
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అన్ని జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు, పార్టీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను ఈ సందర్భంగా పార్టీ నాయకులకు జగన్ పరిచయం చేశారు.
విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరుగాంచారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌ను విజయపథాన నడిపించడంతో ఆయన కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
కాగా, జులై 8, 9 తేదీల్లో వైఎస్సార్ సీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పన్నెండు ఎకరాల స్థలంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. దాదాపు 30వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్లీనరీ నిర్వహణ కోసం మొత్తం 18 కమిటీలు ఏర్పాటు చేశారు.

0 comments:
Post a Comment