పోలీస్‌స్టేషన్‌లా.. టీడీపీ ఆఫీసులా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీస్‌స్టేషన్‌లా.. టీడీపీ ఆఫీసులా?

పోలీస్‌స్టేషన్‌లా.. టీడీపీ ఆఫీసులా?

Written By news on Wednesday, February 8, 2017 | 2/08/2017


– టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పంచాయితీలు
– మండిపడ్డ మాజీ ఎంపీ అనంత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

అనంతపురం సెంట్రల్‌ : జిల్లాలో పోలీసుస్టేషన్‌లు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు మండిపడ్డారు. ధర్మవరం పోలీసుల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకులను వారు పరామర్శించారు. ఏ తప్పు చేయకున్నా తమను అన్యాయంగా సీఐ హరినాథ్‌బాబు కేసులో ఇరికిస్తున్నారని బాధితులు సాయికుమార్, ప్రకాష్ , ఇస్మాయిల్, పవన్‌కుమార్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులను కూర్చోబట్టి వారి కళ్లెదుటే తమను చితకబాదారని కన్నీటి పర్యంతమయ్యారు.

అనంతరం అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సీఐలు, ఎస్‌ఐలు జిల్లా ఎస్పీ, డీజీపీ ఆదేశాలు కాకుండా స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారని విమర్శించారు. వారు తెచ్చిన పంచాయితీలను సెటిల్‌మెంట్స్‌ చేస్తూ చెరిసగం పంచుకుంటున్నారన్నారు. దీని వలన జిల్లాలో శాంతి భద్రతలకు భంగం వాటిళ్లుతోందని అన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్ష నేతలను అణగదొక్కడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు, పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు.

అధికార పార్టీ నాయకులకు పోలీస్‌స్టేషన్‌లు పంచాయితీ కార్యాలయాలుగా మారాయన్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా పోలీస్‌స్టేషన్‌లకు తీసుకొచ్చి చితకబాదుతున్నారని తెలిపారు. అదే టీడీపీ నేతలు ఏం చేసినా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లను గాడిలో పెట్టాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఇదే విధంగా కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ధర్మవరం పోలీసుల చేతిలో గాయపడిన యువకులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
Share this article :

0 comments: