కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్‌

కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్‌

Written By news on Saturday, August 9, 2014 | 8/09/2014

కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, కడప : జిల్లా రైతులు ప్రతిసారి కరువు కొరల్లో చిక్కుకుపోతున్నారు.. మిగతా జిల్లాలకు ఎప్పుడో కరువు వస్తే.. ఇక్కడ మాత్రం పిలవని పేరంటంలా వచ్చి ఇబ్బంది పెడుతోంది. తుంగభద్ర నుంచి సాగునీరు సక్రమంగా రాక పులివెందుల, జమ్మలమడుగు రైతులు అల్లాడుతున్నారు... కృష్ణా జలాలైనా సంపూర్ణంగా వస్తే తప్ప.. కేసీ కాలువతోపాటు ఇతర ప్రాంతాల రైతులకు పంటలు పండించుకునే అవకాశం ఉండదని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, గండికోట, జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో వైఎస్ జగన్ శుక్రవారం విడివిడిగా సమీక్షించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డితో కలిసి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను గండికోటకు ఈసారైనా  తీసుకురావాలని.. ఇంతలోపే ముంపు గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సిన పరిహారం మొత్తాన్ని ఇవ్వాలన్నారు. కృష్ణా జలాలు గండికోటకు వస్తే అక్కడ నుంచి పైడిపాలెంకు తీసుకరావచ్చని.. అలాగే సీబీఆర్‌కు కూడా పంపింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పైడిపాలెం, సీబీఆర్, పీబీసీ, బైపాస్ కాలువలకు  సంబంధించిన పనులు  ఇంకా పెండింగ్‌లో ఎందుకున్నాయని ఆయన ప్రశ్నించారు.

దివంగత సీఎం వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే 80శాతం పైగా పనులు పూర్తయితే.. ఇప్పటివరకు ఇంకా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. తుంగభద్ర నుంచి ఈసారైనా పులివెందులకు పూర్తి కోటా నీరు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని.. ఐఏబీ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ మేరకు  డిమాండు చేస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పీబీసీకి 4.4 టీఎంసీతోపాటు, మైలవరానికి 1.300టీఎంసీల పూర్తికోటా నీటిని అందించాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు.

రేషన్ డీలర్లను  ఇబ్బంది పెట్టొదు
రేషన్ డీలర్లకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగ్గా నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని.. అలా కాకుండా కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేయడం తగదని వైఎస్ జగన్ సూచించారు. నిజంగానే డీలర్ అన్యాయంగా సొమ్ము చేసుకుంటుంటే చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ.. అనవసరంగా ఎలాగోలాగా ఇబ్బందులు పెట్టి తొలగించాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు.

గ్రామాభివృద్ధికి సహకరించండి :
పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. గ్రామాల్లో సమస్యలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

సమావేశాలలో మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డి, పీబీసీ, పైడిపాలెం ప్రాజెక్టుల ఈఈలు రాజశేఖర్, చెంగయ్యకుమార్‌లతోపాటు పలువురు డీఈలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ రఘురామయ్య, ఏడు మండలాల తహశీల్దార్లు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, శివరామయ్య, శ్రీనివాసులు, ఎల్.వి.ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవోలు మురళీమోహన్‌మూర్తి, సమత, జ్ఞానేంద్రరెడ్డి, మైథిలీ, బాలమునెయ్య, వెంకటేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయండి
నెలకొకమారు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ. 200  పింఛన్‌ను అధికారులు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.  ఏ సమయానికి ఎక్కడ పింఛన్ ఇస్తున్నారో.. ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా తెలపకపోవడంతో లబ్ధిదారుల పింఛనంతా ఆటో ఛార్జీలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో ఇబ్బందులు సృష్టించడం తగదని.. మాన్యువల్ పద్దతిలోనే లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ అందేదన్నారు. 
Share this article :

0 comments: