
కర్నూలు: తెలుగుదేశం పార్టీ తనను తీవ్రంగా అవమానపరిచిందని శిల్పా చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం టీడీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు చక్రపాణిరెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘ రేపు నంద్యాల బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతా. సాయంత్రంలోగా వైఎస్ జగన్‌ను కలుస్తా. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం కృషి చేశాను. అలాగే రెండేళ్లుగా టీడీపీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించా.
మంత్రి అఖిలప్రియ సహా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు. చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా సోదరుడు. డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడా మామీద విమర్శలు చేస్తున్నారు. రాజీనామాను జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. దమ్ముంటే రండి అందరం రాజీనామా చేద్దాం. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా మేమేంటో చూపిస్తాం. నంద్యాల గెలుపును జగన్‌కు బహుమతిగా ఇస్తాం.’ అని అన్నారు.




0 comments:
Post a Comment