
- అన్నదాతలకు అన్యాయం జరిగితే సహించేదిలేదు
- రుణమాఫీ అమలు కోసం16న వైఎస్సార్ సీపీ ఆందోళన
- ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి రూరల్: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పాలన హిట్లర్ పరిపాలనను తలపిస్తోందని, టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో రైతులను బెదిరించి భయపెట్టి భూములను బలవంతంగా లాక్కోవాలని యత్నిస్తోందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లాలోనే రాజధాని ఏర్పాటు వుంటుందని ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతుల్లో ఆందోళన నెలకొని ఉందన్నారు.
ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకుండా రాజధాని ఏర్పాటు చేయాలని భావించడంతో భావితరాలు నష్టపోవడం ఖాయమన్నారు. మంగళగిరి రాజధాని అనేది దాదాపు ఖాయమైందని, తాజాగా సీఎం ప్రకటనే అందుకు నిదర్శనమన్నారు. రాజధాని విషయంలో వీజీటీఎం ఉడా పరిధిలోని ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఉడా పరిధిలో ఎక్కువ మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే వుండగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే వున్నారని చెప్పారు. అసలు ప్రభుత్వానికి అధికార పార్టీ శాసనసభ్యులపైనే నమ్మకం లేదని, పైగా ఉడా పరిధిలోని ఎమ్మెల్యేలను అగౌరవపరిచేవిధంగా వ్యవహరించడం దారుణమన్నారు.
రాజధాని పేరుతో రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధమన్నారు. రుణమాఫీ అమలు విషయంపై ఈనెల 16న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.11న కొండవీటివాగు హైలెవల్ కమిటీ రాక .. మంగళగిరి నియోజవర్గ రైతుల పాలిట దుఖఃదాయనిగా ఉన్న కొండవీటి వాగు ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 11వ తేదీన హైలెవల్ కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు కురగల్లు-ఐనవోలు బ్రిడ్జి వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించి 11న రానున్న హైలెవల్ కమిటీకి అందజేస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment