గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్‌ జగన్‌

గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్‌ జగన్‌

Written By news on Friday, June 30, 2017 | 6/30/2017




ఏలూరు : ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన  సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్‌ చేశారు.

ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు.  కాగా అంతకు ముందు వైఎస్‌ జగన్‌ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
Share this article :

0 comments: