రాజధానిలో పచ్చనేతల చేతివాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధానిలో పచ్చనేతల చేతివాటం

రాజధానిలో పచ్చనేతల చేతివాటం

Written By news on Monday, March 6, 2017 | 3/06/2017

ముఖ్యమైన వాణిజ్య, నివాస ప్లాట్లన్నీ ముందుగానే బ్లాక్‌
 రహదారుల పక్కన, కార్నర్‌లో, పార్కులు, ఖాళీ స్థలాలున్న చోట ప్లాట్లు కొట్టేసిన వైనం
⇒ ఆపై ఆన్‌లైన్‌లో పెట్టి.. ఊరికి దూరంగా సామాన్య రైతులకు కేటాయింపు
⇒ ఇదేంటని ప్రశ్నిస్తే.. అదంతా ఆన్‌లైన్‌ కేటాయింపులంటూ దాటవేత
⇒ రాజధాని రైతులను అడుగడుగునా దగా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు
⇒ ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసిన మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు


సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో అధికార టీడీపీ పెద్దలు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్నారు. ఆ ప్రాంతంలో భూములను కారు చౌకగా కొట్టేసి రైతులను నిలువునా ముంచిన టీడీపీ నేతలు.. ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం రూపంలో అతి విలువైన ప్లాట్లను కొట్టేశారు. ఆన్‌లైన్‌ లాటరీ అంటూ ఎవరికీ అనుమానం రాకుండా, కావాల్సిన చోట.. కోరుకున్న ప్లాట్లను దక్కించుకున్నారు. రాజధాని కోసం భూములు వదులుకున్న సామాన్య రైతులకు మాత్రం ఊరికి దూరంగా.. వాస్తులోపం ఉన్న ప్లాట్లు ఎక్కడ పడితే అక్కడ కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ప్లాట్లు కేటాయించారేంటని రైతులు ప్రశ్నిస్తే... అదంతా తమ చేతుల్లో పనికాదని, ఆన్‌లైన్‌ ద్వారా చేసిందని చిలక పలుకులు పలుకుతున్నారు. రాజధాని పేరుతో అధికార పార్టీ నేతల హైటెక్‌ మోసాన్ని ‘సాక్షి’ పక్కా ఆధారాలతో పట్టుకుంది. అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన ప్లాట్ల కుంభకోణం వివరాలు ఇలా ఉన్నాయి.




ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాలను ఎంపిక చేసింది. ఆ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో కొందరు రైతులను భయపెట్టి, మరి కొందరికి రకరకాల హామీలు ఇచ్చి బలవంతంగా లాక్కుంది. భూములు లాక్కునే సమయంలో రైతులకు కోరుకున్న చోట, కోరిన విధంగా ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇలా సమీకరించిన భూముల్లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు.. రైతులను మోసం చేసి కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన యజమానులకు ప్రభుత్వం పరిహారం కింద ఏటా కౌలు చెల్లించటంతో పాటు భూములు వదులుకున్న ప్రాంతంలోనే నివాస యోగ్యమైన, వాణిజ్య అవసరాల కోసం ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఎకరం జరీబు భూమిని తీసుకుంటే 1450 చదరపు గజాల ప్లాటు కేటాయించారు. ఇందులో 1200 చదరపు గజాల్లో నివాసం, 250 చదరపు గజాల్లో వాణిజ్య ప్లాటు ఉంటుంది. ఎకరం మెట్ట భూమి ఇచ్చిన వారికి 1200 చదరపు గజాలు ఇచ్చారు. ఇందులో 1000 చదరపు గజాల్లో నివాసం, 200 చదరపు గజాల్లో వాణిజ్య ప్లాటు కేటాయించారు. ఈ కేటాయింపు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో చేపట్టారు. చీటీల పద్ధతిన ప్లాట్లు కేటాయించాలని రైతులు డిమాండ్‌ చేసినా, ఆన్‌లైన్‌ ద్వారా అయితే మోసం జరగదని రైతులను నమ్మించారు. ప్లాట్లు కేటాయించక ముందే టీడీపీ పెద్దలు ఆన్‌లైన్‌లో వారు కోరుకున్న చోట, కోరిన ప్లాట్లను బ్లాక్‌ చేయించుకున్నారు. మిగిలిన ప్లాట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టి ప్లాట్లు కేటాయించారు.


 


పెద్దోళ్లకు పెద్ద పీట
రాజధానిలో భూములు వదులుకున్న వారందరికీ సీఆర్‌డీఏ 2016 జూన్‌ 25న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నేటి వరకు 27 గ్రామాల వారికి ప్లాట్లు కేటాయించారు. పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్లాట్ల కేటాయింపుపై ఎక్కడికక్కడ స్థానికులు అభ్యంతరం చెబుతూ వచ్చారు. ఊరికి దూరంగా.. పక్క గ్రామం పొలిమేరల్లో కేటాయించారని కొందరు, కాలువ గట్టుపై, వాస్తు సరిగా లేని ప్లాట్లు కట్టబెట్టారని మరి కొందరు అభ్యంతరాలు తెలియజేశారు. వీటిని సీఆర్‌డీఏ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

వాస్తవంగా ఆయా గ్రామాల్లో విలువైన ప్లాట్లన్నీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, «ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్‌.ఆంజనేయులు, పయ్యావుల కేశవ్‌ తదితరులు తమ బంధువులు, అనుచరుల పేర్లతో కొనుగోలు చేసిన భూములకు పరిహారం కింద  దక్కించుకున్నారు. వీరు దక్కించుకున్న ప్లాట్లన్నీ అత్యంత విలువైనవి కావటం గమనార్హం. ప్రతి ప్లాటుకు ఇరువైపులా రహదారులు ఉన్నవే. కొన్ని ప్లాట్ల ముందు, వెనుక పార్క్‌లు ఉంటే, మరి కొన్ని ప్లాట్ల ముందు, పక్కన ఖాళీ స్థలాలు ఉన్న వాటినే కొట్టేశారు. ఇందులో చాలా వరకు కార్నర్‌ ప్లాట్లు కావడం గమనార్హం.




ఆన్‌లైన్‌లో ఇదెలా సాధ్యం?
ఏపీ సచివాలయానికి అతి సమీపంలోని వెలగపూడిలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పీఏ బంధువుల పేరున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములకు పరిహారం కింద వెలగపూడిలో నాలుగు విలువైన ప్లాట్లు దక్కించుకున్నారు. అందులో లలితకుమారి పేరున 352 కాలనీ, బ్లాక్‌ నంబర్‌ 2556లో 2,280 చదరపు గజాల వాణిజ్య ప్లాటు ఉంది. ఈ ప్లాటుకు తూర్పు వైపున సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఉండటం గమనార్హం. అదే విధంగా మరో నాలుగు ప్లాట్లు ఇదే వెలగపూడిలోనే ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో కీలక పాత్రధారి, సూత్రధారి అయిన రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ.. బంధువులు, సన్నిహితులైన రాపూరు సాంబశివరావు, ఆవులు మునిశంకర్, పోతూరి పరిమళ, వరుణ్‌కుమార్‌ కొత్తప పేర్లతో రాజధాని గ్రామాలైన మందడం, లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.

ఆ భూములకు సంబంధించి కేటాయించుకున్న ప్లాట్లను పరిశీలిస్తే.. ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో ఇది సాధ్యమేనా? అనే అనుమానాలు రాక మానవు. సచివాలయానికి ముందు గ్రామమైన మందడంలో 25 వేల చదరపు గజాల ఒకటే ప్లాటును దక్కించుకున్నారు. తూర్పు, ఉత్తరం, దక్షిణం 100 అడుగుల రహదారి ఉంది. కమర్షియల్‌ జోన్‌కు అతి సమీపంలో... రెండవ యాక్సెస్‌ రహదారికి మధ్యలో కార్నర్‌ ప్లాటు కావడం గమనార్హం. అదే గ్రామంలో 6,750,  2,190 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి. లింగాయపాలెంలో 8,880, 4,000 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లు, రాయపూడిలో 7,625,  3,750 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి.

ఇదే ప్రాంతంలో 3,450 చదరపు గజాల ప్లాటు, 930 చదరపు గజాల ప్లాటు ఉన్నాయి. కొండమరాజు పాలెంలో 2,910,  720 చదరపు గజాల ప్లాట్లు దక్కించుకున్నారు. వీటిలో ఎక్కువ ప్లాట్లకు ఇరువైపులా రహదారులు ఉన్నాయి. మరి కొన్ని మూడు వైపులా రహదారులున్న కార్నర్‌ ప్లాట్లు కావటం గమనార్హం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణారెడ్డి పేరున నేలపాడు గ్రామంలో 2,520 చదరపు గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటు పక్కనే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ప్రభుత్వ షాపింగ్‌ క్లాంప్లెక్స్‌ల జోన్‌ ఉంది.






అగ్ర భాగంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు
రాజధాని పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్‌.ఆంజనేయులు.. భార్య గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య, కొత్తా వెంకట ఆంజనేయులు, కొత్తా శివరామకృష్ణ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వెలగపూడి, మందడం, నేలపాడు, కృష్ణాయిపాలెం, ఐనవోలు, కొండమరాజుపాలెంలో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి కేటాయించిన ప్లాట్లన్నీ కూడా విలువైనవే. అన్ని ప్లాట్లకు ఇరువైపులా 100, 200 అడుగుల రహదారులు, కమర్షియల్‌ జోన్, పార్కులు, ఖాళీ స్థలాలు ఉన్నాయి.

ఒక్క మందడం గ్రామంలోనే ఐదు ప్లాట్లు ఉంటే, మిగిలిన ఐనవోలు, వెలగపూడి, కృష్ణాయిపాలెం, నేలపాడులో ఉన్న మరో 8 ప్లాట్లు కూడా అత్యంత విలువైనవి కావటం గమనార్హం. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ ఇద్దరూ కలసి కొండమరాజుపాలెంలో 12 వేల చదరపు గజాల ఒక ప్లాటు, 3 వేల చదరపు గజాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. 12 వేల చదరపు గజాల ప్లాటుకు నాలుగు వైపులా రహదారులు ఉన్నాయి. ఇది అతిపెద్ద పార్క్, కమర్షియల్‌ జోన్లకు మధ్యలో ఉంది. మరో ప్లాటుకు ఇరువైపుల రహదారులు ఉన్నాయి.

Share this article :

0 comments: