
► గడప గడపకు నవరత్నాలు చేరాలి
► మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
కోవెలకుంట్ల: పార్టీ మారుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటేనని వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. స్థానిక కృష్ణతేజ ఫంక‌్షన్ హాలులో శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల బూత్ కమిటీలతో నవరత్నాల సభ నిర్వహించారు.
సభకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు 2019లో గుణపాఠం తప్పదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తొమ్మిది పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత బూత్‌కమిటీలదేన్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసాతో ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరుగుతుందని, ఏడాదికి రూ.12500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50వేలు రైతుల చేతికందుతుందన్నారు.
డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, పొదుపు సంఘాలకు రూ.15వేల కోట్లతో ప్రతి మహిళ లక్షాధికారి అయ్యే విధంగా వైఎస్‌ఆర్ ఆసరా పథకంతో లబ్ధిచేకూరతుందన్నారు. రూ. వెయ్యి పింఛన్‌ను రూ.2వేలకు పెంచడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎంతో ఆసరాగా ఉంటుందని, పేద కుటుంబాల్లోని పిల్లల చదువుకు ఏడాదికి రూ.10వేల నుంచి రూ.20వేలు నేరుగా తల్లులకే ఇచ్చే విధంగా అమ్మ ఒడి పథకంతో పిల్లల భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెలవేరుతుందని, ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్జ ప్రాజెక్టుల పూర్తి, మూడు దశల్లో మద్యపాన నిషేధం కార్యక్రమాలతో రాష్ట్రంలో తిరిగి రాజన్నరాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.