మీపక్షాన మేం నిలుస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీపక్షాన మేం నిలుస్తాం

మీపక్షాన మేం నిలుస్తాం

Written By news on Wednesday, December 17, 2014 | 12/17/2014


మోసం చేయడం చంద్రబాబు ప్రవృత్తి
రైతుల నుంచి మహిళల వరకు అందరినీ సీఎం మోసం చేశారు
విద్యుత్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం
జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సభలో వైఎస్ జగన్
 

అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు అన్ని  వర్గాలను మోసం చేస్తోంది. కడుపుమండిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు  ఇస్తున్నాం...’ అని వైఎస్సార్ సీపీ అధినే త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గాంధీ  నగర్‌లోని జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు.
 
విజయవాడ : ‘విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల నుంచి డ్వాక్రా మహిళలు, రైతుల వరకు అన్ని వర్గాల వారిని మోసం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవృత్తి. ఇచ్చిన మాట నిలుపుకోకుండా ప్రజలను మోసం చేసే వ్యక్తి సీఎం సీటులో ఎలా కూర్చుంటారు. సిగ్గుండాలి..’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. ఇందులోభాగంగా మంగళవారం గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యాన సభ నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సభలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పుస్తకంలో 30వ పేజీలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఉద్యోగుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ‘మనిషి అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. దాన్ని నిలుపుకొనేందుకు పనిచేయాలి. కానీ, చంద్రబాబు మాత్రం ఉద్యోగులు మొదలుకుని రైతుల వరకు అన్ని వర్గాలను మోసంచేస్తున్నారు..’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆయన ప్రకటించారు. ‘మీకు మా పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. మీ సమస్యలపై గట్టిగా పోరాడుతోంది. మీరు కూడా పోరాడండి. అయినప్పటికీ చంద్రబాబుకు సిగ్గురాకపోతే నాలుగేళ్ల తర్వాత కచ్చితంగా మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు వెంటనే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం..’ అని కాంట్రాక్టు కార్మికులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

మీపక్షాన మేం నిలుస్తాం : వైఎస్సార్ సీపీ నేతలు

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలుస్తామని శాసనసభలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు. చంద్రబాబు నిత్యం సింగపూర్ జపం చేస్తూ రాజధానిలో బహుళ అంతస్తులు, మెగా టవర్లు.. అంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సీఎంకు రాజధాని వ్యాపారం మినహా మరే విషయాలు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మడం వల్లే అందరికీ ఇటువంటి కష్టాలు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపన్న ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన రాష్ట్రాన్ని దత్తత తీసుకుంటే కనీసం కొంతమేలైనా జరిగేదని చెప్పారు.

వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు అందరినీ వంచిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ 18 వేల మంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను తక్షణమే క్రమబద్ధీకరిస్తామని, లేకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కేఎన్‌వీ సీతారామ్, కన్వీనర్లు పి.మధు, కాశీ, కో-కన్వీనర్లు ఆర్.ప్రవీణ్, మధుకుమార్, నాగరాజు, వైస్‌చైర్మన్లు ఎన్.శ్రీనివాస్, శివారెడ్డి, మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
 
 కరకట్ట నివాసితులకు అండగా ఉంటాం

‘కరకట్టపై నివాసం ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలంటే ఏలా. నివాసితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఖాళీ చేయించాలి..’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. మంగళవారం గుంటూరు నుంచి విజయవాడ వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని కనకదుర్గ వారధి దాటిన తర్వాత రాణిగారితోట వద్ద స్థానికులు, మహిళలు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ ఉంటున్నామని, రెండు రోజుల్ల ఇళ్లు కూల్చివేస్తామని అధికారులు చెప్పారని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా పార్టీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్‌రెడ్డి మీకు అందుబాటులో ఉంటారు. వారు అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తారు..’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు.
 
మూడు నెలలుగా పింఛను ఇవ్వడం లేదయ్యా..

‘అయ్యా... మూడు నెలలుగా నాకు పింఛను రావడం లేదు. గతంలో చక్కగా ప్రతినెలా మొదటి వారంలో అందేది. ఇప్పుడు పింఛను తీసుకోవాలంటే నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది..’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద సీతన్నపేటకు చెందిన వృద్ధురాలు నడిపూడి కనకమ్మ కన్నీటిపర్యంతమైంది. జింఖానా గ్రౌండ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె కలిశారు. తమ ప్రాంతంలో పింఛనుదా రులు పడుతున్న ఇబ్బందులను ఆమె వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛను ఇచ్చేవారని, ఇప్పుడు డబ్బులు పెంచినా సకాలంలో ఇవ్వకపోవడంతో తమకు సమస్యగా మారిందని ఆమె చెప్పారు. అందరికీ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: