23 April 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైతు దీక్ష పోస్టర్‌ విడుదల

Written By news on Saturday, April 29, 2017 | 4/29/2017


రైతు దీక్ష పోస్టర్‌ విడుదల
మే 1, 2 తేదీల్లో వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష

సాక్షి, అమరావతి బ్యూరో: మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ప్రభు త్వ నిర్లక్ష్యానికి , రుణమాఫీలో మోసానికి నిరసనగా మే 1, 2 తేదీల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ తెలిపారు.

ఆయన శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులతో  కలసి ‘రైతు దీక్ష’  పోస్టర్‌ విడుదల చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకే దీక్ష చేస్తున్నామని ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌ వివరించారు.

నోట్లో ఇసుక కొట్టారు!


నోట్లో ఇసుక కొట్టారు!ఏర్పేడు ఘటనలో మృతి చెందిన తండ్రి, కొడుకు మునికృష్ణయ్య, కోదండపాణి మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
నోట్లో ఇసుక కొట్టారు! నోట్ల కోసం కొట్టారు... కోట్ల కోసం కొట్టారు. కాటికెక్కించారు... కాల్చిపారేశారు.అంతకుముందు.. విషం కక్కారు... లారీలతో తొక్కారు. ఇసుక మాఫియా జేబులో ఉండే డబ్బుకు అన్నీ రక్తపు మరకలే. మనుషులు మాంసం ముద్దలైనా పర్వాలేదు. దానికో లెక్కుండాలి! అది జేబులో పడాలి! ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబానికి 5 లక్షలు పారేస్తామన్నారు. ప్రాణాన్ని ఇసుకలో పూడ్చేశారు. తాళిని ఇసుకతో తెంపేశారు. ఇసుకను పిండి నూనెనైనా తియ్యొచ్చేమో కానీ ఈ దుర్మార్గుల గుండెల్లో మానవత్వం అనే
ఒక్క చుక్కను కూడా పిండలేం. కడుపుకు తింటున్నది అన్నమా? నోట్ల కట్టలా? కానీ మన నోట్లో కొడుతున్నది మాత్రం ఇసుకే. మగానుభావులు... లీడర్లు, ప్రభుత్వాలు.. వీళ్లలో... ఇసుమంత దయ ఉండదా? ఇసుక రేణువంత కరుణ ఉండదా?


శ్రీకాళహస్తి, తిరుపతి రోడ్డుమార్గంలోని ఏర్పేడు నడిబొడ్డున ఈ నెల 21న జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు! వాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనేకన్నా ఇసుక మాఫియా వాళ్లను పొట్టన పెట్టుకుంది అనడం సబబు. స్వర్ణముఖి నది పక్కనే మునగలపాళెం .. ఆ ఊరి ప్రజలు కలిమిలేములను కలిసి పంచుకుంటూ.. ఉన్న దాంతో తృప్తిపడుతూ సంతోషంగానే ఉంటున్నారు. కాని రెండేళ్లుగా మనసుల్లో కలతను నింపి మొహాల మీద చిరునవ్వు లేకుండా చేసింది ఇసుక మాఫియా. కంటి మీద కునుకును దూరం చేసింది.

నేపథ్యం
 స్వర్ణముఖిలోని ఇసుకను తోడేస్తూ ఆ నదీమతల్లికి గుండెకోత పెడుతుంటే చూడలేక ఊరు ఊరంతా కలిసి న్యాయపోరాటానికి దిగింది. అయితే అధికార యంత్రాంగం ఇసుకను తోడుతున్న వారికే అండగా నిలిచింది. అయినా అధైర్యపడలేదు వాళ్లు. అలుపెరగక పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే.. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నినదించేందుకు ఇంటికొక్కరు చొప్పున ఊళ్లోవాళ్లంతా కలిసి మొన్న మండల కేంద్రమైన ఏర్పేడుకు వెళ్లారు. తిరిగి వస్తుంటేనే ప్రమాదం జరిగి న్యాయపోరాటానికి దిగిన వాళ్లలో పదిహేను మంది మరణించారు. అందులో కుటుంబ పెద్దలున్నారు. వాళ్లు లేని లోటుతో ఆ ఇల్లు రోడ్డున పడే పరిస్థితి ఉన్న వ్యక్తులు. కొడుకులున్నారు.. తల్లిదండ్రులకు చెట్టంత నీడనిచ్చేవాళ్లు. ఆడవాళ్లున్నారు.. దీపం పెట్టి ఇంట్లో వెలుగు నింపే వాళ్లు.. భర్తల బరువు, బాధ్యతలను సగం మోస్తున్న సహధర్మచారిణులు. ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదం. తీరని వ్యథ. కన్నీళ్లు పెట్టించే కథ. వీళ్ల మరణాలతో ఆ ఊరు దిగ్భ్రాంతికి గురైంది.  కన్న బిడ్డలను పోగొట్టుకుని గుండెపగిలేలా ఏడుస్తోంది. ఆ ఊరి కష్టం ఎవరు తీరుస్తారు? ఆ బిడ్డలకు తల్లుల్ని, తండ్రులను ఎవరు తెచ్చిస్తారు? పోయిన బిడ్డలకు ఊపిరిలూది ఆ తల్లిదండ్రుల పేగుబంధాన్ని ఎవరు నిలుపుతారు?

న్యాయం మీరే చెప్పండి
‘ఇసుక దందా మీద మేం చెప్పినప్పుడే మీరు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు కదయ్యా.. ఇంత మంది ఉసురు పోయేది కాదు. ఒక్కసారి ఎనిమిది మంది ఆడవాళ్ల తాళ్లు తెగిపడ్డాయి. నష్టపరిహారంగా ఒక్కో కుటుంబానికి అయిదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. మేమే మీకు పది లక్షల రూపాయలు ఇస్తాం. చచ్చిపోయిన మా వాళ్లను తిరిగి తెచ్చివ్వగలరా అయ్యా..? మీరు ఎన్ని లక్షలస్తే పోయిన ప్రాణాలు వస్తాయి? లేని మనుషుల లోటు తెలుస్తుంది? చెప్పండి? జరుగుతున్న అన్యాయం మీ దృష్టిలో పడాలంటే ఇంతమంది ప్రాణాలు బలిపెట్టాలా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడాలా? మీరే ఆలోచించండి. న్యాయం మీరే చెప్పండి’ అంటూ అధికార నేతను నిలదీశారు.
ఆవిడ వేసిన ఒక్కో ప్రశ్న మానవత్వమున్న వాళ్లను తలదించుకునేలా చేసింది. ఆవిడ ఆవేదన కంటతడి పెట్టించింది. అందుకే మౌనమే సమాధానంగా వెనుదిరిగారు. బహుశా.... ప్రభుత్వం తెలుసుకుందో..  పశ్చాత్తాపం కలిగిందో.. లేక వేరే దారి తోచిందో! వీటికి జవాబు ప్రభుత్వం ఇసుక మాఫియా మీద తీసుకోబోయే చర్య ద్వారానే తెలుస్తుంది. పోయిన ప్రాణాలు పోయాయి.. కనీసం ఉన్న వాళ్లకైనా మంచి జరగాలి. ఊరుతల్లి హాయిగా ఊపిరి పీల్చుకోవాలి.

చివరి చూపు కూడా అందలేదు
ఏర్పేడు రోడ్డు ప్రమాద మృతుల్లో జయచంద్ర కూడా ఒకరు. కడు పేదరికంలో మగ్గుతోంది ఆయన కుటుంబం. భర్త సంపాదన సరిపోకపోవడంతో పిల్లల (మోక్షిత్, యజ్ఞ) పోషణ భారమై రెండు నెలల కిందట జయచంద్ర భార్య రేణుక సౌదీకి వెళ్లింది.  ఇక్కడ ఊరి బాగు కోసం ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తాడు జయచంద్ర. అందులో భాగంగానే ఊళ్లో వాళ్లతో కలిసి ఏర్పేడు ప్రయాణమయ్యాడు. అదే ఆయనకు చివరి ప్రయాణమైంది. తండ్రిని కోల్పోయి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారులను అక్కున చేర్చుకొని సముదాయించాల్సిన తల్లి ఎక్కడో సౌదీలో ఉంది. భర్తను చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా లేని దుస్థితిలో ఉంది.  రేణుకను పనిలో పెట్టుకోవడానికి తనకు రెండు లక్షల 70 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని ఆ మొత్తం చెల్లిస్తే తప్ప ఆమెను ఇండియాకు పంపించే ప్రసక్తి లేదని తేల్చేశాడు యజమాని. దాంతో అటు భర్త మరణాన్ని తట్టుకోలేక, తల్లీ ఉన్నా లేనిచందంగా అనాథలైన పిల్లలను తలచుకుంటూ కుమిలిపోతోంది రేణుక.

ఊరికోసం వెళ్లి ఇంటివారికి దూరమై..
భాస్కరయ్య రజక వృత్తిలో ఉన్నాడు. కుటుంబ పోషణకు అదే ఆధారం. తొమ్మిదేళ్ల కిందట భాస్కరయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలకు అన్నీ తానే అయ్యాడు. ఉన్నంతలో కూతురు బత్తెమ్మకు పెళ్లి చేశాడు. తండ్రి కష్టం చూడలేక భాస్కరయ్య కొడుకు సురేష్‌ రెండేళ్ల కిందట కువైట్‌కు వెళ్లాడు కార్మికుడిగా. ఈలోగా ఇసుక దందాకు వ్యతిరేకంగా ఇంటికొకరు ఆందోళనలో పాల్గొనాలని ఊరిపెద్దలు చెప్పడంతో .. తనకు సెంటు భూమి లేకున్నా, సమస్య తనది కాకున్నా ఊరి క్షేమం కోసం ముందుకు కదిలాడు భాస్కరయ్య. గ్రామస్తులతో పదం కలిపాడు. ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

సర్జరీ వల్ల ఆగాను.. లేకుంటే నేనే ...
రామచంద్రనాయుడికి ఈ మధ్యే కంటి సర్జరీ అయింది. దాంతో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో రామచంద్రనాయుడి స్థానంలో ఆయన భార్య ప్రభావతమ్మ వెళ్లింది. ఏముంది.. ఏర్పేడు రోడ్డు ప్రమాదానికి బలైంది. భార్య మరణంతో కుప్పకూలిపోయాడు రామచంద్రనాయుడు. ‘మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి క్షేమం కోసం, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని అనుక్షణం తపించిపోయింది నా భార్య. ఇకపై మా మంచిచెడ్డలు ఆలోచించేవాళ్లు, మా బాగు కోసం తపించిపోయే వాళ్లెవరు?’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు రామచంద్రనాయుడు.
ఉప్పరపల్లి చెంచురెడ్డి సాక్షి, శ్రీకాళహస్తి
చింత మునిశేఖర్, సాక్షి, రేణిగుంట

అయిదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. మేమే మీకు పది లక్షల రూపాయలు ఇస్తాం.చచ్చిపోయిన మా వాళ్లను తిరిగి తెచ్చివ్వగలరా?

15 గ్రామాల్లో 990 ఎకరాలు హాంఫట్‌


రాజధానిలో 'బినామీ' దెయ్యం
దళితుల భూముల్లో కాసుల వేట.. 15 గ్రామాల్లో 990 ఎకరాలు హాంఫట్‌

- దొడ్డిదారిన అసైన్డ్,లంక భూముల రిజిస్ట్రేషన్‌
బినామీల ముసుగులో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల దందా
రిజిస్ట్రేషన్లకు ముందే అడంగల్, 1 బీలోకి అసైన్డ్‌ భూములు
రెగ్యులరైజ్‌ చేసి పూలింగ్‌ యత్నం
విలువైన ప్లాట్లు కొట్టేసే పన్నాగం
ఆక్రమించుకున్న భూముల విలువ రూ.1,980 కోట్లు
కృష్ణా తీర భూముల్లో రిసార్టులు, మల్టీప్లెక్స్‌లు కట్టాలని ప్లాన్‌  


సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో భారీ భూ బాగోతం బయటపడింది. అమరావతి పరిధిలో పేదల జీవనాధారం కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, లంక భూములను మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు బినామీ పేర్లతో దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. పేదలను భయపెట్టి, ఒత్తిడి తెచ్చి, ఎంతోకొంత చేతిలో పెట్టి నోరు మూయించారు. రాజధాని పరిధిలోని 15 గ్రామాల్లో రూ.1,980 కోట్ల విలువైన 990 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాహా చేశారు. అయితే, ఇందులో 507 రిజిస్ట్రేషన్లకు సంబంధించి 660 ఎకరాలను అధికారులు పెండింగ్‌లో పెట్టారు. వీటికోసం ప్రత్యేక జీవో తెచ్చి, రెగ్యులరైజ్‌ చేసుకుని, ల్యాండ్‌ పూలింగ్‌(భూ సమీకరణ)కు ఇచ్చి, ప్రభుత్వం నుంచి విలువైన ప్లాట్లు కొట్టేయటానికి అక్రమార్కులు పన్నాగాలు పన్నుతున్నారు. 330 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగి, డాక్యుమెంట్‌ నంబర్లు కూడా వచ్చినట్లు సమాచారం.

సర్కారు భూములే టార్గెట్‌
అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు.. పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూములపై కన్నేశారు. తుళ్లూరు, మంగళగిరి,తాడేపల్లి పరిధిలో 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్‌ జమీందార్‌ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్‌ జమీందార్‌ భూములు ఉన్నాయి. వీటిని 1954, 1971, 1976, 2005లో భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం పంచిపెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను టార్గెట్‌ చేశారు. 990 ఎకరాల అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు.

ఒత్తిళ్లు.. బెదిరింపులు.. పైరవీలు
అసైన్డ్‌ భూముల సాగుదారులను దళారుల సహకారంతో బెదిరించారు. కొందరికి డబ్బు ఆశ చూపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు డబ్బుకు లొంగి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేశారు. మరికొందరిని బెదిరించి సంతకాలు చేయించుకున్నారు. ఇంకొందరిని బం«ధువుల ద్వారా పైరవీలు చేయించి లొంగదీసుకున్నారు. వేటికీ లొంగని వారిని పోలీసుల చేత భయపెట్టారు. అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. అలా ఒప్పించి ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున అనుభవదారులకు ముట్టజెప్పారు. రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు.
తెరముందు బినామీలే..
వెంకటపాలెం గ్రామానికి చెందిన కొలికిపూడి ఏసుదాసుకి సర్వే నంబర్‌ 298/2లో 1.17 ఎకరాల భూమి ఉంది. ఆయన మరణించాక భార్య కొలికిపూడి ఎస్తేరురాణి పేరిట పాసుపుస్తకం, టైటిల్‌ డీడ్‌ ఇచ్చారు. అయితే, ఈ భూమిని 2015 అక్టోబర్‌ 19న అరుణ్‌కుమార్‌ కంటి మహంతి పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందుకుగాను ఎస్తేరురాణికి రూ.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. సర్వే నంబర్‌ 293/3లో నీలం నాగమణి అలియాస్‌ నాగమ్మ పేరిట 99 సెంట్లు, 302/9లో పులి అబ్రహం పేరిట 1.98 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని విశాఖపట్నానికి చెందిన అరుణ్‌కుమార్‌ కంటి మహంతి, సెరీన్‌ వివేక కంటి మహింతి, కోనేరు కుటుంబరావు, కోనేరు హిమబిందుకు విక్రయించినట్లు 2015 అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి బినామీలని సమాచారం. వెంకటపాలెం గ్రామంలో 330 ఎకరాల లంక, అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఉద్ధండ్రాయునిపాలెం, రాయపూడి, నవులూరు, కురగల్లు పరిధిలో అత్యధికంగా ప్రభుత్వ, లంక భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

ఆన్‌లైన్‌లో రికార్డులు మాయం
అసైన్డ్, లంక భూములను కొట్టేసే కుట్రలో భాగంగా టీడీపీ పెద్దలు ముందుగా రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపారు. ప్రభుత్వ భూములను రెవెన్యూ రికార్డులైన అడంగల్, 1బీలో నమోదు చేయించారు. వాటి ఆధారంగా రిజిస్ట్రార్లపై ఒత్తిడి చేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ తతంగమంతా పూర్తయ్యాక ఆన్‌లైన్‌లో అడంగల్, 1బీలను మాయం చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. అనంతరం వాటిని ల్యాండ్‌పూలింగ్‌కి ఇచ్చి, పరిహారం కింద ప్రభుత్వం నుంచి అత్యంత విలువైన ప్లాట్లు తీసుకోవాలని భావిస్తున్నారు. కృష్ణా నదీ తీరాన ఉన్న భూములను మాత్రం పూలింగ్‌కు ఇవ్వకుండా అందులో రిసార్టులు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆక్రమించుకున్న అసైన్డ్, లంక భూముల విలువ దాదాపు రూ.1,980 కోట్లు ఉంటుందని అంచనా.

ఆంధ్రప్రదేశ్‌ కంటే బిహార్‌ చాలా బెటర్‌

Written By news on Friday, April 28, 2017 | 4/28/2017

ఏపీలో చెత్తపాలన!
‘మాకి’ చైర్మన్‌ పుమిహికో
- ‘ఆర్కిటెక్చురల్‌ డైజెస్ట్‌’లో ప్రత్యేక వ్యాసం
ఆంధ్రప్రదేశ్‌ కంటే బిహార్‌ చాలా బెటర్‌
ఏపీలో మాకు వింత అనుభవాలు...
సీఆర్‌డీఏని స్వతంత్రంగా పనిచేయనివ్వరు..
రాజకీయ జోక్యం ఎక్కువ.. అంతా గోప్యం..
‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ఒట్టి ప్రచారమే..
అంతా అయోమయం.. గజిబిజి వాతావరణం
లోపాయికారీ ఒప్పందం ప్రకారమే అక్కడ ఎంపికలు
సినిమా డైరెక్టర్‌ని సంప్రదించాలట..
ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్‌కూ మా అనుభవం తప్పదు


సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి’ అని జపాన్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్కిటెక్చర్‌ సంస్థ దుమ్మెత్తిపోసింది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఫోర్బ్స్‌ మ్యాగ్‌జైన్‌లా భావించే ‘ఆర్కిటెక్చురల్‌ డైజెస్ట్‌’ మ్యాగజీన్‌లో రాష్ట్రం పరువుపోయే విధంగా ఓ ఆర్టికల్‌ ప్రచురితమయ్యింది. ‘బిహార్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పాలన ఉంది’  ఈ వ్యాసంలో ఏకిపారేశారు. అంతర్జా తీయంగా పేరొందిన ఆర్కిటెక్చురల్‌ డైజెస్ట్‌ (ఏడీ) మ్యాగజీన్‌ ఇండియాలోకి అడుగు పెట్టి ఐదేళ్లు అయిన సందర్భంగా జపాన్‌కు చెందిన మాకి అండ్‌ అసోసియేట్స్‌ ఫౌండర్‌ చైర్మన్,  ప్రపంచ ప్రఖ్యాత ప్రిట్జ్‌కెర్‌ ప్రైజ్‌ విజేత ఫుమిహికో మాకి ఈ వ్యాసం రాశారు.

ఈ వ్యాసాన్ని ‘ఆర్కిటెక్చురల్‌ డైజెస్ట్‌’ ఏప్రిల్‌ సంచికలో ప్రచురించారు. మాకి అసోసియేట్స్‌ కూడా ఇండియాలోకి ప్రవేశించి ఐదేళ్లు పూర్తవడం విశేషం. ఇండియాలో తమ ఐదేళ్ల అనుభవాలను పోలుస్తూ ఆంధ్రాలో కంటే బీహార్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు, వ్యాపారాల కు మెరుగైన పరిస్థితులు ఉన్నాయని విదేశీ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో తమఅనుభవాలను ఫుమిహికో మాకి ఏ విధంగా వ్యక్తం చేశారో ఆయన మాటల్లోనే చూడండి...

ఏపీలో అంతా అయోమయం..
‘‘2011 చివర్లో మేము భారత్‌లోకి అడుగు పెట్టాం. ఈ ఐదేళ్ల కాలంలో ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన రెండు అనుభవాలను ప్రత్యక్షంగా చూశాం. అందులో ఒకటి బిహార్‌ కాగా మరొకటి ఏపీలో. బిహార్‌లో వ్యాపార మన్నా.. అక్కడ పనిచేయాలనా చాలా దుర్భ రమైన పిరిస్థితులను చవిచూడాల్సి వస్తుందం టూ ఒక ప్రచారం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో  ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌  నెంబర్‌ వన్‌ స్టేట్‌(దేశంలో వ్యాపారాలకు అత్యంత అను కూల రాష్ట్రం) అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంటించిన పోస్టర్లు కనిపిస్తాయి.

కానీ ఐదేళ్లలో మాకు కనిపించింది ఏమిటంటే బిహార్‌ రాష్ట్రం ఒక చక్కటి ప్రణాళికతతో, సుపరి పాలనతో దూసుకుపోతుండగా, ఏపీ మాత్రం పూర్తి అయోమయంగా ఏ అంశంపై అవగా హన లేకుండా గజిబిజి వాతావరణాన్ని సృష్టించింది. నిబద్ధతలేని విధానాలతో విశ్వాసం కోల్పోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో బీహార్‌లో మ్యూజియం నిర్మించడానికి కాంట్రాక్టు చేజిక్కించుకోవడమే కాకుండా దాన్ని సకాలంలో పూర్తి చేశాం. ఈ సమ యంలో ఎక్కడా ప్రభుత్వం మా పనిలో జోక్యం చేసుకోలేదు. కానీ దీనికి భిన్నంగా ఏపీలో పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి.

సీఆర్‌డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదు
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మేము అందించిన డిజైన్లు ఎంపికయ్యాయి. అంతర్జాతీయ ప్రముఖలతో  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ మమ్మల్ని చీఫ్‌ ఆర్కిటెక్ట్స్‌గా ఎంపిక చేసింది. కానీ ఏమయ్యిందో ఏమో కానీ ఒకసారి మా డిజైన్లు ఎంపిౖకైన తర్వాత జ్యూరీ మాయమైపోయింది. ఇప్పటి వరకు ఆ జ్యూరీ రిపోర్టు ప్రజలకు బహిర్గతం చేయలేదు. అంతేకాదు ఇష్టానుసారంగా సొంత అభిప్రాయాలను, సూచనలను ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక స్పష్టమైన ఆమోద ప్రక్రియ లేకుండా పోయింది. ఈ రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏపీ సీఆర్‌డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదని, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడివున్న ఆదేశాలను పాటించడం తప్ప, తాము ఏమీ చేయలేమని ఆ సంస్థ ఉద్యోగులే మాతో ప్రైవేటు సంభాషణల్లో వెల్లడించారు. కనీసం ముఖ్యమంత్రి అడిగిన విధంగా మాకు డిజైన్లను మార్చి ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదు.

ఏదో లోపాయికారీ ఒప్పందం ప్రకారమే ఎంపికలు..
2016 అక్టోబర్‌ 24న  కారణాలు లేకుండా మమ్మల్ని  తొలగిస్తున్నట్లు అధి కారిక ఉత్తర్వులు ఇచ్చారు. మర్నాడే అంటే.. అక్టోబర్‌ 25న రిక్వెస్ట్‌ ఫర్‌ కొటేష న్స్‌(ఆర్‌ఎఫ్‌క్యూ) పిలవడం, డిసెంబర్‌లో లండన్‌కు చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ను ఎంపిక చేయడం జరిగిగాయి.  ఏ విధంగా ఎంపిక చేసింది బాహ్య ప్రపంచానికి తెలి యచేయలేదు.  ఇంత వరకు కొత్త డిజైన్లు ఏవీ ప్రజలకు చూపించలేదు. దీన్ని బట్టి ఇక్కడ ఏదో లోపాయికారీ ఒప్పందం ప్రకారమే ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రాజధాని డిజైన్ల గురించి తెలుగు సినీ దర్శకుడు రాజమౌళితో చర్చించమని ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ను అడిగినట్లు తెలుస్తోంది. 

అంతర్జాతీయంగా ఎంతో పేరున్న ఫోస్టర్స్‌ ఈ గొడవలు ఏమీ పట్టించు కోకుండా పనిచేస్తుందా లేకా మా లాంటి అనుభవమే ఎదురవుతుందా అన్నది కాలమే  చెపుతుం ది. మొత్తం మీద బిహర్, ఏపీ మాకు రెండు విభిన్న మైన అనుభవాలను అందించాయి. బిహార్‌తో ఇండియాలో అపారమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయన్న భరోసా వస్తోంది. ఏపీ చేదు అనుభవాలను అందిం చింది. దీన్ని మేం ఒక గుణపాఠంగా భా విస్తాం. ఇలాంటి ఉదంతాలతో భారత్‌ పేరు ప్రఖ్యాతులు అంతార్జాతీయంగా మసకబారే ప్రమాదం ఉంది.’’ అని ఫుమిహికో మాకి ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

Popular Posts

Topics :