చంద్రబాబూ.. ఇదేం వైఖరి..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబూ.. ఇదేం వైఖరి..?

చంద్రబాబూ.. ఇదేం వైఖరి..?

Written By news on Sunday, March 26, 2017 | 3/26/2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మహిళలనీ చూడకుండా దుర్భాషలాడుతున్నారు. చేయి చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు మహిళలు, అధికారులు కంటతడి పెట్టిన సందర్భాలున్నాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా.. అధికార పార్టీ నాయకులను వెనకేసుకు వచ్చింది. అదే ప్రతిపక్ష నాయకుల విషయానికి వస్తే వారు ప్రశ్నిస్తేనే లేనిపోని కేసులు పెట్టి వేధిస్తోంది.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాద దుర్ఘటనలో 12 మంది  మరణించినపుడు.. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లిన సందర్భంగా పోస్టుమార్టమ్ నివేదిక కోరిన విషయంలో కలెక్టర్‌తో ఇష్టానుసారం ప్రవర్తించారంటూ ప్రభుత్వం నానా రభస సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం ఏర్పాటు చేయించారు. వైఎస్ జగన్‌ను తప్పుపడుతూ, జరిగిన ఘటనను ఖండించాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అదే అధికార పార్టీ నాయకులు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. తాజాగా రవాణ శాఖ కమీషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుల దాడి ఘటనే ఇందుకు ఉదాహరణ. టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు ఇద్దరు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారితో ఇష్టానుసారంగా మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదు. ఐఏఎస్ అధికారుల తరహాలోనే ఈ విషయంలో ఐపీఎస్ అధికారుల సమావేశం జరగలేదు. ఈ ఘటనను ముఖ్యమంత్రి గానీ, రవాణా శాఖ మంత్రిగానీ ఎక్కడా ఖండించలేదు.

ఇదే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధికారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్‌ వనజాక్షి విషయంలో ఇష్టానుసారం వ్యవహరించినప్పటికీ చర్యలు లేకపోగా చంద్రబాబు అసెంబ్లీలో ఆ ఘటనను సమర్థించుకున్నారు. కాల్ మనీ కేసు, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, అనంతపురం జిల్లాలో మహిళపై దాడి.. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా చంద్రబాబు నిందితులపై తగిన చర్యలు తీసుకోలేదని, కొందరిని కాపాడే ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి.


ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న ఉద్దేశంతోనే బాలసుబ్రహ్మణ్యం పై దాడికి సంబంధించి ఆదివారం హడావిడి చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను పిలిపించి చంద్రబాబు మందలించినట్టు, దానిపై వారు జరిగిన దానికి చింతిస్తున్నామంటూ ప్రకటన చేయడం అంతా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న భయంతోనే చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం అనంతరం వారు బాలసుబ్రహ్మణ్యం కార్యాలయానికి వెళ్లి కలుసుకోవడం, ఈ ఘటనను తేలిక చేసే ఉద్దేశంతోనే చేసినట్టుగా ఉందని వారంటున్నారు.
Share this article :

0 comments: