ఏడాదిగా అమల్లోనే సెక్షన్-8 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏడాదిగా అమల్లోనే సెక్షన్-8

ఏడాదిగా అమల్లోనే సెక్షన్-8

Written By news on Thursday, June 25, 2015 | 6/25/2015

* ఇప్పుడు కొత్తగా అమలు చేయాలని మంత్రులే కోరడమేమిటి?
* ‘ఓటుకు కోట్లు’ కేసును పక్కదారి పట్టించడం కోసమే హంగామా
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారమే ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు ఇద్దరు సలహాదారుల నియామకం కూడా జరిగిపోయాక, అమలులో ఉన్న చట్టాన్ని కొత్తగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రులు కోరడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు ఇరుక్కున్న తరువాత ఆ విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు సర్కార్ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు తెలిసినంతవరకు గత ఏడాది జూన్ 2 వ తేదీ నుంచే విభజన చట్టంలోని అన్ని అంశాలతో పాటు సెక్షన్-8 కూడా అమలులోకి వచ్చినట్టేనని చెప్పారు. ఈ సెక్షన్ అమలులోకి రాబట్టే గవర్నర్‌కు ఇద్దరు సలహాదారుల నియామకం జరిగిందని తెలిపారు.

ఏడాది గడిచాక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు పట్టుబడిన తర్వాత సెక్షన్ -8 అమలు గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ఏపీ సీఎంగా  కాకుండా టీడీపీ అధ్యక్ష హోదాలోనో లేదంటే వ్యక్తిగా బాబుకు ఇబ్బందులు ఎదురుకాగానే టీడీపీ నేతలు దీనిని గురించి గగ్గోలు పెడితే జాతీయ స్థాయిలో రాష్ట్రం గురించి ఏమనుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. సెక్షన్-8తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణంతదితర అంశాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ ఉద్దేశమని రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు.
Share this article :

0 comments: