మాఫీ పేరుతో మోసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాఫీ పేరుతో మోసం

మాఫీ పేరుతో మోసం

Written By news on Monday, May 25, 2015 | 5/25/2015


మాఫీ పేరుతో మోసంపులివెందులలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రైతు భరోసా యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం 
 సాక్షి, కడప: ‘‘రైతులకు రుణమాఫీ కాలేదు.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం డ్వాక్రా మహిళలకూ రుణాలు మాఫీ కాలేదు. ఉద్యోగం రాక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. కనీసం పండుటాకులైన అవ్వ, తాతలందరికీ పింఛన్ అందట్లేదు. అధికారంలోకి రాకముందు ప్రజలకు అన్నీ ఇస్తామని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఏదీ చేయడు. నమ్మించి బాగా మోసం చేస్తాడు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం బోనాలలో ఆదివారం రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలకెన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే పంగనామాలు పెట్టి కూర్చొన్నారని ఎద్దేవా చేశారు. ఏమి చేయకున్నా.. గడిచిన ఏడాదిలో ఏదో చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసగించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ వచ్చే నెల 3, 4 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్య సమర దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా అండగా ఉండాలని, అందరి తరఫున తాను పోరాడతానని స్పష్టం చేశారు.  
 
 గంగాధర్ చనిపోయి మూడు నెలలైనా అతీగతీ లేదు..  
 ‘‘బోనాలకు చెందిన రైతు మన్యం గంగాధర అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మూడు నెలలైనా ఆయన ఇంటికి ఒక్కరూ వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. పంచాయతీ కార్యదర్శి వచ్చి రాసుకుని వెళ్లారట. ఇప్పటివరకు పైసా పరిహారమందలేదు. ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలిచ్చి ఆదుకుంటామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందేతప్ప.. అలా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్ వస్తున్నారని ఒక్క అనంతపురంలో మాత్రం కాస్తో.. కూస్తో ఇచ్చారు.

చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అందులో రూ.1.50 లక్షలు అప్పులవారికి పంచడం, మిగిలిన రూ.3.50 లక్షలను బ్యాంకులో జాయింట్ అకౌంటుద్వారా ఉంచడం.. తర్వాత ఏ ఆరు నెలలకో, ఎనిమిది నెలలకో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద పండుగకో.. పబ్బానికో కొంతఇచ్చి సరిపుచ్చుతున్నారు. ఆ బాధిత కుటుంబసభ్యులకు ఆ మొత్తం అందిస్తే కదా.. వారు ఏదైనా చేసుకుని బతికేది..’’ అంటూ జగన్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
 
 చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్
 టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌తోనే ముందుకు నడుస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రతి కార్యక్రమాన్ని పబ్లిసిటీతోనే నడిపిస్తారని, రైతులకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పబ్లిసిటీ వస్తుందంటే ఎక్కడికైనా వస్తారన్నారు. పబ్లిసిటీ ఉండదని తెలిస్తే సమీప ప్రాంతాలకూ రారన్నారు. ప్రతి రైతును, అక్కా చెల్లెమ్మలను, అలాగే ఉద్యోగం పేరిట, నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నిరుద్యోగులను మాటలతో గారడీ చేసిన చంద్రబాబును జనం తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని జగన్ అన్నారు.
 
 డ్వాక్రా మహిళలైతే కనీసం రూ.10 వేలను కూడా కంతుల రూపంలో ఇస్తామని ప్రకటించిన బాబు తీరుపై శాపనార్థాలు పెడుతున్నారన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. లింగాల మండలం బోనాల, అంకేవానిపల్లె, కామసముద్రం, పులివెందుల, ఆర్.తుమ్మలపల్లె, సంతకొవ్వూరు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.బి.అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
 
 ధైర్యంగా ఉండండి
 రైతు కుటుంబాలకు జగన్ భరోసా
 పులివెందుల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాల, కామసముద్రం, పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లెలో అప్పులబాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదివారం జగన్ పరామర్శించారు.  ధైర్యంగా ఉండాలన్నారు.
 
 అందరివీ కన్నులు చెమర్చే బాధలే
 తొలుత నాగభూషణం శ్రేష్ఠి కుటుంబీకులను పరామర్శించగా వారు తమ ఇబ్బందులను పూసగుచ్చినట్లు చెప్పారు. చీనీ పంట సాగుకోసం వివిధ పద్దతుల్లో రూ.30లక్షల వరకూ అప్పులయ్యాయని తెలిపారు.అవి తీరే మార్గం లేక నాగభూషణం ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. రుణమాఫీ తమకు ఉపకరించలేదన్నారు.
 
 అదే విధంగా కోరా రామచంద్రా రెడ్డి కుటుంబీకులు రుణమాఫీని నమ్ముకొని దారుణంగా దెబ్బతిన్నామని జగన్ వద్ద బోరుమన్నారు. ప్రభుత్వం మోసం చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జగన్ గంగాధర్ కుటుంబీ కులను కలిశారు. వారు ఆయన వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కారు. నాలుగెకరాల్లో వేసిన చీనీ తోటల కోసం అప్పుల పాలయ్యామన్నారు.రుణ మాఫీ కాలేదని బయట అప్పు దాదాపు రూ.18 లక్షలు ఉందనీ తెలిపారు. తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచక గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Share this article :

0 comments: