'నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ

'నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ

Written By news on Tuesday, March 28, 2017 | 3/28/2017


'టెన్త్‌'కు లీక్‌ తెగులుజవాబులతో చీటీలను సిద్ధం చేస్తున్న ‘నారాయణ’ సిబ్బంది. పక్క ఫొటో లీకైన ప్రశ్నపత్రం
‘నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ
- పరీక్షా కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాల సేకరణ
- తమ విద్యార్థులకు వాట్సాప్‌లో సమాధానాల చేరవేత
- నెల్లూరులో సైన్స్‌ పేపర్‌ –1, మడకశిరలో తెలుగుపేపర్‌ –1 లీక్‌
- కదిరిలో ముందుగానే బయటకొచ్చిన హిందీ పేపర్‌
- జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు చిక్కిన ‘నారాయణ’ సిబ్బంది
- రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయిన లీకేజీలు
- పరీక్షల ప్రారంభానికి ముందే వాట్సప్‌లలో ప్రత్యక్షం
- టెన్త్‌ పత్రాలు రోజూ బయటకు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
- కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం


సాక్షి, అమరావతి
లీక్‌... లీక్‌... లీక్‌... ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకొచ్చేస్తున్నాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్‌ విద్యాసంస్థ ‘నారాయణ’  హస్తం ఉండడం నిర్ఘాంతపరుస్తోంది. ఇప్పటివరకు పరీక్ష పత్రాల లీకేజీలు జరిగిన కేంద్రాలన్నీ నారాయణ స్కూళ్లే కావడం గమనార్హం.

అయితే పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతరులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం వరకే  విద్యాశాఖ పరిమితమవుతోంది. ఈ సంస్థ మంత్రి నారాయణకు సంబంధించినది కావడం, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనా స్వయానా వియ్యంకులు కావడం వల్లే అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీలపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో ప్రశ్నపత్రం లీకవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకపోవడం పట్ల విద్యారంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని చోట్లా ‘నారాయణ’ నుంచే...
– నెల్లూరులోని నారాయణ హైస్కూల్‌నుంచి టెన్త్‌ సైన్స్‌ పేపర్‌–1ను శనివారం వాట్సప్‌ ద్వారా బయటకు పంపించారు. అధికారులు చీఫ్‌సూపరింటెండెంటు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. నారాయణ సంస్థకు చెందిన వ్యక్తులతో పాటు కొంతమంది ప్రభుత్వ టీచర్లుకూడా ఈ లీకేజీ వెనుక ఉన్నారని చెబుతున్నారు.

– పదో తరగతి పరీక్షలు ఈనెల 17నుంచి ప్రారంభం కాగా,  తొలిరోజే తెలుగు పేపర్‌–1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి లీకైంది. అరగంటకే నలుగురు యువకులు కిటికీలోనుంచి ప్రశ్నపత్రం సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టారు.  ఈ ఘటనకు కారకుడైన  హిందూపురం పట్టణంలో నారాయణ పాఠశాలకు సంబంధించిన ఏఓ ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన మొబైల్‌ ఫోన్‌ నుంచి పలువురికి ప్రశ్నపత్రం పంపాడని తేలింది.

– ఆ తర్వాత రెండు రోజులకే కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీక్‌ అయింది. నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబులు సిద్ధం చేస్తూ మీడియా కంట పడ్డారు. పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాస్తున్న అన్ని కేంద్రాలకు జవాబులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు కదిరి పట్టణంలోని అన్ని కేంద్రాల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లు సీజ్‌ చేసి విచారణ చేశారు.  ప్రశ్నపత్రం ఈ ప్రాంతం నుంచి లీక్‌ కాలేదని తేల్చారు. అయితే ఈ ప్రశ్నపత్రం, సమాధానాల పత్రాలు  నారాయణ పాఠశాలకు అనంతపురం జిల్లా నుంచి కాకుండా బయట జిల్లాల నుంచి  వచ్చినట్లు విద్యాశాఖాధికారులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నారాయణ పాఠశాలలకు ఇదే తరహాలో ప్రశ్నపత్రం వెళ్లిందని, అందులో భాగంగానే కదిరి బ్రాంచ్‌కు వచ్చిందని వారు అంతర్గతంగా చెబుతున్నారు. ఆ సంస్థల్లో ఏటా ఇదేతంతు సాగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై డీఈఓ లక్ష్మినారాయణ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. వేరే ప్రాంతం నుంచి ఈ ప్రశ్నపత్రం వచ్చిందని వారు పేర్కొనగా తమ పరిధిలో ఈ ఘటన జరిగితేనే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కేసు నమోదుకు అంగీకరించకపోవడం విశేషం.
–చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, పీలేరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల్లో రోజు ప్రశ్నాపత్రాలు బయటకు వస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి సంబంధిత సబ్జెక్టు నిపుణులకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. వారి నుంచి సమాధానాలు సేకరించి పిల్లలతో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌ చేయిస్తున్నారు.

– కడప జిల్లాలోనూ ఇదే తరహా లీకేజీలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాట్సప్‌లలో ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే దర్శనమిస్తున్నా మౌనం దాలుస్తున్నారు.  

గ్రేడ్ల పోటీ వల్లే లీకేజీలు..
నారాయణ సంస్థలో ఆయా స్కూళ్ల డీన్లు, ప్రిన్సిపాళ్లకు ఎవరు ఎక్కువ ఏ గ్రేడ్లు సాధిస్తే వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతుండడంతో ఆ స్కూళ్లన్నీ ఈ అక్రమాలకు తెగబడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ముందుగానే ఆయా స్కూళ్ల సిబ్బందితో కుమ్మక్కై  ప్రశ్నపత్రాలను బయటకు తెస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ షరామామూలుగా మారినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. ఈ లీకేజీల వ్యవహారంపై మంత్రి గంటాతోపాటు ఉన్నతాధికారులు కూడా పట్టీపట్టనట్లుంటున్నారు.

కఠిన చర్యలు శూన్యం
పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రాలు వాట్సప్‌లలో ప్రత్యక్షమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, ఫోన్లలో వాట్సాప్‌ల ద్వారా తమ విద్యార్థులకు పంపించి, పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నా విద్యాశాఖ కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అప్పుడప్పుడు మొక్కుబడిగా ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు చేపట్టకపోవడంతో లీకేజీ ఆగడాలకు బ్రేకులు పడడం లేదు. పరీక్షా కేంద్రాల్లో స్మార్ట్‌ ఫోన్లను నిషేధించామని అధికారులు చెబుతున్నారు. అయితే, నిత్యం పరీక్షకు ముందుగానే ఈ ఫోన్లలోనే ప్రశ్నపత్రాలు çబయటకు వస్తున్నాయి. సమాధానాలు వాట్సాప్‌ల ద్వారా పరీక్ష కేంద్రాల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులకు చేరుతున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు ఈ లీకేజీలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు.

ప్రశ్నపత్రాల లీక్‌ నిజమే: పరీక్షల విభాగం డైరెక్టర్‌
పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్న మాట నిజమేనని, వీటిపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ భార్గవ చెప్పారు. నెల్లూరు నారాయణ హైస్కూల్‌ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై ఇంకా తమకు పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు.

‘నారాయణ’లో లీక్‌లపై ఫిర్యాదులు.. సస్పెన్షన్లు..
నెల్లూరు(టౌన్‌): పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్‌లో ఫిజిక్స్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నారాయణ స్కూల్లో జరుగుతున్న పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. మహేష్‌ ఈదూరు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కడి చీఫ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, డిపార్ట్‌మెంటల్‌ అధికారి ముంతాజ్‌ తెహజాలను పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఫిజిక్స్‌ పేపర్‌ లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం సైబర్‌ క్రైం కింద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రం లీకైన పాఠశాల మంత్రి నారాయణకు చెందినది కావడంతో ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా? లేక తూతూమంత్రంగా ముగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Share this article :

0 comments: