బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాకపోవచ్చు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాకపోవచ్చు

బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాకపోవచ్చు

Written By news on Tuesday, March 7, 2017 | 3/07/2017


బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాకపోవచ్చు
అమరావతి :
అమరావతి : అన్ని రంగాలూ అభివృద్ధి చెందితేనే రాష్ట్రంలో వృద్ధిరేటు బాగుంటుందని.. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగి, రైతులకు మద్దతు ధర లేకపోయినా... పారిశ్రామిక, ఇతర రంగాలు కూడా వృద్ధి చెందకపోయినా వృద్ధిరేటును ఎక్కువ చేసి చూపిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాను చెబుతున్న లెక్కలు బీకాంలో ఫిజిక్స్ చదివినవాళ్లకు అర్థం కాకపోవచ్చని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. జగన్ ప్రసంగానికి యథాతథంగా అధికార పక్ష సభ్యులు పదే పదే ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. ఈ ప్రసంగంలో జగన్ ఏమన్నారంటే..
 
  • కొత్తగా కట్టిన తాత్కాలిక అసెంబ్లీలో అత్యున్నత ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాలని కోరుకుంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నా.
  • గవర్నర్ ప్రసంగాన్ని ఒక్కసారి గమనిస్తే.. రొటీన్‌గా ఉంటోంది తప్ప ఏమార్పూ ఉండటం లేదు. గత మూడేళ్లుగా ఏ గవర్నర్ ప్రసంగం విన్నా కనిపించేది రొటీన్‌గా అంటున్న మాటలేతప్ప.. ఏమీ ఉండవు.
  • గవర్నర్ తాను ప్రసంగం రాసుకొచ్చి, తన మనసులో ఉన్న విషయం చెప్పలేరు. ఆ అవకాశం ఆయనకు లేదు.  ప్రభుత్వం రాసి ఇచ్చినదే చదువుతారు.
  • ప్రభుత్వం ఎన్నో మంచిపనులు చేసిందని, ఎంతో అభివృద్ధి సాధించామని, స్వల్పకాలంలో ఫలానా పనులు చేశామని, దీర్ఘ కాలం.. అంటే 2050 వరకు కూడా పోతారు.
  • ప్రజలు ఇచ్చింది ఐదేళ్లే అయినా, దీర్ఘకాలంలో ఫలానా లక్ష్యాలు పెట్టుకున్నామని పడికట్టు పదాలతో గొప్పలు చెప్పడం ఆనవాయితీగా జరుగుతోంది.
  • రాష్ట్ర ప్రజల కష్టనష్టాలను, తమ గొంతెత్తి మాట్లాడలేని వారి అభిప్రాయాలను వాళ్ల తరఫున చెప్పడానికి ఉన్న ఏకైక ప్రతిపక్షంగా మా బాధ్యత.
  • ప్రభుత్వం తన ఘన కార్యాలను చెప్పుకొంటోంది.. వాటికి సంబంధించి నిజానిజాలను చర్చించడం కూడా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత.
  • ఇలాంటి పరిస్థితుల్లో నా ఈ ప్రసంగాన్ని కాస్త ఓపికగా, మధ్యలో మాటకోసారి అడ్డుకోకుండా వినే శక్తిని భగవంతుడు అధికారపక్షానికి ప్రసాదించాలని కోరుకుంటున్నా.
  • ఈ మొత్తం విషయంలో నిమిషానికోసారి నా మైకు కట్ చేసే సంప్రదాయాన్ని ఈ కొత్త అసెంబ్లీలోనైనా కొనసాగించకుండా పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తారని, విమర్శలు ముఖ్యమన్న విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నా.
  • మన రాష్ట్రం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో విడిపోయిందో అందరికీ తెలుసు. అయినా మన రాష్ట్రం మాత్రం 2015-16లో దేశంలో రెండంకెల వృద్ధి అంటే దాదాపు 11 శాతం వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రమని చెబుతున్నారు.
  • అక్కడే ఆగిపోకుండా, 2016-17కు సంబంధించి మొదటి అర్ధభాగంలో 12.23 శాతం వృద్ధిరేటు సాధించిందంటున్నారు.
  • నిజంగా ఇది చాలా గొప్ప పరిపాలన.
  • హైదరాబాద్ లాంటి మహానగరం దూరమైన తర్వాత మన పరిస్థితి ఏంటో రాష్ట్రంలో పదో తరగతి చదివే ఏ పిల్లాడికైనా అర్థమవుతుంది.
  • ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రభుత్వం మాత్రం.. దేశం కంటే రెట్టింపు వేగంతో అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నట్లు చెప్పింది.
  • 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలున్న భారతదేశం మొత్తం జీడీపీ 2015-16కు 7.57 మాత్రమే.
  • వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం.. ఈ అన్నింటి విలువ కట్టి, అది గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే జీడీపీ వృద్ధి చెందినట్లు లెక్క.
  • 2015-16కు సంబంధించి రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధిరేటు చూపిస్తే, దేశంలో అదే సమయంలో 7.57 శాతం వృద్ధిరేటు చూపించారు.
  • 2016-17కు సంబంధించి దేశంలో 7.20 శాతం వృద్ధిరేటు వస్తే మనం 5 శాతం ఎక్కువ సాధించాం.
  • అక్కడితో ఆగిపోలేదు. చెన్నైతో కూడిన తమిళనాడు వృద్ధిరేటు 2015-16లో 8.79 మాత్రమే, బెంగళూరుతో కూడిన కర్ణాటక వృద్ధిరేటు 2015-16లో 6.2 శాతమే. ముంబైతో కూడిన మహారాష్ట్ర వృద్ధిరేటు 2015-16లో 8 శాతమే. చివరకు గుజరాత్ తీసుకుందాం. ఆ రాష్ట్రం వృద్ధిరేటు కూడా కేవలం 7.7 శాతమే.
  • నిజంగా చంద్రబాబు గారి పాలనలో మన వృద్ధిరేటు 10.99 శాతం ఉంది. వారెవ్వా.. ఇది మాత్రం నిజంగా దేవరహస్యం
  • జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం 30 శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తం జీఎస్‌డీపీ 6.03 లక్షల కోట్లు అయితే అందులో 1.77 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి సంబంధించినవి.
  • అభివృద్ధి 11 శాతం చూపించేటపుడు చాలా గొప్ప మాటలు చెబుతూ ఆక్వా రంగం 2015-16లో 31 శాతం అభివృద్ధి చెందిందని, ఈ ఏడాది 42 శాతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
  • నిజానికి ఆక్వారంగం వాటా కేవలం 30 వేల కోట్లు మాత్రమే. అంటే, జీఎస్‌డీపీలో దాని వాటా 5.4 శాతం అన్నారు. 14వేల కోట్ల ఆక్వా ఎగుమతులు వచ్చాయని చెప్పారు.
  • కానీ అదే సంవత్సరానికి ఎంపెడా లెక్కలు ఒక్కసారి చూద్దాం. 2014-15తో 2015-16ను పోల్చారు. 2014-15లో సగటున కిలో 5.24 డాలర్లు ఉంటే, 2015-16లో 4.9 డాలర్లకు పడిపోయింది
  • ఇక రొయ్యలు 29 శాతం క్వాంటిటీ, 66 శాతం ఆదాయం కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇవి 2014-15లో కిలో 10.38 డాలర్లు ఉంటే, 2015-16లో వీటి విలువ 8.28 డాలర్లకు పడిపోయింది.
  • దేశవ్యాప్తంగా 2014-15, 2015-16లో ఎంపెడా లెక్కలు చూస్తే 2014-15లో 33,441 కోట్లు ఆక్వా ఎగుమతుల వల్ల వచ్చాయి. 2015-16లో 30,421 కోట్లకు పడిపోయిందని చెప్పింది.
  • ఇందులో మన రాష్ట్రానికి సంబంధించినవి 14వేల కోట్లు ఉన్నాయి.
  • క్వాంటిటీ కొద్దోగొప్పో ఎక్కువ ఉండచ్చు గానీ.. అమ్మితే వచ్చే డబ్బులు తక్కువ అవుతాయి.
  • 2014-15కు సంబంధించి ఆక్వారంగం 31 శాతం వృద్ధిరేటు ఉందని చంద్రబాబు చెప్పారు. 2013-14నాటికి.. అంటే చంద్రబాబు సీఎం కాకముందు ఆక్వారంగం 28 శాతం వృద్ధి చెందింది. అంటే, ఆక్వారంగ వృద్ధి అనేది చంద్రబాబు సీఎం అయ్యిన తర్వాత ఉన్నట్టుండి వచ్చింది కాదు, ముందునుంచి ఉంది.
  • 2012-13లో రాష్ట్రంలో 15.88 లక్షల టన్నులు, 2013-14లో 17.69 లక్షల టన్నులు, 2014-15లో 19.79 లక్షల టన్నులు, 2015-16లో సుమారు 20 లక్షల టన్నులు రొయ్యల ఉత్పత్తి ఉంది.
  • రొటీన్‌గా జరుగుతున్న విషయాన్నే భూతద్దంలో చూపించి, దానివల్ల 11 శాతం వృద్ధిరేటు సాధించామని డబ్బాలు కొట్టుకుంటున్నారు.
  • బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కాకపోవచ్చు.
  • చంద్రబాబు గారి గ్రహబలం ఏంటో నాకు తెలియదు గానీ.. భూమ్మీద పండించే రైతులకు మద్దతు ధర దేవుడెరుగు, నీళ్లలో పెరిగే చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి.
  • గుజరాత్‌, మహారాష్ట్రలో కూడా ఆక్వా కల్చర్ ఉన్న వాళ్లు 7, 8 శాతమే వృద్ధిరేటు సాధిస్తే మనకు 11 శాతానికి పైగా వృద్ధిరేటు వస్తుందని చూపిస్తున్నారు.
  • వ్యవసాయానికి వద్దాం.. గత మూడేళ్లుగా కరువే కరువు. ఎంత దారుణమైన కరువంటే, రాష్ట్రంలో సగటు వర్షపాతం 866 మిల్లీమీటర్లయితే 2015లో 814 ఎంఎం, 2016లో 600 ఎంఎం వర్షపాతమే నమోదైంది.
  • ప్రతియేటా రబీలో 24.43 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేస్తాం. ఈసారి 19.56 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. అంటే 5 లక్షల హెక్టార్లలో విత్తనం తక్కువ పడింది.
  • 2016 ఖరీఫ్ చూస్తే.. ఆగస్టులో వర్షాలు లేక ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. అప్పుడే చంద్రబాబు రెయిన్ గన్స్ అన్నారు, నాలుగు రోజుల్లో కరువును పారద్రోలాం అన్నారు.
  • కేవలం పది రోజుల కోసం రెయిన్ గన్స్ కొనుగోలుకు 160 కోట్లు ఖర్చు పెడితే, 103 కోట్లతో వాటిని ఆపరేట్ చేశారు.
  • చివరకు వాటివల్ల ఒక్క ఎకరా కూడా పంట బతకలేదని, పంట ఎండిపోయిందని, 63 మండలాలు పూర్తిగా అనంతపురం అంతా కరువు మండలాలుగా ప్రకటించారు.
  • అంటే రెయిన్ గన్స్ పూర్తిగా ఫెయిలయ్యాయని అర్థమవుతోంది. 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి లేకపోవడమే అందుకు కారణం.
  • మొత్తం 664 మండలాలుంటే, వాటిలో వరుసపెట్టి ప్రతియేటా దాదాపు 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.
  • కరువు మండలాలుగా ప్రకటిస్తే.. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి తమకు సాయం చేస్తారని రైతులు ఆశిస్తారు, రుణాలు రీషెడ్యూలు అవుతాయనుకుంటారు.
  • కానీ ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా రుణాలు రీషెడ్యూలు కాలేదు.
  • ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందని, పంటలు నష్టపోయినందుకు సాయం వస్తుందని అనుకుంటారు.
  • 2013-14లో రూ.2,306 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
  • 2014-15లో రూ.1,500 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లు చెబితే, దాన్ని తగ్గించి రూ.1,067 కోట్లు చేశారు. మళ్లీ కేబినెట్ మీటింగ్ పెట్టి రూ.692 కోట్లకు తగ్గించారు. ఈవాల్టికీ అందులో 20, 30 కోట్లు బకాయిలు ఉన్నాయి.
  • 2015-16లో భారీ వర్షాల వల్ల రూ.270 కోట్లు, కరువు వల్ల రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే, ఈవాల్టికీ ఇంకా ఇవ్వలేదు.
  • 2016-17 ఆర్థిక సంవత్సరంలో కరువు వచ్చింది. 268 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. దానివల్ల రూ.1760 కోట్లు, మళ్లీ వర్షాలకు రూ.51 కోట్లు మొత్తం కలిపి రూ.1811 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి.
  • అందులో ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వకపోగా, కలెక్టర్లు 400 మండలాలను రికమండ్ చేస్తే, 268 మండలాలే ప్రకటించారు. తర్వాత మళ్లీ ప్రజలనుంచి ఒత్తిడి వస్తే మరో 33 మండలాలను కలిపారు.
  • అక్టోబర్‌లో ప్రకటించాల్సిన వాటిని కేంద్రబృందం వెళ్లిపోయాక ఫిబ్రవరిలో ఈ 33 మండలాలు కలిపారు.
  • ప్రభుత్వం మంచి చేయాలంటే వినాలి.
  • చంద్రబాబు పుణ్యాన హేచరీలు ఉన్నచోట్ల ఫార్మా యూనిట్లు పెడుతున్నారు.
  • తుని వద్దకు వెళ్లి చూస్తే, 65 లక్షల లీటర్ల కాలుష్య జలాలు రోజూ సముద్రంలో కలుపుతారు.
  • హేచరీలకు హాని కలుగజేస్తూ సముద్రపు నీళ్లు కలుషితం అవుతున్నాయి
  • పరిశ్రమలకు నేను వ్యతిరేకం కాదు.. వాటిని పెట్టాల్సిన చోట పెట్టాలి. ఫార్మాసిటీలో అయితే ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉంటాయి. కానీ హేచరీల క్లస్టర్ వద్ద పెడితే అవి నాశనం అయిపోతాయి.
  • చంద్రబాబు విధానాల వల్ల చేపలు పట్టే మత్స్య కారులు వేటకు వెళ్లాలంటే లోతుగా సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోంది. తిరిగి ఇంటికి వస్తాడా రాడా అన్న భయం వేస్తోంది.
  • ఇదే వ్యవసాయ రంగంలో చంద్రబాబు సీఎం అవ్వడానికి ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయిస్తామని, పెట్టుబడికి 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతుధర ఇప్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు.
  • కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంలో ఉన్న వీళ్లు కనీస మద్దతుధర విషయం చూడాలి.
  • చంద్రబాబు సీఎం అయినప్పుడు వరి రూ.1360 ఉంటే, 2015-16కు కేవలం 50 రూపాయలు పెంచారు, 2016-17కు రూ.1,470 మాత్రమే పెరిగింది. కేవలం 4 శాతం కంటే తక్కువ పెరిగింది.
  • పత్తి 2014-15లో రూ.3,750 ఉంటే 2015-16లో రూ.3,850, 2016-17లో రూ.3,860 మాత్రమే అయ్యింది. అంటే ఒకటి నుంచి ఒకటిన్నర శాతమే పెరిగింది.
  • ద్రవ్యోల్బణం 5 శాతం పైనే ఉంది. అంటే రైతులకు కనీస మద్దతుధర దానికి సరిపోయేలా కూడా లేకపోతే రైతుల వాస్తవాదాయం పెరిగిందా.. తగ్గిందా?
  • ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర రూ.530 నుంచి రూ.1050కి పెరిగింది
  • ముఖ్యమంత్రి కేంద్రం మీద తెచ్చే ఒత్తిడి ఆధారంగానే కనీస మద్దతుధరలు పెరుగుతాయి.
  • రుణమాఫీ వాగ్దానంచూస్తే.. రైతులు కోల్పోయిందే ఎక్కువని తెలుస్తుంది.
  • 2014-15కు సంబంధించి రైతులకు రూ.56వేల కోట్లు ఇవ్వాలంటే రూ.39వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.
  • ఈ ఏడాది 2016-17కు రైతులకు 83వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే రూ.55,914 కోట్లు మాత్రమే ఇచ్చారు
  • చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు రుణాలు ఇవ్వకపోవడం ఒకటైతే.. రుణభారం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. 87 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పైగా పెరిగింది.
  • మూడేళ్లలో రైతులు 47వేల కోట్ల అపరాధ రుసుము కడితే, ఆయన ఇచ్చింది 10వేల కోట్లు మాత్రమే.
  • రైతులకు 1.10 కోట్ల ఖాతాలుంటే, వాటిలో ఓవర్‌డ్యూ 31 లక్షలు, ఎన్‌పీఏ ఖాతాలు 8 లక్షలు ఉన్నాయి.
  • రైతులకు మొత్తం పంట రుణాలు 69వేల కోట్లయితే, వాటిలో ఓవర్‌డ్యూ, ఎన్‌పీఏ కలిపి 25వేల కోట్లు.. అంటే 35 శాతం ఉంది. టర్మ్ లోన్లది కూడా అదే పరిస్థితి.
  • ఒకవైపు పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు ప్రాజెక్టుల మీద పెట్టే డబ్బులు ఏ ప్రాజెక్టులు మంచివోనన్న ఆలోచన కూడా లేకుండా కమీషన్ల కోసమే పెడుతున్నారు.
  • ఎలాంటి స్టోరేజి కెపాసిటీ లేని పట్టిసీమ కడతారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేశారంటే మంత్రి 54 టీఎంసీలు అంటారు. ఎస్ఈని అడిగితే 48 టీఎంసీలంటారు. కరెంటు బిల్లులు చూశాం. 
  • రూ. 135.46 కోట్ల బిల్లులు వచ్చాయి. 110 రోజులు పనిచేశాయి. వాటి ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు.
  • కానీ 55 టీఎంసీల నీళ్లు ప్రకాశం బ్యారేజి వద్ద సముద్రంలో కలుపుతారు.
  • కొత్త అసెంబ్లీలోనైనా సంప్రదాయం మారుతుందని ఆశించాను గానీ.. ఖర్మకొద్దీ మారలేదు
  • ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు పోయేది అప్పుడే, పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసేదీ అప్పుడే.
  • కరెంటు బిల్లుల మీద పెట్టిన డబ్బులు కట్టి.. తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజికి ఇస్తే, వాళ్లు ఆ ఊళ్లను ఖాళీ చేయించి ఇచ్చేవారు. అప్పుడు పులిచింతలలో 45 టీఎంసీల  నీళ్లు నిల్వచేసుకునే పరిస్థితి వచ్చేది.
  • వాళ్లకు ఆ డబ్బులు ఇవ్వని కారణంగా పులిచింతలలో ఇప్పుడు గరిష్ఠంగా 28 టీఎంసీలు మాత్రమే నిల్వచేయగలిగారు. దాని సామర్థ్యం 45 టీఎంసీలు.
  • గన్నవరంలోను, ఆయన నియోజకవర్గంలోను పంటలు కాపాడలేని పరిస్థితిలో నీటిపారుదల మంత్రి ఉన్నారు.
  • హంద్రీనీవాకు సంబంధించి పోయి ధర్నాలు చేయాల్సి వచ్చింది.
  • 80 శాతం పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అయిపోయాయి. కేవలం 20 శాతం మిగిలి ఉన్నాయి
  • వాటిని పూర్తి చేయడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు పూర్తిచేయాలని ధర్నాలు చేశాం.
  • అవి రాకపోవడం వల్ల అనంతపురం జిల్లాలో మొత్తం 63 జిల్లాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నిజంగా నీళ్లిచ్చి ఉంటే ఆ పరిస్థితి ఎందుకు ఉంటుంది.
  • గాలేరు నగరికి సంబంధించి.. గండికోట కెపాసిటీ 26 టీఎంసీలు. చంద్రబాబు సీఎం కాకముందు కలెక్టర్ శశిధర్ 3 టీఎంసీల నీళ్లు నింపి ఫొటో దిగారు, వీళ్లూ అదే పని చేశారు. దాని విషయాన్ని కూడా ఆలోచించరు.
  • పరిశ్రమల రంగానికి వస్తే రెండేళ్లలోనే 15 లక్షల కోట్ల ఎంఓయూల మీద సంతకాలు చేశారు
  • 4.67 లక్షల కోట్ల ఒప్పందాల మీద సంతకాలు చేశారు. లక్ష కోట్ల పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయని కూడా చెప్పారు
  • సోషియో ఎకనమిక్ సర్వే చూద్దాం.. 2014-15లో పెద్ద పరిశ్రమలు రూ.1,875 కోట్లు, చిన్న పరిశ్రమలు రూ.2,263 కోట్లు కలిపి మొత్తం రూ.4,138 కోట్లు పెట్టుబడులే వచ్చాయి.
  • 2015-16లో పెద్ద పరిశ్రమలు రూ.3,963 కోట్లు, చిన్నవి రూ.1,562 కోట్లు, మొత్తం రూ.5,561 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినట్లు అర్థమవుతోంది.
  • పరిశ్రమలు వచ్చాయో లేదో తెలుసుకోడానికి రెండో పారామీటర్.. పరిశ్రమలకు అనుమతులు.
  • ఐఈఎం ఫైల్ చేస్తేనే అన్నిరకాల అనుమతులు వస్తాయి, అలాగని మొత్తం ఐఈఎంలన్నీ అమలవుతాయని లేదు
  • వాటిలో 10-20 శాతం పరిశ్రమలు మాత్రమే వస్తాయి.
  • 2014లో రూ.21,510 కోట్లు ఫైల్ చేస్తే, వాటిలో రూ.2,800 కోట్లు మాత్రమే అమలయ్యాయి.
  • 2016లో రూ.34,464 కోట్లు ఫైల్ చేస్తే, వాటిలో రూ.11,395 కోట్లు మాత్రమే అమలయ్యాయి.
  • ఈ రకంగా చూస్తే ఏరకంగా ఇప్పటికే లక్ష కోట్ల పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెబుతారో అర్థం కావట్లేదు.
  • 2015లో దేశం మొత్తమ్మీద ఏపీతో కలిపి వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆటోమొబైల్, రవాణా, ఐటీ, చేనేత.. ఇలా అన్ని రంగాల్లో కలిపి కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని కేంద్ర కార్మికశాఖ తెలిపింది.
  • గత ఏడేళ్లలో ఇంత తక్కువ ఉద్యోగాలు వచ్చింది కూడా 2015లోనే.
  • సేవల రంగం 46శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోంది.
  • మిగిలిన వారికంటే మన రాష్ట్రం తక్కువుంది ఒక్క ఐటీ రంగంలోనే.. హైదరాబాద్‌లోనే ఐటీ రంగం 96శాతం ఉంది. అందుకే ఈ రంగంలో ఇబ్బందికర పరిస్థితి ఉంది.
  • గత మూడేళ్ల కాలంలో ఐటీ రంగానికి సంబంధించి చంద్రబాబునాయుడు గొప్పలు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌ వస్తుందని చెప్పారు. కానీ, ఆయన అలా చెప్పిన కొన్ని గంటల్లోనే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ తాము రావడం లేదని, కంపెనీ పెట్టడం లేదని ప్రకటించారు.
  • ట్రంప్‌ పేరు చెబితే భారతీయులు భయపడినట్లు చంద్రబాబు పేరు చెబితే భారతీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా భయపడుతున్నాయి. ఎన్‌సీఏఈఆర్‌ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్‌ 1 ర్యాంకు ఇచ్చినందువల్లే ఆ సంస్థలు వణికిపోతున్నాయి.
  • అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంకెలు మారుస్తుంది? ఎందుకు లెక్కలు తప్పుగా చూపిస్తుంది? భారీగా జీడీపీ పెరిగినట్లు, పరిశ్రమలు పెరిగినట్లు చూపించాల్సిన అవసరం ఏమిటి?ఇలా చెబితే కేంద్రం ఎలా సహాయం చేస్తుంది? పన్నుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని కేంద్రం భావిస్తే ఎందుకు నిధులు ఇస్తుంది? రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబితే కేంద్రానికి ఎలాంటి సంకేతాలు వెళతాయి? ఇది కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినట్లు కాదా?.... అని ప్రశ్నిస్తూ వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగానే అర్థాంతరంగా మైకును కట్‌ చేసిన స్పీకర్‌ సభను ఈ నెల(మార్చి) 13వరకు వాయిదా వేశారు.
 
Share this article :

0 comments: