2011 లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2011 లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన!

2011 లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన!

Written By news on Thursday, August 7, 2014 | 8/07/2014

పునర్విభజన షురూ!
* 2011 లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన
* పార్లమెంటు స్థానాలు యథాతథం
* ఎస్టీ లోక్‌సభ స్థానం ఒకటి పెరిగే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తవ్వాల్సి ఉండటంతో ఈ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో ఉన్న ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపైనా దృష్టి సారించినట్టు తెలిసింది. ఇందుకోసం త్వరలోనే ఒక కమిషన్‌ను నియమించనుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలను 225కు పెంచాల్సి ఉంది. పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాల స్వరూప, స్వభావాలు మారతాయి. నియోజకవర్గాల్లో ఇప్పుడున్న మండలాలు కొన్ని ఇతర నియోజకవర్గాల్లో చేరతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టాల్సి ఉంది. ఈ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  4,93,78,776 జనాభా ఉంది.

పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పెరగనున్న నియోజకవర్గాల సంఖ్యతో  మొత్తం రాష్ట్ర  జనాభా సంఖ్యను విభజిస్తే ఒక్కో నియోజకవ ర్గానికి 2,19,461 సగటు జనాభా ఉండే అవకాశాలున్నాయి. ఈ లెక్కన శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరంలో 2, విశాఖపట్నంలో 5, తూర్పు గోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 3, కృష్ణాలో 3, గుంటూరులో 5, ప్రకాశంలో 3, నెల్లూరులో 4, చిత్తూరులో 5, వైఎస్సార్‌లో 3, అనంతపురంలో 5, కర్నూలులో 5 చొప్పున నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది.

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు
తాజా జనగణన ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినందున, ఆ వర్గాలకు రిజర్వు అయ్యే నియోజకవర్గాలు కూడా పెరగనున్నాయి. ఈ రిజర్వ్‌డ్ స్థానాలు కూడా మారనున్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 84,45,398గా ఉంది. ఆ వర్గానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 29 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈసారి 38కి చేరుకొనే అవకాశం ఉంది. ఎస్సీ స్థానాలను జిల్లా యూనిట్‌గా కేటాయిస్తారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎస్సీ స్థానాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేశారు.

రాష్ట్రంలో ఎస్టీల జనాభా 26,31,145గా ఉంది. వారికి ప్రస్తుతం అసెంబ్లీలో ఏడు సీట్లుండగా అది 12కు చేరుకునే అవకాశముంది. ఎస్టీలకు రాష్ట్రం యూనిట్‌గా నియోజక వర్గాలను నిర్ణయిస్తారు. నియోజకవర్గాల విభజన తరువాత ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న మొదటి 12 స్థానాలు ఏయే జిల్లాల్లో ఉంటే వాటిని ఎస్టీలకు కేటాయిస్తారు. పునర్విభజనలో భౌగోళిక మార్పులతో కొత్త నియోజకవర్గాలు రిజర్వు అయ్యే
 అవకాశముంది.

లోక్‌సభ స్థానాల సంఖ్య యథాతథం
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. అయితే జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్యను అనుసరించి లోక్‌సభ స్థానాల్లో అక్కడ పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. ప్రస్తుతం ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, పునర్విభజన తర్వాత వీటి సంఖ్య తొమ్మిదికి పెరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతున్నందున ఒక్కొక్క లోక్‌సభ స్థానం పరిధి రెండు మూడు జిల్లాలకు విస్తరించే అవకాశముంది. దీనివల్ల ఎంపీలకు పరిపాలనపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు.

సాధ్యమైనంతమేరకు ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒకటి లేదా రెండు జిల్లాలకు మించి లేకుండా చూడాలని భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం అమలాపురం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనతో ఇప్పుడున్న నియోజకవర్గాల స్వరూపంలో మార్పు వస్తే కనుక వీటికి బదులు వేరే నియోజకవర్గాలు రిజర్వు అయ్యే అవకాశముంటుందే తప్ప సంఖ్య మాత్రం నాలుగుగానే ఉండనుంది.

ఎస్టీలకు ప్రస్తుతం అరకు లోక్‌సభ స్థానం మాత్రమే రిజర్వు అయి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఎస్టీల లోక్‌సభ స్థానం మరొకటి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మండలాల్లోని జనాభాలో అత్యధికం ఎస్టీలే ఉన్నారు. ఆ లెక్కన రాష్ర్ట్రంలో వారి జనాభా పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను ఆనుకొని ఉన్నవే కనుక అక్కడి  అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్ని ఎస్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.


Share this article :

0 comments: