
కడప ఎయిర్‌పోర్టులో అభిమానులకు అభివాదం చేస్తూ పులివెందులకు బయలుదేరిన వైఎస్ జగన్.
కడప దర్గాలో ప్రార్థనలు.. రాత్రికి ఇడుపులపాయకు
రేపటి నుంచే ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి విమానంలో కడపకు చేరుకున్న వైఎస్ జగన్.. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక పార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి సాయంత్రం తిరిగి కడప వెళ్లనున్న ఆయన.. అక్కడి ప్రఖ్యాత పెద్ద దర్గాలోనూ ప్రార్థనలు చేస్తారు. రాత్రి 8:30 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. రేపటి(సోమవారం) నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్న జగన్‌కు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.
రేపటి నుంచే ప్రజా సంకల్ప యాత్ర : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలగుండా 3వేల కిలోమీటర్ల మేర సాగనున్న వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ సోమవారం ఉదయం నుంచి ప్రారంభకానుంది. ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. తొలిగా వైఎస్సార్ జిల్లాలో ఏడు రోజులపాటు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది.
కడపలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం 

0 comments:
Post a Comment