పబ్లిసిటీకోసం బాబు ఎంతైనా ఖర్చు చేస్తారు.సాయమంటే చేతులు రావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పబ్లిసిటీకోసం బాబు ఎంతైనా ఖర్చు చేస్తారు.సాయమంటే చేతులు రావు

పబ్లిసిటీకోసం బాబు ఎంతైనా ఖర్చు చేస్తారు.సాయమంటే చేతులు రావు

Written By news on Thursday, April 2, 2015 | 4/02/2015


సాయమంటే బాబుకు చేతులు రావు: వైఎస్ జగన్విశాఖ జిల్లా గోకులపాడులో బాణసంచా పేలుడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎప్ జగన్
* వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం
* పబ్లిసిటీకోసం బాబు ఎంతైనా ఖర్చు చేస్తారు
* రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దమ్మిడీ సాయం చేయలేదు
* కార్మికులు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తామని అసెంబ్లీలో చెప్పారు..
* కానీ రూ.2 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నారు
* విశాఖ జిల్లాలో బాణసంచా పేలుడు
* మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ
* పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా
* ప్రభుత్వం నుంచి పూర్తి సాయం కోసం పోరాడతామని ప్రకటన

 
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు పబ్లిసిటీ కోసమైతే ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ బాధితులకు సాయం చేయమంటే గింజుకుపోతారు. అందుకు చేతులు రావు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దమ్మిడీ సాయం చేయలేదు. పైగా రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరిగాయని అన్నారు. చంద్రబాబుకు పబ్లిసిటీయే కావాలి. అందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే రూ.5 లక్షలు అయినా ఇస్తారు. అదే పబ్లిసిటీ రాదంటే శనక్కాయలు విసిరినట్లు విసురుతారు. అది కూడా ఒక్కొక్కరికీ ఒక్కోలా ఇస్తారు తప్ప బాధితులకు సరైన న్యాయం చేయరు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖపట్నం జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతిచెం దిన వారి కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను జగన్ బుధవారం పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఆయన రోడ్డుమార్గంలో పాయకారావుపేట చేరుకున్నారు.
 
 పేలుడులో మృతిచెందిన భూపతి సత్యన్నారాయణ కుటుంబాన్ని,తీవ్రంగా గాయపడిన బంగారి అప్పారావు కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. అనంతరం ఎస్.రాయవరం మండలం గోకులపాడు చేరుకుని.. మృతులు నూతి సత్యవతి, లింగపల్లి శేషమ్మ, సమ్మింగి రమణ, కడారి దుర్గాప్రసాద్, భూపతి లోవరాజు కుటుంబాలను ఆయన ఓదార్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కశిరెడ్డి విశ్వనాథం, నానేపల్లి దుర్గ, శెలంశెట్టి లక్ష్మి, కశిరెడ్డి కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాణసంచా పేలుడు సంభవించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా గోకులపాడులో జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే...
 
 రూ.2 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నారు
 ‘‘రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీలో కార్మికుడు చనిపోయినా రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. గోకులపాడులో బాణసంచా ఫ్యాక్టరీ 20 ఏళ్లుగా నడుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.2 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదెక్కడి న్యాయం? గాయపడిన వారికి ఏమీ ఇవ్వలేదు. గాయపడ్డ వారందరూ రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. సంపాదించే ఇంటిపెద్ద.. ఆసుపత్రిలో ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయింది.
 
 ప్రజలకోసం.. ముందుండేది జగనే
 ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ప్రమాదం జరిగినా ముందుండేది జగనే. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం జరిగితే ముందుగా నేనే వెళ్లాను. ఆ తరువాతే మంత్రులు, సీఎం వచ్చారు. ఇప్పుడు గోకులపాడుకు కూడా సీఎం రాలేదు. నేనే వచ్చాను. పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తూనే ఉన్నాం. ఇవాళే కాదు ఐదారేళ్లుగా ఎలా సాయం చేస్తోంది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడూ చేస్తాం. బాధితులకు న్యాయం చేయడంకోసం ఇప్పుడూ పోరాడతాం. ఈ వ్యవహారాన్ని వదిలే ప్రసక్తే లేదు. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డులు తెప్పించి సీఎంకు, కలెక్టర్‌కు లేఖలు రాస్తాను.
 
 మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలి. గాయపడినవారికి కూడా పరిహారం చెల్లించి ఆదుకోవాలి. అందుకోసం పార్టీ తరఫున పోరాడతాం. ప్రభుత్వం మెడలు వంచైనాసరే బాధితులకు న్యాయం జరిగేలా చేస్తాం’’ అని జగన్ అన్నారు. ఈ పర్యటనలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, కిడారి సర్వేశ్వరరావు, సుజయ్‌కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, నియోజకవర్గ సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, వంశీకృష్ణ యాదవ్, కోలా గురువులు, ఆదీప్‌రాజ్, బొడ్డేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 దిక్కులేని వాళ్లమయ్యాం..
 జగన్ వద్ద వాపోయిన బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలు
 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గోకులపాడు బాణసంచా పేలుడు మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల ఆవేదన చూసి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. తమకోసం వచ్చిన జగన్‌ను చూసి బాధిత కుటుంబాలు కన్నీటిపర్యంతమయ్యాయి. పాయకారావుపేటలోని మృతుడు భూపతి సత్యన్నారాయణ నివాసానికి జగన్ వెళ్లగా.. ఆయన్ను చూసి సత్యన్నారాయణ భార్య అప్పలనర్సు, కుమార్తె భవాని, కుమారుడు శ్రీనులు ఒక్కసారిగా రోదించారు. ‘ప్రమాదం ఎలా జరిగిందమ్మా’ అని జగన్ అడిగేసరికి కన్నీటిపర్యంతమై తమ బాధను వెళ్లగక్కారు. ‘‘పండ్ల వ్యాపారం కలసి రాలేదని పొట్టకూటి కోసం పదేళ్లుగా బాణసంచా పనిలోకి వెళుతున్నారు. వేతనం కొంత ఎక్కువ వస్తుందని ఆశపడ్డారు.
 
  కానీ అదే ప్రాణాలమీదకు తెచ్చింది. దిక్కులేని వాళ్లమైపోయాం’’ అని వాపోయారు. ‘కూతురు పెళ్లి కుదిరింది. డబ్బులు సర్దుబాటు చేసుకుని ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది’’ అని ఆవేదన వెళ్లగక్కారు. ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం అందిందా? అని ప్రశ్నించారు. రూ.2లక్షలే ఇచ్చారని అప్పలనర్సు బదులిచ్చారు. జగన్ స్పందిస్తూ.. పార్టీ తరఫున ఆదుకోవడమే కాదు.. ప్రభుత్వం నుంచి పూర్తి పరిహారం రూ.5 లక్షలు అందేలా పోరాడతానని భరోసాఇచ్చారు. ఇదిలా ఉండగా బాణసంచా పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బంగారి అప్పారావు కుటుంబ సభ్యులను కూడా జగన్ ఈ సందర్భంగా పరామర్శించారు.
 
 అప్పారావు పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. ‘‘కాలు బాగా దెబ్బతింది. కాలు తీసేయాలని డాక్టర్లు చెబుతున్నారు. మాకు ఏం చేయాలో తెలీడం లేదు’’ అని వారు వాపోయారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? అని వారిని జగన్ అడిగారు. తమకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆ కుటుంబ సభ్యులు చెప్పడంతో జగన్ నిర్ఘాంతపోయారు. అనంతరం ఆయన గోకులపాడు చేరుకుని మృతురాలు లింగపల్లి శేషమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భర్త అర్జబాబు, ఇద్దరు కుమారులను పరామర్శించారు. అలాగే సమ్మింగి రమణ, కడారి దుర్గాప్రసాద్, భూపతి లోవరాజు కుటుంబీకులను కూడా ఓదార్చారు.

లోవరాజు ముగ్గురు చిన్నపిల్లలను చూసి జగన్ చలించిపోయారు. పాయకారావుపేట నుంచి దార్లపూడి వచ్చి బాణసంచా తయారీ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కు లేకుండా పోయాడని లోవరాజు భార్య బోరున విలపించింది. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని.. అధైర్యపడొద్దని, ప్రభుత్వ మెడలు వంచి మీకు సరైన న్యాయం జరిగేలా చూస్తానని జగన్ హామీఇచ్చారు. పార్టీకూడా అండగా నిలుస్తుందన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కశిరెడ్డి విశ్వనాథం, నానేపలి ్లదుర్గ, శెలంశెట్టి లక్ష్మి, కశిరెడ్డి కృష్ణ కుటుంబీకులను కూడా ఆయన ఓదార్చారు.
Share this article :

0 comments: