అధికారులను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతను దూషిస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారులను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతను దూషిస్తారా?

అధికారులను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతను దూషిస్తారా?

Written By news on Wednesday, March 1, 2017 | 3/01/2017


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఎంత అథమస్థాయికి దిగజారిందో ఘోరమైన బస్సు ప్రమాదం అనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ వెడుతున్న ప్రైవేటుబస్సు రాజధాని సమీపంలో పెనుగంచిప్రోలు దగ్గర మంగళవారం తెల్లవారుజామున అదుపుతప్పి కాలువలో పడి పది మంది ప్రయాణికులు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వం ఏమి చేయాలి? రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి హుటాహుటిన ప్రమాదస్థలానికి వెళ్ళాలి. అధికారులను పరుగులు తీయించాలి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలి. మంత్రులు ఘటనా స్థలంలో ఉండి ప్రభుత్వ యంత్రాంగం పనితీరును పర్యవేక్షించాలి. హోంమంత్రి చిన్నరాజప్ప టెలిఫోన్‌లో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మినహా ఏమీ జరగలేదు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ నింపాదిగా వెళ్ళారు. ఇంతమంది చనిపోతే హృదయం ఉన్న పాలకులు ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండరు. తన చెప్పుచేతలలో హెలికాప్టర్‌నూ, ప్రత్యేక విమానాన్నీ పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నందిగామ ఆసుపత్రికి వెళ్ళి గాయపడినవారినీ, ప్రమాదంలో మరణించినవారి బంధువులనూ పలకరించాలని అనుకోలేదు. నందిగామలో హెలికాప్టర్‌ దిగడానికి అనువైన హెలిప్యాడ్‌ కూడా ఉంది. అయినా, మనసు ఉండాలిగా? 

 
ప్రమాదం జరిగిన సంగతి తెలియగానే ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కారులో హైదరాబాద్‌ నుంచి పెనుగంచిప్రోలుకు బయలుదేరారు. ప్రమాదంలో మృతి చెందినవారి బంధువులనూ, గాయపడినవారినీ పరామర్శించారు. గాయపడినవారిని పరామర్శించేందుకు నందిగామ ఆసుపత్రికి వెళ్ళారు. బాధితుల తరఫున అధికారులను కొన్ని ప్రశ్నలు సూటిగా అడిగారు. చనిపోయినవారికి పోస్ట్‌మార్టం చేయలేదని తెలుసుకొని కలెక్టర్‌పైనా, ఇతర అధికారులపైనా ధర్మాగ్రహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులూ పట్టించుకోకపోయినా విషయం తెలిసిన వెంటనే ప్రమాదస్థలికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకులిచ్చిన సూచనలను సహృదయంతో స్వీకరించకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్ష నాయకుడిని తప్పుపట్టేందుకు ఉన్నవీ లేనివీ కలిపి ప్రచారం ప్రారంభించారు. వారికి అనుకూలమైన మీడియా వత్తాసు పలుకుతోంది. 
 
జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను అడిగిన ప్రశ్నలు నిజానికి మీడియా ప్రతినిధులు అడగవలసినవి. బస్సు ఎంతవేగంతో ప్రయాణం చేస్తోంది? ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ తాగి ఉన్నాడా? బస్సు డ్రైవర్‌ భౌతిక కాయానికి శవపరీక్ష నిర్వహించారా, లేదా? ప్రమాదం జరిగినప్పుడు బస్సు డిక్కీలో పడుకొని ఉన్న రెండో డ్రైవర్‌ ఏమైనాడు? బస్సు యజమాని ఎవరు? ఆయనను రక్షించేందుకు అధికారులు తాపత్రయ పడుతున్నారా? ఈ ప్రశ్నలు మీడియా ప్రతినిధులు అడగలేదు. ప్రభుత్వాధికారులు తెలుసుకోలేదు. అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదు. అడిగిన ప్రతిపక్ష నాయుకుడిని తప్పు పడుతున్నారు. అధికారులను అవమానించారంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇదే వ్యక్తులు చింతమనేని ప్రభాకర్‌ అనే శాసనసభ్యుడు వనజాక్షి అనే తహసీల్దార్‌ను జుట్టుపట్టుకొని ఈడ్చివేసినా అభ్యంతరం చెప్పలేదు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎల్‌ఏ ప్రభాకర్‌ను వెనకేసుకొని వచ్చి అధికారి వనజాక్షినే తగ్గమని చెప్పారు. కోట్లకు ఓటు కేసులో తనకు సమాచారం అందించలేదనే కోపంతో ఉన్నతాధికారి అనూరాధని క్షణాల మీద బదిలీ చేసిన ముఖ్యమంత్రిగా ఉన్నతాధికారులపై గౌరవం ఉన్నదంటే ఎవరు నమ్ముతారు?  వీడియో కాన్పరెన్స్‌ల పేరుతో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను వారం వారం గంటల తరబడి బందీలుగా వేధిస్తున్న ముఖ్యమంత్రి.. తనకు అధికారుల పట్ల ఆదరణ ఉన్నట్టు మాట్లాడటం విచిత్రం. 

 
తన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్న ప్రభుత్వ వైద్యుడినీ, అతణ్ణి కోపంగా చూస్తూ మాట్లాడవద్దనీ పత్రాలు ఇవ్వవద్దనీ నివారిస్తున్న జిల్లా కలెక్టర్‌నీ, ఇతర ఉన్నతాధికారులను మందలిస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్ళవలసి వస్తుందని ఒక చట్టసభలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడం వెనుక మతలబు ఏమిటి? సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవలసిన అంశాలనే జగన్‌ మోహన్‌రెడ్డి అడిగారు. డ్రైవర్‌ తాగి ఉన్నాడో, లేదో తెలుసుకోవాలంటే శవపరీక్ష చేయడం వినా మరో మార్గం లేదు. ఆ పని ఎందుకు చేయలేదని బాధ్యతాయుతంగా అడిగిన ప్రతిపక్ష నాయకుడిని దోషిగా చూపించే పనికి తెగబడిన తెలుగుదేశం నాయకులు బాధ్యతారహితంగా బరితెగించి మాట్లాడటం శోచనీయం. 
 
జగన్‌ మోహన్‌ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సంపాదించి వార్తాకథనాలు రాయాలని జర్నలిస్టులను పురమాయించవలసిన మీడియా సంస్థలు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రతిపక్ష నాయకుడిని దోషిగా చూపించే ప్రయత్నం చేయడం అనైతికం. బస్సు యజమాని తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు దివాకరరెడ్డి. ఆయన సంస్థ ‘దివాకర్‌ ట్రావెల్స్‌’కు ఇబ్బంది కలగకుండా డ్రైవర్‌ శవాన్ని పరీక్ష చేయకుండానే మూటకట్టి ఇతర శవాలతో పాటు పంపించివేయడానికి నందిగామ ఆసుపత్రి సన్నాహాలు చేయడం, ఇదంతా కలెక్టర్‌ అజమాయిషీలో జరగడం చూసినవారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంతర్యం ఇట్టే అర్థం అవుతుంది. ప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తున్నదో, ఇంత పెద్ద ప్రమాదాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో తేలికగానే అర్థం అవుతుంది. 
 
ప్రతిపక్ష నాయకుడిపై ముప్పేట దాడి చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులూ, ఎంఎల్‌ఏలూ, ఎంఎల్‌సీలూ యథావిధిగా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అసలు విషయం మినహాయించి  తిట్లపురాణం యావత్తూ షరా మామూలుగా వినిపించారు. డ్రైవర్‌ తాగి ఉన్నాడో లేదో మాత్రం చెప్పలేదు. ఎందుకు శవపరీక్ష జరగకుండా శవాన్ని పంపించివేస్తున్నారో తెలియజేయలేదు. ఈ వాస్తవాలను దాచివేస్తూ, తమ పార్టీకి చెందిన ఎంపీకి అండగా నిలుస్తూ ప్రతిపక్ష నాయకుడిని కుమ్మడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు సంవత్సరాలుగా చేస్తున్న నిరాధారమైన ఆరోపణలనే, రుజువు కానీ అభియోగాలనే చేస్తూ తన స్థాయిని మరోమారు నిరూపించుకున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసలు విషయం ప్రస్తావించకుండా, ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా జగన్‌ మోహన్‌ రెడ్డిని నోటికొచ్చినట్టు  తిట్టడం, అంతటితో ఆగకుండా ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురించి కూడా నీచంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. 
 
 
ప్రమాదంలో మరణించినవారి బంధువులూ, గాయపడినవారూ, వారి కుటుంబసభ్యులూ, సాధారణ ప్రజలూ ప్రభుత్వం నుంచి తెలుసుకోవాలని కోరుకునే అంశాలు మాత్రం ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, వారి అనుయాయులు కానీ చెప్పడం లేదు. డ్రైవర్‌ శవానికి పరీక్ష ఎందుకు జరిపించలేదు? బస్సును 130, 140 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న డ్రైవర్‌ ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలసిన అవసరం, ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? బస్సుకు వేగాన్ని అదుపుచేసే వ్యవస్థ ఉన్నదా, లేదా? పదిమంది మరణించిన స్థలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ ప్రమాదస్థలానికి ఎందుకు వెళ్ళలేదు? సహాయ కార్యక్రమాలను ఎందుకు పర్యవేక్షించలేదు? పదిమంది ప్రయాణికులు మరణించినా పట్టించుకోకుండా పార్టీ నాయకుడిని రక్షించేందుకే పెద్దపీట వేస్తారా?
 
ఆంధ్రప్రదేశ్‌లో మీడియా విధియుక్త ధర్మాన్ని విస్మరించింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకే శేషాచలం అడవులలో ఇరవై మందికి పైగా ఎర్రచందనం కూలీలను పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చి చంపిన ఘటనపైన దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో మీడియా పట్టించుకోలేదు. గోదావరి పుష్కరాల ప్రారంభ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా మరణించిన ఘటనపైన దర్యాప్తు పురోగతిపై మీడియా సమీక్ష లేదు. నిరర్ధకమైన పట్టిసీమ ప్రాజెక్టుపైన వందలకోట్లు ఎందుకు దుబారా చేయవలసి వచ్చిందో అడగలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన అనేక వాగ్దానాల అమలు చేయకపోవడంపైనా మీడియా ప్రశ్నించడం లేదు. మీడియా వేయవలసిన ప్రశ్నలను ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అడిగినందుకు ఆయనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు చేయడం, అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి ప్రయాసపడటం, పాలకపక్ష ప్రముఖులు చెబుతున్న తిట్లపురాణాన్ని అదేపనిగా ప్రసారం చేయడం, ప్రచురించడం విస్తుగొలుపుతోంది. అప్రజాస్వామ్యంగా, అడ్డంగా వ్యవహరించడానికి అలవాటు పడిన ప్రభుత్వం, పాలకపక్షం దివాకర్‌ ట్రావెల్స్‌కు దన్నుగా నిలబడటంలో ఆశ్చర్యం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయవలసిన మీడియా సంస్థలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేయడం దౌర్భాగ్యం. 

http://www.sakshi.com/news/andhra-pradesh/media-reacts-adversely-over-ys-jagan-mohan-reddy-issue-in-bus-accident-case-454333?pfrom=home-top-story
Share this article :

0 comments: