మహిళలకు ఇదేనా మీరిచ్చే ప్రోత్సాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళలకు ఇదేనా మీరిచ్చే ప్రోత్సాహం

మహిళలకు ఇదేనా మీరిచ్చే ప్రోత్సాహం

Written By news on Saturday, February 11, 2017 | 2/11/2017


మహిళలకు ఇదేనా మీరిచ్చే ప్రోత్సాహం
హైదరాబాద్ :
మహిళా సాధికారతకు తాము కృషి చేస్తున్నామని, వాళ్లకు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడానికే మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఒక మహిళా ఎమ్మెల్యేను ఆహ్వానించి మరీ పోలీసులతో కిడ్నాప్ చేయించడం ఏంటని పీఏసీ చైర్మన్, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే అడ్డుకుని అక్కడినుంచి పోలీసులతో బలవంతంగా తరలించిన వైనాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఆయన శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక శాసనసభ్యురాలిని ఆహ్వానించి, కమిటీలో సభ్యురాలిగా కూడా పెట్టి వచ్చినప్పుడు హాజరయ్యేందుకు కూడా అవకాశం లేకుండా కిడ్నాప్ చేసినట్లు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఫోన్‌లో కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడుతుంటే వెనకాల నుంచి పోలీసులు ఆ ఫోన్‌ను కూడా లాగేసుకున్నారని, దానికి విజువల్స్ రూపంలో సాక్ష్యాలున్నాయని చెప్పారు. అసలిది ప్రజాస్వామ్యమేనా, భారతదేశంలోనే ఉన్నామా అని ప్రశ్నించారు. ఇంట్లో పెళ్లికి ఆడవాళ్లను పిలిపించుకుని, అదే పెళ్లికి వాళ్లను రాకుండా మధ్యలో ఆపేస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఇది అలాగే ఉందని విమర్శించారు. శాసనసభ్యురాలిని అసలు ఎందుకు రానివ్వడం లేదని, మీ భయానికి కారణం ఏంటని సూటిగా ప్రశ్నించారు. 
 
ఇంతకుముందు కూడా రోజాను అసెంబ్లీలో ఏవో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని, కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చినా, మార్షల్స్‌ను పెట్టి కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా ఆపారని అన్నారు. విశాఖపట్నంలో సీఐఐ సదస్సు జరుగుతుంటే, అదే రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సివిల్ పోలీసులు రన్ వే దగ్గరే ఆపేసి అటు నుంచి అటే మళ్లీ బలవంతంగా హైదరాబాద్‌కు పంపేశారని, అసలు ఎందుకంత భయపడుతున్నారని అడిగారు. ఒకరిద్దరు వ్యక్తులు వస్తేనే ఇంత భయపడాల్సిన అవసరం ఏముందని, మీలో ఏవో లోపాలు లేకపోతే భయం ఎందుకని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలను పాల్గొనేందుకు ఉత్తేజపరచడానికి సదస్సు నిర్వహిస్తున్నామన్నారని, ఇదేనా ఉత్తేజపరచడమని నిలదీశారు. ఏదో నియంత పాలన ఉన్న దేశాల్లో జరుగుతున్నట్లుగా ఇక్కడ ఉందని, పోలీసు శాఖను ఇంత దారుణంగా ఎవరైనా వాడుకుంటారా అని అడిగారు. 
 
ఈ సదస్సు వల్ల లాభం ఏమిటంటే.. కేవలం సెల్ఫ్ ప్రమోషన్ మాత్రమేనని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఏమైనా అంటే తాము నిజాయితీగా ఉన్నామంటున్నారని, అమరావతిని చూస్తే అక్కడ చేసేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ప్రాజెక్టులలో కమీషన్లు తీసుకోవడం విన్నాం గానీ, కేవలం కమీషన్ల కోసమే కట్టినది పట్టిసీమ ప్రాజెక్టు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. పుష్కరాలకు 3500 కోట్లు ఖర్చుపెట్టామంటున్నారని, ఆ డబ్బుతో లెట్రిన్లు కట్టారా అని ప్రశ్నించారు. 
 
అసలు సర్పంచి నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరినైనా పనిచేయనిస్తున్నారా అని, ఏమైనా అంటే జన్మభూమి కమిటీలు అంటున్నారని మండిపడ్డారు. వితంతువులకు పింఛను కావాలంటే ఆ కమిటీ వాళ్లు లంచాలు తీసుకుంటున్నారని, రుణాలలో కూడా పర్సంటేజిలు అడుగుతున్నారని.. ఇలా అవినీతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిపోయారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిజంగా మనం సరిగా పాలన చేస్తే ఫొటోలు జేబులో పెట్టుకోవక్కర్లేదని, అవి ప్రజల హృదయాల్లో ఉంటాయని చెప్పారు. ఇప్పుడు చేస్తున్న పనులకు ప్రభుత్వం నూరుశాతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజలకు అన్నిరకాలుగా ఇబ్బందులు కలిగించి, వాటిని తారస్థాయికి తీసుకెళ్తేనే గతంలోనూ విప్లవాలు వచ్చాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు. ఓటు ద్వారా ప్రజలు నూటికి నూరుశాతం ఆ వ్యతిరేకతను చూపిస్తారని అన్నారు. 
Share this article :

0 comments: