు, భావప్రకటనా స్వేచ్ఛను పండుగలా చేసుకున్న రోజు కాబట్టే తలపెట్టారని రామకృష్ణారెడ్డి అన్నారు. ఆరోజు బంద్, హర్తాళ్ లాంటివి చేస్తామంటే తప్పు గానీ, పావురాలు ఎగరేయడం, కొవ్వొత్తులు వెలిగించడం లాంటివి తమ భావాన్ని ప్రకటించడమే అవుతుందని, ఇంత ప్రశాంతమైన కార్యక్రమాన్ని రెచ్చగొట్టేలా చేసింది ఎవరని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు అక్కడకు వచ్చారని, ఆయన చేతుల్లో ఏమీ లేకపోయినా కనీసం లాంజ్‌లోకి కూడా రానివ్వకుండా రన్‌వే మీదే ఆపడంలో ఉద్దేశం ఏంటని సూటిగా అడిగారు. దానికి ముందు ఆర్కే బీచ్ మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఎందుకు సృష్టించాల్సి వచ్చిందని మండిపడ్డారు. సెలవు కాబట్టి మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ మంది వస్తారని, అలాంటప్పుడు ఎందుకు బీచ్‌ను దిగ్బంధించారని ప్రశ్నించారు. విచ్ఛిన్నకరశక్తులు, టెర్రరిస్టులు వైజాగ్‌ను తగలబెట్టడానికి వస్తుంటే ఆపద్దా అన్నారని, ఇంత క్రూరమైన మాటలను అంత ప్రశాంతంగా చెప్పినందుకు హ్యాట్సాఫ్ అని అన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉందని, అందులో ఈయన కొత్తగా తెచ్చింది ఏముందని అడిగారు. మొత్తం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని చట్టంలో ఉంటే.. మనకు మనం కుదించుకుని, పని మనం చేస్తామని వెళ్లడం ఎందుకని, చేతులారా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని తెలిపారు. ప్యాకేజిలో కొత్తగా ఏమీ లేవని, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు అన్నింటినీ ముందే చెప్పారని అన్నారు. ఎన్టీ రామారావును తప్పించి విజయవంతంగా పార్టీ నాయకుడు అయ్యి, ఇంతకాలం పార్టీని నడుపుతున్నవాళ్లకు కొంత ఎక్కువే జ్ఞానం ఉండొచ్చు గానీ, ఎదురుగా ఉన్నవాళ్లకు విచక్షణ లేదనుకుని మాట్లాడితే ఎలాగని ఎద్దేవా చేశారు. 
Share this article :

0 comments: