నోట్లో ఇసుక కొట్టారు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నోట్లో ఇసుక కొట్టారు!

నోట్లో ఇసుక కొట్టారు!

Written By news on Saturday, April 29, 2017 | 4/29/2017


నోట్లో ఇసుక కొట్టారు!ఏర్పేడు ఘటనలో మృతి చెందిన తండ్రి, కొడుకు మునికృష్ణయ్య, కోదండపాణి మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
నోట్లో ఇసుక కొట్టారు! నోట్ల కోసం కొట్టారు... కోట్ల కోసం కొట్టారు. కాటికెక్కించారు... కాల్చిపారేశారు.అంతకుముందు.. విషం కక్కారు... లారీలతో తొక్కారు. ఇసుక మాఫియా జేబులో ఉండే డబ్బుకు అన్నీ రక్తపు మరకలే. మనుషులు మాంసం ముద్దలైనా పర్వాలేదు. దానికో లెక్కుండాలి! అది జేబులో పడాలి! ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబానికి 5 లక్షలు పారేస్తామన్నారు. ప్రాణాన్ని ఇసుకలో పూడ్చేశారు. తాళిని ఇసుకతో తెంపేశారు. ఇసుకను పిండి నూనెనైనా తియ్యొచ్చేమో కానీ ఈ దుర్మార్గుల గుండెల్లో మానవత్వం అనే
ఒక్క చుక్కను కూడా పిండలేం. కడుపుకు తింటున్నది అన్నమా? నోట్ల కట్టలా? కానీ మన నోట్లో కొడుతున్నది మాత్రం ఇసుకే. మగానుభావులు... లీడర్లు, ప్రభుత్వాలు.. వీళ్లలో... ఇసుమంత దయ ఉండదా? ఇసుక రేణువంత కరుణ ఉండదా?


శ్రీకాళహస్తి, తిరుపతి రోడ్డుమార్గంలోని ఏర్పేడు నడిబొడ్డున ఈ నెల 21న జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు! వాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనేకన్నా ఇసుక మాఫియా వాళ్లను పొట్టన పెట్టుకుంది అనడం సబబు. స్వర్ణముఖి నది పక్కనే మునగలపాళెం .. ఆ ఊరి ప్రజలు కలిమిలేములను కలిసి పంచుకుంటూ.. ఉన్న దాంతో తృప్తిపడుతూ సంతోషంగానే ఉంటున్నారు. కాని రెండేళ్లుగా మనసుల్లో కలతను నింపి మొహాల మీద చిరునవ్వు లేకుండా చేసింది ఇసుక మాఫియా. కంటి మీద కునుకును దూరం చేసింది.

నేపథ్యం
 స్వర్ణముఖిలోని ఇసుకను తోడేస్తూ ఆ నదీమతల్లికి గుండెకోత పెడుతుంటే చూడలేక ఊరు ఊరంతా కలిసి న్యాయపోరాటానికి దిగింది. అయితే అధికార యంత్రాంగం ఇసుకను తోడుతున్న వారికే అండగా నిలిచింది. అయినా అధైర్యపడలేదు వాళ్లు. అలుపెరగక పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే.. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నినదించేందుకు ఇంటికొక్కరు చొప్పున ఊళ్లోవాళ్లంతా కలిసి మొన్న మండల కేంద్రమైన ఏర్పేడుకు వెళ్లారు. తిరిగి వస్తుంటేనే ప్రమాదం జరిగి న్యాయపోరాటానికి దిగిన వాళ్లలో పదిహేను మంది మరణించారు. అందులో కుటుంబ పెద్దలున్నారు. వాళ్లు లేని లోటుతో ఆ ఇల్లు రోడ్డున పడే పరిస్థితి ఉన్న వ్యక్తులు. కొడుకులున్నారు.. తల్లిదండ్రులకు చెట్టంత నీడనిచ్చేవాళ్లు. ఆడవాళ్లున్నారు.. దీపం పెట్టి ఇంట్లో వెలుగు నింపే వాళ్లు.. భర్తల బరువు, బాధ్యతలను సగం మోస్తున్న సహధర్మచారిణులు. ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదం. తీరని వ్యథ. కన్నీళ్లు పెట్టించే కథ. వీళ్ల మరణాలతో ఆ ఊరు దిగ్భ్రాంతికి గురైంది.  కన్న బిడ్డలను పోగొట్టుకుని గుండెపగిలేలా ఏడుస్తోంది. ఆ ఊరి కష్టం ఎవరు తీరుస్తారు? ఆ బిడ్డలకు తల్లుల్ని, తండ్రులను ఎవరు తెచ్చిస్తారు? పోయిన బిడ్డలకు ఊపిరిలూది ఆ తల్లిదండ్రుల పేగుబంధాన్ని ఎవరు నిలుపుతారు?

న్యాయం మీరే చెప్పండి
‘ఇసుక దందా మీద మేం చెప్పినప్పుడే మీరు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు కదయ్యా.. ఇంత మంది ఉసురు పోయేది కాదు. ఒక్కసారి ఎనిమిది మంది ఆడవాళ్ల తాళ్లు తెగిపడ్డాయి. నష్టపరిహారంగా ఒక్కో కుటుంబానికి అయిదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. మేమే మీకు పది లక్షల రూపాయలు ఇస్తాం. చచ్చిపోయిన మా వాళ్లను తిరిగి తెచ్చివ్వగలరా అయ్యా..? మీరు ఎన్ని లక్షలస్తే పోయిన ప్రాణాలు వస్తాయి? లేని మనుషుల లోటు తెలుస్తుంది? చెప్పండి? జరుగుతున్న అన్యాయం మీ దృష్టిలో పడాలంటే ఇంతమంది ప్రాణాలు బలిపెట్టాలా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడాలా? మీరే ఆలోచించండి. న్యాయం మీరే చెప్పండి’ అంటూ అధికార నేతను నిలదీశారు.
ఆవిడ వేసిన ఒక్కో ప్రశ్న మానవత్వమున్న వాళ్లను తలదించుకునేలా చేసింది. ఆవిడ ఆవేదన కంటతడి పెట్టించింది. అందుకే మౌనమే సమాధానంగా వెనుదిరిగారు. బహుశా.... ప్రభుత్వం తెలుసుకుందో..  పశ్చాత్తాపం కలిగిందో.. లేక వేరే దారి తోచిందో! వీటికి జవాబు ప్రభుత్వం ఇసుక మాఫియా మీద తీసుకోబోయే చర్య ద్వారానే తెలుస్తుంది. పోయిన ప్రాణాలు పోయాయి.. కనీసం ఉన్న వాళ్లకైనా మంచి జరగాలి. ఊరుతల్లి హాయిగా ఊపిరి పీల్చుకోవాలి.

చివరి చూపు కూడా అందలేదు
ఏర్పేడు రోడ్డు ప్రమాద మృతుల్లో జయచంద్ర కూడా ఒకరు. కడు పేదరికంలో మగ్గుతోంది ఆయన కుటుంబం. భర్త సంపాదన సరిపోకపోవడంతో పిల్లల (మోక్షిత్, యజ్ఞ) పోషణ భారమై రెండు నెలల కిందట జయచంద్ర భార్య రేణుక సౌదీకి వెళ్లింది.  ఇక్కడ ఊరి బాగు కోసం ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తాడు జయచంద్ర. అందులో భాగంగానే ఊళ్లో వాళ్లతో కలిసి ఏర్పేడు ప్రయాణమయ్యాడు. అదే ఆయనకు చివరి ప్రయాణమైంది. తండ్రిని కోల్పోయి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారులను అక్కున చేర్చుకొని సముదాయించాల్సిన తల్లి ఎక్కడో సౌదీలో ఉంది. భర్తను చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా లేని దుస్థితిలో ఉంది.  రేణుకను పనిలో పెట్టుకోవడానికి తనకు రెండు లక్షల 70 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని ఆ మొత్తం చెల్లిస్తే తప్ప ఆమెను ఇండియాకు పంపించే ప్రసక్తి లేదని తేల్చేశాడు యజమాని. దాంతో అటు భర్త మరణాన్ని తట్టుకోలేక, తల్లీ ఉన్నా లేనిచందంగా అనాథలైన పిల్లలను తలచుకుంటూ కుమిలిపోతోంది రేణుక.

ఊరికోసం వెళ్లి ఇంటివారికి దూరమై..
భాస్కరయ్య రజక వృత్తిలో ఉన్నాడు. కుటుంబ పోషణకు అదే ఆధారం. తొమ్మిదేళ్ల కిందట భాస్కరయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలకు అన్నీ తానే అయ్యాడు. ఉన్నంతలో కూతురు బత్తెమ్మకు పెళ్లి చేశాడు. తండ్రి కష్టం చూడలేక భాస్కరయ్య కొడుకు సురేష్‌ రెండేళ్ల కిందట కువైట్‌కు వెళ్లాడు కార్మికుడిగా. ఈలోగా ఇసుక దందాకు వ్యతిరేకంగా ఇంటికొకరు ఆందోళనలో పాల్గొనాలని ఊరిపెద్దలు చెప్పడంతో .. తనకు సెంటు భూమి లేకున్నా, సమస్య తనది కాకున్నా ఊరి క్షేమం కోసం ముందుకు కదిలాడు భాస్కరయ్య. గ్రామస్తులతో పదం కలిపాడు. ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

సర్జరీ వల్ల ఆగాను.. లేకుంటే నేనే ...
రామచంద్రనాయుడికి ఈ మధ్యే కంటి సర్జరీ అయింది. దాంతో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో రామచంద్రనాయుడి స్థానంలో ఆయన భార్య ప్రభావతమ్మ వెళ్లింది. ఏముంది.. ఏర్పేడు రోడ్డు ప్రమాదానికి బలైంది. భార్య మరణంతో కుప్పకూలిపోయాడు రామచంద్రనాయుడు. ‘మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి క్షేమం కోసం, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని అనుక్షణం తపించిపోయింది నా భార్య. ఇకపై మా మంచిచెడ్డలు ఆలోచించేవాళ్లు, మా బాగు కోసం తపించిపోయే వాళ్లెవరు?’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు రామచంద్రనాయుడు.
ఉప్పరపల్లి చెంచురెడ్డి సాక్షి, శ్రీకాళహస్తి
చింత మునిశేఖర్, సాక్షి, రేణిగుంట

అయిదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. మేమే మీకు పది లక్షల రూపాయలు ఇస్తాం.చచ్చిపోయిన మా వాళ్లను తిరిగి తెచ్చివ్వగలరా?

Share this article :

0 comments: