
తిరుపతి: ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ పోస్టింగ్ లు చేయాలని, ప్రజాభిప్రాయంగా అందరూ వీటిని ఆహ్వానిస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయాన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అయితే టీడీపీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతల అరాచకాలపై నెటిజన్లు పోస్టింగులు పెట్టడాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రశ్నించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్లలోనే అశ్లీల, అసభ్య పోస్టులు పెట్టారని గుర్తుచేశారు.
మీకు భజంత్రీలు మోగించే పత్రికలకు మద్ధతిస్తూ, ప్రతిపక్షాల గొంతునొక్కడాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్ధతు ఇవ్వడం అంటారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా మీ చేతిలో లేదని బాధ పడుతున్నారని అధికార పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే దాయాది పాకిస్తాన్ కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తేడా ఏమీ లేదన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు ఎన్నో విషయాలపై ఫిర్యాదు చేస్తే ఒక్కరోజు కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, మా నాయకురాలిపై దారుణమైన పోస్టింగ్ లు పెట్టినప్పుడు టీడీపీ నేతలు వికటాట్టహాసం చేస్తూ పైశాచిక ఆనందం పొందడం నిజం కాదా అంటూ మండిపడ్డారు. మీ నేతలు చేసిన దారుణమైన పోస్టింగ్ లు గుర్తుకులేవా అని సీఎం చంద్రబాబును భూమన సూటిగా ప్రశ్నించారు.
0 comments:
Post a Comment