ఆ దౌర్భాగ్య పాలనకు ప్రజలు సిద్ధంగా లేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ దౌర్భాగ్య పాలనకు ప్రజలు సిద్ధంగా లేరు

ఆ దౌర్భాగ్య పాలనకు ప్రజలు సిద్ధంగా లేరు

Written By news on Wednesday, September 26, 2012 | 9/26/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: తొమ్మిదేళ్ల చంద్రబాబు దౌర్భాగ్య పాలనను మరోసారి అనుభవించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబుకు వాస్తవాలు చెప్పే ధైర్యం ఉంటే ‘వస్తున్నా.. మీకోసం’ యాత్ర ఆయన కోసమో, ప్రజల కోసమో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ.. ‘‘బాబు తొమ్మిదేళ్ల పరిపాలనలో విద్యుత్ చార్జీలను 8 విడతలుగా వందశాతం పెంచి, ఆరుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. 

విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగిన పాపానికి ముగ్గురిని పోలీసుల చేత కాల్చి చంపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో చక్రం తిప్పుతున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో లింకప్ చేస్తే ప్రతిఘటించలేదు. పైగా ఆ నిర్ణయానికి వంతపాడారు. పేదల కోసం ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెడితే ఈ మహానుభావుడు దానికి తూట్లు పొడిచారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మద్యపానంపై నిషేధం విధిస్తే దాన్నీ ఎత్తేశారు. 

పేదలపై చంద్రబాబుకున్న అభిప్రాయం ఎలాంటిదో ఆయనే స్వయంగా రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకం తేటతెల్లం చేస్తుంది. చంద్రబాబుది నిలకడలేని మనస్తత్వం. ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాట మాట్లాడతారు. అందుకే ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా, సినీ దర్శకుల ఆలోచనలతో టక్కుటమార వేషాలేసినా ప్రజలు నమ్మరు’’ అని అంబటి చెప్పారు. బాబు పాదయాత్ర పులిని చూసి నక్కవాత పెట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన చేయతలపెట్టిన యాత్రకు, మహానేత వైఎస్ మండుటెండల్లో చేసిన పాదయాత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అని అన్నారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=457363&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: