జైల్లో వేస్తాం.. మొద్దుశీనులా జరగొచ్చు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జైల్లో వేస్తాం.. మొద్దుశీనులా జరగొచ్చు!

జైల్లో వేస్తాం.. మొద్దుశీనులా జరగొచ్చు!

Written By news on Sunday, April 23, 2017 | 4/23/2017


జైల్లో వేస్తాం.. మొద్దుశీనులా జరగొచ్చు!
► రవికిరణ్‌కు పోలీసుల బెదిరింపులు
► విచారణ పేరిట వేధింపులు


సాక్షి, అమరావతి బ్యూరో: ‘మేము తలచుకుంటే ఏదైనా చేస్తాం.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాం.. జైల్లో వేస్తాం.. ఎక్కువ రోజులు జైల్లో ఉండేలా చూస్తాం.. అక్కడ నీ పక్కన ఉండే ఖైదీ ఏమైనా చేయొచ్చు.. మొద్దుశీనులా ఏదైనా జరగొచ్చు.. అప్పుడు మాకేమీ సంబంధం ఉండదు..’ అని గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ‘పొలిటికల్‌ పంచ్‌’ ఫేస్‌బుక్‌ పేజీ అడ్మిన్‌ రవికిరణ్‌ను బెదిరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వివిధ రకాలుగా వేధించి.. బెదిరించి.. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్నానని ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేసిన తీరును రవికిరణ్‌ శనివారం ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మందడం స్టేషన్‌లో ఉంచారు..
‘‘శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు మా ఇంటికి వచ్చారు. నీ మీద ఒక కేసు ఉంది. గుంటూరు రావాలని నన్ను తీసుకెళ్లారు. కేసు ఏమిటని పోలీసులను అడిగినా సమాధానం చెప్పలేదు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మందడం పోలీసు స్టేషన్‌లో ఉంచారు. అక్కడ నా పేరు, ఇతర వివరాలు అడిగారు. అప్పుడు మరోసారి ‘నాపై కేసు ఏంటి సార్‌’ అని అడిగితే.. శాసనసభను కించపరుస్తూ పోస్టు పెట్టావు. దానిపై మాకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. పోస్టింగుపై పోలీసులకు వివరణ ఇచ్చాను. శాసనసభ, మండలిని అవమానించడం నా ఉద్దేశం కాదని వివరించాను. పెద్దల సభ అంటే.. పెద్దల సినిమాగా భావించడం వల్లే లోకేష్‌ అందులో కూర్చుంటానని అడుగుతున్నాడన్న భావనతోనే పోస్టింగ్‌ పెట్టానని వివరణ ఇచ్చాను. లోకేష్‌ మీద అది సెటైర్‌ మాత్రమే గాని, చట్టసభను అవమానపరచడం కాదని చెప్పాను. ఈ పోస్టింగ్‌ తగదని కామెంట్లు వచ్చాయని, వెంటనే ఆ పోస్టింగ్‌ తొలగించానని చెప్పా. ఇది జరిగి కూడా 2 నెలలు అయిందన్నాను. ఆ తర్వాత ఎవరో వస్తున్నారని పేర్కొంటూ నన్ను భవనంలోని రెండవ అంతస్తుకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు.

వాహనాలు మార్చుతూ 4 గంటలు తిప్పారు...
మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్‌ వెనుకవైపు నుంచి నన్ను తీసుకెళ్లి ఆటోలో కూర్చొబెట్టి అరకిలోమీటర్‌ దూరం తీసుకెళ్లాక.. అక్కడ మారుతీ స్విఫ్ట్‌ కారులోకి మార్చారు. అక్కడి నుంచి ఓ 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాక.. బ్లాక్‌ స్కార్పియో వాహనంలోకి నన్ను మార్చి.. సీఎం నివాస ప్రాంతం కరకట్ట చుట్టూ సుమారు 4 గంటలపాటు తిప్పారు. తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ వెళ్తున్నామని చెప్పారు. కొంత దూరం వెళ్లాక.. ఓ ఆయిల్‌ కంపెనీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. మళ్లీ నా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ డబ్బులిస్తే నీవు పొలిటికల్‌ పంచ్‌ ను నిర్వహిస్తున్నావు కదా? జగన్‌ కోసం పనిచేస్తున్నావు కదా? అంటూ నన్ను పలు విధాలుగా ప్రశ్నించారు. నేను సొంతంగా రెండున్నరేళ్లుగా పొలిటికల్‌ పంచ్‌ ఫేస్‌బుక్‌ పేజీ నిర్వహిస్తున్నాను. నేను వృత్తిపరంగా వెబ్‌ డిజైనర్‌ని. కాబట్టి డిజైన్స్‌ అవసరమైతే.. డబ్బులు తీసుకొని చేసి ఇస్తా. వైఎస్సార్‌సీపీకి కూడా వెబ్‌ డిజైనింగ్‌ చేసి ఇచ్చాను. టీడీపీ డబ్బులిస్తే.. వారికి కూడా డిజైనింగ్‌ చేసిపెడతాను. పొలిటికల్‌ పంచ్‌ ను మాత్రం ‘ఫ్రీలాన్సర్‌’గా నిర్వహిస్తున్నానని చెప్పాను.

బెదిరించారు.. జైలులో పెడతామన్నారు..
ఎన్ని రకాలు ప్రశ్నించినా నేను ఒకటే సమాధానం చెప్పడంతో పోలీసులు బెదిరింపులకు దిగారు. లోకేష్‌ మీదే ఎందుకు పోస్టింగులు పెడుతున్నావన్నారు. లోకేష్‌పై ఇకపై పోస్టింగులు పెట్టొద్దన్నారు. సార్‌ లోకేష్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్నారు కాబట్టి అతనిపై పోస్టింగులు పెడుతున్నాను. ఆయన అన్న మాటలపైనే పెట్టాను. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ట్రెండ్‌ అయినప్పుడు అతనిపైనా పోస్టింగులు పెట్టాను. ఇప్పటి వరకు పొలిటికల్‌ పంచ్‌లో 2,500 వరకు పోస్టింగులు పెట్టాను. అందులో లోకేష్‌పై ఒక 50 వరకు ఉండొచ్చు అన్నాను. అయినా పోలీసులు నామాటలను విశ్వసించలేదు. నిజం చెప్పకుంటే నీకే ఇబ్బందులన్నారు. నీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామని, జైల్లో పెట్టిస్తామని చెప్పారు. అక్కడ మొద్దుశీనులా ఏదైనా జరగొచ్చని బెదిరించారు. చివరకు నిన్ను అరెస్టు చేయడం లేదని, నోటీసులు ఇస్తామని చెప్పారు. టైప్‌ చేసిన కాగితాలపై మూడు చోట్ల సంతకాలు పెట్టించుకున్నారు. 25వ తేదీన పోలీసుస్టేషన్‌కు వచ్చి నోటీసుపై సమాధానం చెప్పాలన్నారు. నేను సరే అన్నాను. అనంతరం పోలీసులు నన్ను శనివారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌లో దించేసి వెళ్లిపోయారు’’ అని రవికిరణ్‌ వివరించారు.
Share this article :

0 comments: