సభకు వెళ్లొద్దంటూ నోట్ల పంపిణీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సభకు వెళ్లొద్దంటూ నోట్ల పంపిణీ

సభకు వెళ్లొద్దంటూ నోట్ల పంపిణీ

Written By news on Thursday, August 3, 2017 | 8/03/2017


సభకు వెళ్లొద్దంటూ నోట్ల పంపిణీ
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ మరింతగా భరితెగిస్తోంది. ఈ ఉపఎన్నిక షెడ్యూలు విడుదల కాకముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి పర్యటించి నియోజకవర్గానికి వేల కోట్ల ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత అధికార వ్యవస్థను ఒకవైపు దుర్వినియోగం చేస్తూ మరోవైపు డబ్బులు వెదజల్లడం ప్రజలను ప్రలోభపెట్టాలన్న ఎత్తుగడ ఎంచుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటంతో అధికార పార్టీ అనేక అప్రజాస్వామిక చర్యలకు దిగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కి మద్దతుగా నియోజకవర్గంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనబోయే తొలి ప్రచార సభను విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు అమలులో పెట్టింది. జగన్ పాల్గొనే ప్రచార సభకు పెద్దగా జనం రాలేదని ప్రచారం చేసుకోవాలన్న చీప్ టెక్నిక్ తో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. జగన్ మోహన్ రెడ్డి సభలో పాల్గొనరాదంటూ అనేక చోట్ల బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది.

నంద్యాల ఎస్పీజీ మైదానంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటే మీ రేషన్ కార్డులు తొలగిస్తామని, పెన్షన్లలో కోత పెడుతామంటూ బెదిరింపులకు దిగారు. మరికొన్ని చోట్ల సభకు వెళ్లకుంటే డబ్బు ఇస్తామంటూ అనేక మందికి డబ్బులు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల ప్రజలను ఒకచోటికి చేర్చి మరీ డబ్బులు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి కుట్రలు, కుయుక్తులపై నంద్యాలలోని అనేక ప్రాంతాల నుంచి పార్టీ నేతల నుంచి సమాచారం రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు ఇలాంటి సిగ్గుమాలిన, నీతి మాలిన చర్యలకు దిగుతున్నారని ఘాటుగా విమర్శించారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలకు రహస్యంగా సమాచారం ఇచ్చారని, ఆ మేరకు టీడీపీ నేతలు డబ్బుల పంపిణీతో పాటు బెదిరింపులకు దిగారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం చంద్రబాబు నాయుడుకు కొత్తకాదనీ, అధికారం ఉందికదా అని ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ తమ పార్టీ పట్ల ప్రజల్లో అభిమానాన్ని దూరం చేయలేరని, ఈ ఉపఎన్నికలో ప్రజలు టీడీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఓటమికి నాంది పలకడం ఖాయమని భూమన అన్నారు.
వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోందని భూమన కరుణాకరెడ్డి ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని చంద్రబాబు రహస్య పిలుపునిచ్చారని ఆరోపించారు. చంద్రబాబు ఏంచేసినా తాము భయపడబోమని స్పష్టం చేశారు.
 
Share this article :

0 comments: