తెలంగాణలో వైఎస్సార్‌సీపీని పటిష్టపరచాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో వైఎస్సార్‌సీపీని పటిష్టపరచాలి

తెలంగాణలో వైఎస్సార్‌సీపీని పటిష్టపరచాలి

Written By news on Thursday, October 9, 2014 | 10/09/2014

కొమురం భీం స్ఫూర్తితో ముందుకెళ్దాంబుధవారం హైదరాబాద్ లో జరిగిన వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర తొలి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
*తెలంగాణలో వైఎస్సార్‌సీపీని పటిష్టపరచాలి
*పార్టీ రాష్ట్ర తొలి సర్వసభ్య భేటీలో వైఎస్ జగన్ దిశానిర్దేశం
*రాష్ట్రం కానివారు, భాష తెలియని వారు పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు
*ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన మనం ఎందుకు ముందుకు రాకూడదు?
*దమ్మూ, ధైర్యం, విశ్వసనీయత ఉంటే దేవుడు, ప్రజలే ఆశీర్వదిస్తారు
*నాలుగేళ్లలో టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం
*రాష్ట్రంలో వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు

సాక్షి, హైదరాబాద్: గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో బ్రిటిష్, నిజాం సామ్రాజ్యాలకు ఎదురొడ్డిన స్ఫూర్తిని నేతలు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని పార్టీని పటిష్టపరచాలని సూచించారు. రాష్ట్రం కానివారు, భాష తెలియని నేతలే రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నం చేస్తుంటే... ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన వైఎస్సార్‌సీపీ వంటి ఓ తెలుగు పార్టీ ఇక్కడి ప్రజలకు మంచి చేయడానికి ఎందుకు ముందుకు రాకూడదని ప్రశ్నించారు.

రానున్న నాలుగేళ్లలో టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయమని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లే మిగిలి ఉంటాయన్నారు. ప్రస్తుతం తమ బలం తక్కువగా ఉన్నా, రానున్న రోజుల్లో దమ్మూ, ధైర్యం, ప్రజా అండ, విశ్వసనీయత తో ముందుకు వెళ్తే ఆ దేవుడే ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి రోజైన బుధవారం మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్‌లో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.
జగన్ ఏమన్నారో ఆయన మాట ల్లోనే..
 ‘‘కొమురం భీం స్ఫూర్తిని మన పార్టీలోకి తెచ్చుకొని ముందడుగు వేసేందుకు ఈ సమావేశం ఓ నిదర్శనం. రాష్ట్రంలో పార్టీ, ఉంటుందా, ఉండదా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తులకు ఒక్కటే చెబుతున్నా. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. సోనియాది మన రాష్ట్రం కాదు. ఆమెకు మన భాష రాదు. అయినా కాంగ్రెస్ ఉండాలని అంటున్నారు. ప్రధాన మోడీకి సైతం ఇక్కడి భాష రాకపోయినా బీజేపీ బలపడటానికి ప్రయత్నం చేస్తోంది. తెలుగు భాష రాని వాళ్లే ఇక్కడ పరిపాలన చే యాలని ప్రయత్నిస్తుంటే, ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసి, ఇక్కడి ప్రజలకు మంచి చేయాలనుకునే తెలుగు పార్టీ ఎందుకు ముందుకు రాకూడదు?

 ఆ పార్టీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం..
 మరో నాలుగేళ్లలో టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది. కేసీఆర్‌కు ప్రజా వ్యతిరేకత రావడానికి ఏడాది పట్టొచ్చు. కానీ చంద్రబాబుకు మాత్రం నాలుగు నె లలు మాత్రమే పట్టింది. రోజుకో అబద్ధం, పూటకో మోసం చేస్తున్న బాబుకు ఏపీలో పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుంది. ఎవరిని మోసం చేయడానికి వచ్చావని ప్రజలు నిలదీసే రోజు వస్తుంది.

 ప్రజా వ్యతిరేకతలో టీడీపీ, టీఆర్‌ఎస్‌లు కొట్టుకుపోవడం ఖాయం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లు మాత్రమే మిగులుతాయి. ఈరోజు మన బలం తక్కువగా ఉందని, మన పార్టీ నేతలను గాలం వేసి లాక్కుంటున్నారు. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను టీఆర్‌ఎస్ అలాగే లాక్కుంది. పార్టీ నుంచి వెళ్లే నాయకులకు ఒక్కటే చెబుతున్నా. నాలుగేళ్ల తర్వాత టీఆర్‌ఎస్ కొట్టుకుపోతే ఎటు పోవాలో నేతలు గుండెల మీద చేయివేసి తేల్చుకోవాలి.

 ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు..
 నాయకుడు ఎదగాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజలు మనవైపు ఉన్నారా.. లేరా? అన్నదే ముఖ్యం. నాలుగేళ్ల కిందటే సోనియాను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన సమయంలో నేను, అమ్మ విజయమ్మ మాత్రమే ఉన్నాం. మా వెంట ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు, దేవుడే మమ్మల్ని నడిపించారు. మనలో ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలు, దేవుడు ఆశీర్వదిస్తారు. మనం సినిమాకు వెళ్తే అందులో 14వ రీల్ వరకు హీరోను విలన్లు అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. 14వ రీల్ దాకా విలన్ విజయం సాధించినా, 15వ రీల్‌లో హీరో ఒక్కడే అడ్డంగా కథ మార్చేస్తారు. దమ్మూ, ధైర్యం ఉంటే మనమూ అది సాధించవచ్చు.

 సంక్షేమ పథకాలను కత్తిరిస్తున్నాయి..
 తెలంగాణ, ఏపీలో టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాలు బడ్జెట్ కత్తిరింపుల పేరుతో పింఛన్లు, ఇళ్లు, ఫీజులకు కోత పెట్టే ఆలోచనలు చేస్తున్నాయి. కానీ వైఎస్ హయాంలో ప్రతి పేదవానికీ, ఇంటింటికీ సేవ చేశారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సువర్ణపాలన వైపు అడుగులు వేయిస్తుంది. రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంతున్నది లెక్కచేయకుండా సంక్షేమ ఫలాలను అమలు చేద్దాం. పార్టీ జెండా రెపరెపలాడించేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి.

 జనంలోకి షర్మిల...
 వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని మాటిచ్చా. ఆ మాటే నన్ను చాలా మార్చింది. ఎవరూ వెళ్లని గ్రామాలు, తిరగని పూరి గుడిసెలు తిరిగా, పేదల కష్టనష్టాలు తెలుసుకుంటే బుర్రలో ఆలోచనలు రావడం ఖాయం. మంచి నాయకుడు కావడం ఖాయం. ఖమ్మంలో ఓదార్పు పూర్తి చేసినా మిగతా జిల్లాల్లో వీలుకాలేదు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఓదార్పు అంటే బాగుండదు కనుక.. పరామర్శ పేరుతో నా సోదరి షర్మిల ఆ కుటుంబాలను కలుస్తారు. వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకునే బాధ్యతను షర్మిలపై పెడుతున్నా. వారికి తోడుగా, వారి బతుకులు మార్చే కార్యక్రమాన్ని చూసుకోవాలి. రానున్న రోజుల్లోనూ షర్మిల పార్టీ కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉంటుంది. వేరే ఏవైనా సమస్యలు ఉంటే నేనొస్తా.. ధర్నాకు దిగుతా. మీకు అండగా ఉంటా’’

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సర్వ సభ్య సమావేశంలో పలువురు నేతలు తీర్మానాలు చేశారు. మొదటగా ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నేతలు శోభానాగిరెడ్డి, వడ్డేపల్లి నర్సింగరావు సహా పలువురు నేతలకు సంతాపం తెలుపుతూ తీర్మానాలు చేశారు. అనంతరం మరికొన్ని తీర్మానాలను పార్టీ నేతలు కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, ఎ.విజయకుమార్, జి.నాగిరెడ్డి, బి.రవీందర్, సత్యం శ్రీరంగం, ఎం.జయరాజు చదివి వినిపించారు. తీర్మానాలు ఇవీ..
దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
24 గంటల విద్యుత్ అమలు జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మాదిరే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి
గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాలు వెంటనే ఇవ్వాలి
అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలి
ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలి
రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి
రూ.5 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం అందించి దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేయాలి
దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి
కరెంట్ కోతల వల్ల జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నిరోధానికి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి విద్యుత్‌ను ఇచ్చి ఆదుకోవాలి
Share this article :

0 comments: