
హైదరాబాద్ : నవంబర్ 6 నుంచి ఆరు నెలలపాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు...ప్రజాసంకల్పంగా నామకరణ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో పార్టీ ప్రణాళిక, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాలు, జరగని ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని అనే అంశాలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఇచ్ఛాపురం వరకూ కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్....ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. అలాగే మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టనున్నారు. అంతేకాకుండా ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ఇక మిగిలిన 58 నియోజకవర్గాల్లో పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటారన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలందరినీ ఆయన కలుస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు.