హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశా: వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశా: వైఎస్‌ జగన్‌

హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశా: వైఎస్‌ జగన్‌

Written By news on Wednesday, May 10, 2017 | 5/10/2017


హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశా: వైఎస్‌ జగన్‌
న్యూఢిల్లీ:  పార్టీ ఫిరాయింపులు, అనర్హత అంశంపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేసినట్లు ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన బుధవారమిక్కడ మీడియా ప్రతినిధులుతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులే రాజ్యాంగ విరుద్ధమైతే, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం మరింత దారుణమని, ఇదే విషయం ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.  ఈ అంశంపై రాష్ట్రపతితో పాటు ఇతర పార్టీ నేతలను తాము కలిసి విజ్ఞప్తి చేశామని, ఇందులో భాగంగానే ప్రధానికి కలిసినట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు.

అలాగే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా చూడమని, ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రులు, టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయని, మంత్రి నారా లోకేశ్‌కు కూడా సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, వీటన్నింటిపైనా సీబీఐ విచారణ చేయించాలని కోరినట్లు చెప్పారు. మిర్చి రైతులకు కేంద్రం క్వింటాకు రూ.5వేలు ధర ప్రకటించడం హర్షణీయమని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.3వేలు జతచేసి మొత్తం రూ.8వేలు చెల్లిస్తే బాగుండేదన్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం అలా చేయలేదని, అందుకే రూ.8వేలు ఇచ్చి పెద్దమనసుతో  రైతులను  ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు వైఎస్‌ జగన్‌ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంపై పునర్‌ ఆలోచించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. అలాగే హోదా వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా అనేది మర్చిపోలేని అంశమని, ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాలని అన్నారు. హోదా అంశాన్ని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, తిరుపతి సభలో మాట ఇచ్చిన విషయాన్ని ప్రధానికి గుర్తు చేశామని, చంద్రబాబు అడగకపోయినా తమ బాధ్యతగా దీనిపై పరిశీలన చేయాలని కోరినట్లు చెప్పారు.

హోదా ఇవ్వగలిగే వ్యక్తి ప్రధాని అని, ఎంత వీలైతే అంత ఒత్తిడి తెస్తామన్నారు. తమవన్నీ ముక్కుసూటి రాజకీయాలని, చంద్రబాబులా అనైతిక రాజకీయాలు చేయమని వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధరల స్థిరీకరణ నిధిపెట్టి కేంద్ర సాయంతో రైతులను ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడాలేని అవినీతి రాష్ట్రంలో జరుగుతోందని, బాబు అవినీతిపై ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకాన్ని ప్రధానికి అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తనను జైల్లో పెట్టిందని, అయినా ప్రణబ్‌ ముఖర్జీ లాంటి వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు తాము మద్దతు ఇచ్చామన్నారు.

రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టడం సరికాదు

రాష్ట్రపతి వంటి ఉన్నత పదవికి పోటీ ఉండకపోవడమే మంచిదని వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే మంచిదని ఆయన అన్నారు.ఎన్డీఏ వద్ద తగినంత సంఖ్యాబలం ఉందని, వాళ్లే గెలుస్తారని,  ఎలాగు ఓడిపోతామన్నప్పుడు పోటీ పెట్టడం మంచిది కాదన్నారు.  బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. గతంలోనూ ప్రజలకు మంచిచేసే విషయాల్లో బీజేపీ నిర్ణయాలకు తాము మద్దతు ఇచ్చామని అన్నారు. అయితే భూ సేకరణ బిల్లు, ప్రత్యేక హోదా అంశాలపై తాము విభేదిస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
Share this article :

0 comments: