అంతిమంగా ధర్మమే విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంతిమంగా ధర్మమే విజయం

అంతిమంగా ధర్మమే విజయం

Written By news on Saturday, June 27, 2015 | 6/27/2015

* లోకాయుక్త తీర్పులో ఆ విషయం స్పష్టచేసింది
* కన్నెధార కొండ మైనింగ్ లీజ్‌పై ధర్మాన

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని పది హెక్టార్లలో మైనింగ్‌లీజు పొందిన తమ కుటుంబానికి చెందిన వర్జిన్‌రాక్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని లోకాయుక్త తీర్పు ద్వారా వెల్లడైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ... తనపైనా, తన కుటుంబంపైనా బురద జల్లేందుకు అనేక రాజకీయ సంస్థలు ఐదేళ్లుగా ప్రయత్నించినా...

అంతిమంగా ధర్మమే విజయం సాధించిందన్నారు. తాను వైఎస్సార్‌సీపీతో ఉన్నాననే కక్షతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా చాలా మంది వర్జిన్ రాక్ ప్రైవేట్  లిమిటెడ్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని ప్రచారం చేశారని గుర్తుచేశారు. సీఎం ఈ విషయమై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఇక్కడి జిల్లా యంత్రాంగంపైనా ఒత్తిడి తెచ్చి న్యాయస్థానాలకు వ్యతిరేకంగా చెప్పించారని ఆరోపించారు. తాను అధికారులపై ఎలాంటి ఒత్తిడి తేలేదని, మైనింగ్ చేయలేదని, అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని చెప్పారు.

వేసిన కేసుల్లో మూడుమార్లూ వర్జిన్‌రాక్ సంస్థకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని తెలిపారు. కేబినెట్ సభ్యులు ఒత్తిడి తేవడంవల్లే ప్రస్తుత కలెక్టర్ తొందరపడి ఎన్‌వోసీ రద్దు అని, లీజు క్యాన్సిల్ అని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఎవరు, ఎవరు పైనా ఎలాంటి ఆరోపణలు చేయకూడదని, చేసినా అది చెల్లదని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు. తానెప్పుడూ గిరిజనుల మనోభావాలకు, సంప్రదాయాలకు, స్థానికంగా ఉన్న వ్యక్తులకూ వ్యతిరేకం కాదన్నారు. ఇప్పుడు పది హెక్టార్లు తనకు అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి సూచిస్తూ కోర్టు తనకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా తాను మైనింగ్ చేపట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: