జగన్‌ పాదయాత్రకు రక్షణ కల్పించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ పాదయాత్రకు రక్షణ కల్పించండి

జగన్‌ పాదయాత్రకు రక్షణ కల్పించండి

Written By news on Friday, November 3, 2017 | 11/03/2017


సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయనకు, పార్టీ నేతలకు అవసరమైన రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావును ఆ పార్టీ కోరింది. ఈ మేరకు డీజీపీకి గురువారం లేఖ రాసింది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మొదలయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుందని, 13 జిల్లాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆ లేఖలో పేర్కొంది. జగన్‌ ప్రతీరోజూ 15 నుంచి 16 కిలోమీటర్లు నడిచి, రాత్రిపూట అక్కడే బస చేస్తారని తెలిపింది. పాదయాత్ర సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనతో కలసి నడుస్తారని పేర్కొంది. పాదయాత్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలను వైఎస్‌ జగన్‌ కలుస్తారని, వారితో సంభాషిస్తారని వివరించింది. ఈ నేపథ్యంలో ‘జెడ్‌’ కేటగిరీ భద్రతలో ఉన్న వైఎస్‌ జగన్‌కు అవసరమైన భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను జిల్లా పోలీసులకు అందజేస్తామని లేఖలో వైఎస్సార్‌సీపీ తెలిపింది.

నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం సాయంత్రం తిరుమలకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి  తెలిపారు. 6.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని కరకంబాడి, మంగళం మీదుగా తిరుమల కొండకు వెళతారు.  రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆదివారం కడపకు చేరుకుని పెద్దదర్గాను దర్శించుకుంటారు. సోమవారం ఇడుపులపాయనుంచి ప్రజా సంకల్పయాత్రను చేపడతారు. 8 నెలల పాటు చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో...  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె హర్షను చూసేందుకు ఇటీవల లండన్‌ వెళ్లిన వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం రోజంతా పార్టీ నేతల సమావేశాలతో గడిపారు.
Share this article :

0 comments: